deepak mishra
-
గవర్నర్ కు ఫిర్యాదు..ప్రధాన ముద్దాయి చంద్రబాబు
-
దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్
-
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. -
మాజీ సీజేఐ మిశ్రాపై బయటి ఒత్తిళ్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్ మిశ్రా బాహ్య శక్తుల ఒత్తిడికి లోబడి పనిచేశారని, దీని ప్రభావం న్యాయవ్యవస్థ పరిపాలనపై పడిందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అప్పటి సీజేఐ కొన్ని బాహ్య శక్తుల ప్రభావానికి లోబడి పనిచేశారు. ఆయన రిమోట్ కంట్రోల్ నియంత్రణలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ఆ వెలుపలి శక్తి రాజకీయ పార్టీనా లేక ప్రభుత్వమా అనే విషయం వివరించేందుకు, ఏఏ కేసుల కేటాయింపులో సీజేఐ ఏకపక్షంగా వ్యవహరించారో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా.. సుప్రీంకోర్టులోని అందరు జడ్జీలు ఇదే నమ్మకంతో ఉన్నారని జస్టిస్ కురియన్ బదులిచ్చారు. సీజేఐ జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న విషయం స్పష్టమయ్యాకే తాము మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతి వంటి కీలక కేసు కేటాయింపు కూడా అసంతృప్తికి కారణమా అని ప్రశ్నించగా ఫలానా విషయమంటూ ప్రత్యేకంగా చెప్పలేనన్నారు. కేసుల కేటాయింపుతోపాటు సుప్రీంకోర్టు పరిపాలన సంబంధిత అంశాలు కారణమని వివరించారు. కీలకమైన సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బీహెచ్ లోయా 2014లో నాగపూర్‌లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతిపై తిరిగి దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనది సహజ మరణమేనని స్పష్టం చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు పనితీరు మెరుగైందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. -
‘సుప్రీం’ సరైన దిశలో సాగలేదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సరైన దిశలో సాగలేదని మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నలుగురు జడ్జీలు జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ‘కోర్టు పనితీరుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని జస్టిస్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకునే మీడియా సమావేశం నిర్వహించాం’ అని ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించంగా..క్రమంగా మార్పు వస్తోందని తెలిపారు. అత్యున్నత న్యాయ వ్యవస్థపై వచ్చిన అవినీతి అరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. -
జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గురువారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులోని ప్రముఖ న్యాయమూర్తుల్లో జస్టిస్ జోసెఫ్ ఒకరని సుప్రీం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్ జోసెఫ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన ధర్మాసనంలో జోసెఫ్ ఉన్నారు. కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్ పరిరక్షణపై జస్టిస్ జోసెఫ్ చాలాసార్లు బహిరంగ లేఖలు రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ చట్టాన్ని జస్టిస్ జోసెఫ్ బెంచ్ కొట్టివేసింది. 1,035 తీర్పులతో టాప్–10 సుప్రీం జడ్జీల జాబితాలో పదో స్థానం దక్కించుకుని జస్టిస్ జోసెఫ్ అరుదైన ఘనత సాధించారు. కాగా, ఉన్నత న్యాయస్థానాలు యువ న్యాయవాదులను జడ్జీ బాధ్యతలు స్వీకరించేలా ఆకర్షించలేకపోతున్నాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి మొదలైన ప్రస్థానం.. జస్టిస్ జోసెఫ్ కేరళలో 1953, నవంబర్ 30న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎర్నాకులం జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూలులో పూర్తిచేశారు. అనంతరం తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం జస్టిస్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చివరకూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చి8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు. -
విలక్షణ న్యాయమూర్తి
-
అందరివాడు అయ్యప్ప
-
వారి అరెస్టుపై 2:1 మెజారిటీతో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అరెస్టుల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో శుక్రవారం తీర్పు ఇచ్చింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు హక్కుల కార్యకర్తలకు ప్రస్తుతమున్న గృహనిర్బంధాన్ని 4 వారాల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు తీర్పునిస్తూ తమ కేసును ఎవరు విచారించాలో ఎంచుకునే అధికారం నిందితులకు ఉండదని తేల్చారు. అసమ్మతి, రాజకీయ భిన్నాభిప్రాయం కారణంగా పోలీసులు ఈ అరెస్టులు చేపట్టలేదనీ, నిందితులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలను పరిశీలించామనీ, విచారణ సందర్భంగా ఏదో ఒకపక్షం వైపు తాము ప్రభావితమయ్యే అవకాశమున్నందున వాటి లోతుల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న మహారాష్ట్రలోని పుణె సమీపంలో దళిత సంఘాలు ‘ఎల్గర్ పరిషత్’ పేరుతో సమావేశం నిర్వహించాయి. సదస్సు అనంతరం అక్కడి భీమా–కోరేగావ్ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి పుణె పోలీసులు గత నెల 28న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో వీరిని విడుదల చేసి, అరెస్టులపై సిట్ ఏర్పాటు చేయాలంటూ చరిత్రకారిణి రొమీలా థాపర్‌తో పాటు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఐదుగురిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. తీర్పును స్వాగతించిన బీజేపీ.. దేశానికి వ్యతిరేకంగా, ప్రధాని మోదీ హత్యకు అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. గృహనిర్బంధం పూర్తయ్యాక వీరి కస్టడీ కోసం కోర్టుకెళతామన్నారు. ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి జాతీయ భద్రతతో చెలగాటమాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ విమర్శించింది. వీరికి మద్దతు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అసమ్మతి గొంతు నొక్కేస్తున్నారు ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ విభేదించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అసలైన ప్రజాస్వామ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో, సరైన విచారణ జరపకుండా ఈ ఐదుగురిని వేధిస్తే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు రాసుకున్నట్లు భావిస్తున్న లేఖలను మహారాష్ట్ర పోలీసులు మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణపై అనుమానాలు తలెత్తేలా పోలీస్ అధికారులు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందనీ, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని తన 43 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అన్నది ప్రెజర్ కుక్కర్‌కు ఉన్న సేఫ్టీ వాల్వ్ లాంటిదనీ, దాన్ని పోలీస్ బలంతో అణిచివేయలేరని పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసులు మీడియాను వాడుకోవడం ద్వారా విచారణ నిష్పాక్షికత దెబ్బతింటుందనీ, కేసుల్లో దోషులెవరో నిర్ధారించి తీర్పు చెప్పేందుకు పోలీసులు న్యాయమూర్తులు కాదని వ్యాఖ్యానించారు. ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనీ, కొత్తగా కేసును రిజస్టర్ చేయని విషయాన్ని ముగ్గురు జడ్జీలు తీర్పులో ప్రస్తావించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ -
శబరిమలలో మహిళల ప్రవేశంపై సంచలన తీర్పు
న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పక్కనబెడుతూ అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధం, అక్రమమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పులో వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ 4:1 మెజారిటీతో ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునివ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు. మతపరమైన ఏ విశ్వాసాలను కొనసాగించాలి, ఏ సంప్రదాయాలను రద్దు చేయాలనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించగా.. తాజా తీర్పుపై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. లింగ సమానత్వం కోసం పోరాటంలో ఇదో కీలక విజయమని పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఈ తీర్పు దురదృష్టకరమని కొన్ని హిందూ భక్త సంఘాలు, అయ్యప్ప భక్తులు పేర్కొంటున్నారు. తీర్పును అమలు చేస్తామని శబరిమల ఆలయ పరిపాలనను చూసుకునే ట్రావన్‌కోర్ దేవస్థాన మండలి తెలిపింది. భక్తిలో వివక్ష చూపలేం: జస్టిస్ మిశ్రా మహిళలకు ప్రవేశంపై శబరిమల ఆలయం పెట్టిన ఆంక్షలు తప్పనిసరి మత సంప్రదాయాలేమీ కాదనీ, మతం అనేది మనిషిని దైవత్వంతో అనుసంధానించే జీవన విధానమని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. భక్తిలో వివక్షను చూపలేమనీ, పురుషాధిక్య విధానాలతో ఆధ్యాత్మికతలో లింగ సమానత్వాన్ని పాటించకుండా ఉండలేమన్నారు. ‘ఆయప్ప భక్తులంతా హిందువులే. వారు ప్రత్యేక వర్గమేమీ కాదు. శరీర ధర్మ కారణాల ముసుగులో మహిళలను అణచివేయడం చట్టబద్ధం కాదు. నైతికత, ఆరోగ్యం తదితర కారణాలతో మహిళలను పూజలు చేయకుండా అడ్డుకోలేం. పురుషులు ఆటోగ్రాఫ్‌లు పెట్టేంత ప్రముఖులు అవుతున్నా మహిళలు సంతకం పెట్టే స్థితిలో కూడా లేరు’ అని అన్నారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక వర్గమన్న దేవస్థానం వాదనను జస్టిస్ మిశ్రా తోసిపుచ్చుతూ, ‘అయ్యప్ప భక్తులంటూ ప్రత్యేక వర్గంగా ఎవరూ లేరు. హిందువులెవరైనా శబరిమల ఆలయానికి వెళ్లొచ్చు. ఈ దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. శబరిమలలో నిషేధమెందుకు? శబరిమల ఆలయం బహిరంగ ప్రార్థన స్థలమే. అయ్యప్పను పూజించేవారు ప్రత్యేక వర్గమేమీ కాదు’ అని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న జస్టిస్ మిశ్రా పదవీ విరమణ పొందనుండగా, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఇచ్చిన చివరి తీర్పు ఇదే. తనతోపాటు జస్టిస్ ఖన్విల్కర్ తరఫున కూడా జస్టిస్ మిశ్రాయే 95 పేజీల తీర్పును రాశారు. మిగిలిన న్యాయమూర్తులు ఎవరికి వారు తమ తీర్పులు వెలువరించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారిమన్‌లు కూడా జస్టిస్ మిశ్రా అభిప్రాయాలతో తమ తీర్పుల్లో ఏకీభవించారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని ఆయన జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో మహిళలపై వివక్ష చూపుతున్న కేరళ హిందూ బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు–1965లోని 3(బి) నిబంధనను కూడా కొట్టేయాలని ఆయన అన్నారు. అది అంటరానితనమే: జస్టిస్ చంద్రచూడ్ వయసు, రుతుస్రావం స్థితి ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనం కిందకే వస్తుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. అది మహిళ గౌరవానికి భంగం కలిగించడంతోపాటు, పురుషుల కన్నా స్త్రీలు తక్కువనేలా ఉంటుందని అన్నారు. ‘రుతుస్రావం కారణంగా మహిళలు శుభ్రంగా లేరనే కారణం చూపుతూ వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఓ రకమైన అంటరానితనమే. రాజ్యాంగంలోని 17వ అధికరణం ప్రకారం అది అక్రమం’ అని చంద్రచూడ్ తన 165 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునః సమీక్ష కోరతాం: అయ్యప్ప ధర్మసేన సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమనీ, త్వరలోనే ఈ తీర్పుపై తాము పునఃసమీక్ష కోరతామని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ చెప్పారు. శబరిమల ఆలయ మాజీ పూజారి మనవడైన రాహుల్ మాట్లాడుతూ ‘మేం తప్పకుండా సుప్రీంకోర్టులో మా పోరాటం కొనసాగిస్తాం. అక్టోబరు 16 వరకు ఆలయం మూసే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మాకు సమయం ఉంది’ అని వెల్లడించారు. మహిళలు సహా పలువురు భక్తులు కూడా తాము విశ్వాసాలను నమ్ముతామనీ, సుప్రీంకోర్టు తీర్పు విచారకరమన్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు తాంత్రి కందరారు రాజీవారు మాట్లాడుతూ తీర్పు తనను నిరాశకు గురిచేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు. తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు. ఇదొక అద్భుత తీర్పు అనీ, హిందూ మతాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కేరళ మత సంస్థల శాఖ మంత్రి సురేంద్రన్ అన్నారు. మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్ ఆలయంలోకి కూడా మహిళల ప్రవేశం కోసం గతంలో ఉద్యమం చేపట్టిన తృప్తీ దేశాయ్ తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అభించిన విజయంగా ఆమె సుప్రీం తీర్పును అభివర్ణించారు. పురుషాధిక్య, అహంకార ఆలయ పాలక మండలికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. త్వరలోనే తాను శబరిమల ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె చెప్పారు. అవి రెండు పరస్పర విరుద్ధ హక్కులు జస్టిస్ ఇందు మల్హోత్రా దేశంలో లౌకిక వాతావరణం ఉండేలా చేసేందుకు పురాతన విశ్వాసాలను రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని జస్టిస్ ఇందు మల్హోత్రా తన తీర్పులో పేర్కొన్నారు. సమానత్వ హక్కు, అయ్యప్ప స్వామిని పూజించడానికి మహిళలకు ఉన్న హక్కు.. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని ఆమె అన్నారు. ‘ఈ అంశం శబరిమలకే పరిమితంకాదు. ఇతర ఆలయాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శబరిమలలో పూజలు చేయడం ఒక మత సంప్రదాయం. దానిని కాపాడాలి. హేతుబద్ధ భావనలను మతపరమైన విషయాల్లోకి తీసుకురాకూడదు. మత సంప్రదాయాలపై న్యాయసమీక్ష జరగడం సరికాదు. కోర్టులు హేతుబద్ధతను, నైతికతను దేవుణ్ని పూజించే విధానంపై రుద్దలేవు. కొందరిని అనుమతించడం లేదంటే దాని అర్థం వారంతా అంటరానివారని కాదు. ఆలయ సంప్రదాయాలు, నమ్మకాలపై అది ఆధారపడి ఉంటుంది. భారత్‌లో భిన్న మత విధానాలు ఉన్నాయి. ప్రార్థించేందుకు ఉన్న ప్రాథమిక హక్కును సమానత్వ సిద్ధాంతం ఉల్లంఘించజాలదు’ అని ఆమె తన తీర్పులో వెల్లడించారు. సామాజిక రుగ్మతలైన సతీసహగమనం వంటి అంశాల్లో తప్ప, మతపరమైన విశ్వాసాల్ని తొలగించే అధికారం కోర్టులకు లేదని ఆమె అన్నారు. ఈ ఆలయాల్లోనూ నో ఎంట్రీ హరియాణలోని కార్తికేయ ఆలయం, రాజస్తాన్‌లోని రణక్పూర్ గుడి తదితరాల్లోనూ మహిళలను అనుమతించరు. క్రీ.పూ ఐదో శతాబ్దానికి చెందిన కార్తికేయుడి ఆలయం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాలో ఉంది. కార్తికేయుడు బ్రహ్మచారి. అందుకే ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిని దేవుడు శపిస్తాడని భక్తుల నమ్మకం. రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జైన ఆలయం రణక్పూర్ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు. క్రీ.శ. 15వ శతాబ్దంలో నిర్మాణమైన దేవాలయాల సమూహ ప్రాంతమిది. ఈ ఆలయ సముదాయంలోకి రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళల ప్రవేశం నిషిద్ధం. అసోంలోని బార్పెటా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ ఆలయం పట్బౌసి సత్రాలోకి రుతుస్రావమయ్యే స్త్రీలు రాకూడదనే నిబంధన ఉంది. 2010లో అప్పటి అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ ఈ ఆలయ అధికారులను ఒప్పించి 20 మంది మహిళలకి ఆలయ ప్రవేశం కల్పించారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మహిళల్ని అనుమతించినా మళ్లీ నిషేధం విధించారు. తిరువనంతపురంలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశంపై కొన్ని పరిమితులున్నాయి. స్త్రీలు పద్మనాభుడికి పూజలు చేయవచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్లరాదు. వివాదం ఇలా ప్రారంభం 2006లో జ్యోతిష్కుడు ఒకరు ఆలయంలో దేవప్రశ్నం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరో మహిళ ఆలయంలోకి ప్రవేశించిందన్నారు. వెంటనే కన్నడ నటి, ప్రస్తుత కర్ణాటక మంత్రివర్గంలో సభ్యురాలు జయమాల తాను శబరిమల ఆలయంలోకి వెళ్లి అయ్యప్పస్వామి విగ్రహాన్ని తాకినట్లు చెప్పారు.దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదం ముదిరింది. ఆ తర్వాత మహిళలకు ప్రవేశం నిరాకరణను సవాల్ చేస్తూ సీనియర్ అడ్వకేట్ ఇందిర జైసింగ్ ఆధ్వర్యంలో మహిళా లాయర్లు కోర్టుకెక్కారు. వందల ఏళ్ల సంప్రదాయాల్ని కాదనే హక్కు కోర్టుకి ఉండదనీ, అలాంటి అంశాల్లో పూజారులదే తుది నిర్ణయమంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని లాయర్ల బృందం సుప్రీం కోర్టులో సవాల్‌చేసింది. శబరిమల ఆలయానికి ప్రాముఖ్యత ఉందనీ, ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోకూడదని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు వాదించింది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి, అందుకే రుతుస్రావ వయసులో మహిళల్ని రానివ్వడం లేదని చెప్పింది. దీన్ని మహిళలపై వివక్షగా చూడకూడదంది. హిందూమతంలోని వైవి«ధ్యాన్ని అర్థం చేసుకోలేక పిటిషినర్లు దానిని వివక్షగా చూస్తున్నాయని బోర్డు ఆరోపించింది. కొందరు మహిళా భక్తులు బోర్డుకు మద్దతుగా నిలిచారు. శబరిమల కేసు పూర్వాపరాలు... ► 1990: శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై నిషేధాన్ని తొలగించాలంటూ ఎస్.మహేంద్రన్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ► 1991, ఏప్రిల్ 5: కొన్ని వయస్సుల మహిళలపై తరాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సమర్ధిస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ► 2006 ఆగస్టు 4: శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ► 2007 నవంబర్: పిటిషన్‌కు మద్దతుగా కేరళలోని ఎల్డీఎఫ్ సర్కారు అఫిడవిట్ దాఖలు. ► 2016 ఫిబ్రవరి 6: కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మతాచారాన్ని పాటించే భక్తుల హక్కును పరిరక్షిస్తామని తెలిపింది. ► 2016 ఏప్రిల్ 11: మహిళల ప్రవేశంపై నిషేధం వల్ల స్త్రీ, పురుష సమ న్యాయ భావనకు ప్రమాదం ఏర్పడిందని కోర్టు వ్యాఖ్య. ► 2016 ఏప్రిల్ 13: ఆలయ సంప్రదాయం పేరుతో ప్రవేశాలను అడ్డుకోవడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు. ► 2016 ఏప్రిల్ 21: మహిళలను అనుమతించాలంటూ హింద్ నవోత్థాన ప్రతిష్టాన్, నారాయణాశ్రమ తపోవనమ్ పిటిషన్లు. ► 2016 నవంబర్ 7: అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలనే వాదనకు మద్దతు తెలుపుతూ కేరళ అఫిడవిట్ వేసింది. ► 2017 అక్టోబర్ 13: ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. -
అయోధ్య కేసు విచారణకు తొలగిన అడ్డంకులు
-
1994 తీర్పుపై పునఃసమీక్షకు నో
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది. ఇది భూసేకరణ వివాదమే 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం. అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్ అశోక్ భూషణ్ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్ అక్టోబర్ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వాగతించిన ఆరెస్సెస్ విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ) కుట్ర పన్నిందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్ గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. అసలు విచారణ ఇకపైనే.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్ఫుజూర్ రహమాన్ తరపున నామినీగా ఉన్న ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది. ‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్ నజీర్ ‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్ మఠ్ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు. అయోధ్య స్థల వివాద క్రమమిదీ.. ► 1528: బాబర్ సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు. ► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ► 1949: వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహాల స్థాపన ► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్ ► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు ► 1992, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం ► 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు ► 2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని సుప్రీం ఆదేశం, అలహాబాద్ హైకోర్టుకు కేసు బదిలీ. ► 2010, సెప్టెంబర్ 30: నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం. ► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ ► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహార్ సూచన ► నవంబర్ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్ బోర్డు. ► 2018, సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్ ధరమ్ దాస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ -
6 రోజుల్లో 8 తీర్పులు
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ–చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రాకు సుప్రీంకోర్టులో మరో ఆరు పనిదినాలే మిగిలున్నాయి. వచ్చే నెల 2న ఆయన పదవీ విరమణ పొందనున్నారు. అత్యధిక రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించిన సీజేఐగా జస్టిస్ మిశ్రా ఘనత వహించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేస్తూ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే ఓ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే మిగిలున్న ఆరు పనిదినాల్లో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని వివిధ ధర్మాసనాలు ఎనిమిది కీలక కేసుల్లో తీర్పులు వెలువరించనున్నాయి. ఆధార్ చెల్లుబాటు నుంచి అయోధ్య కేసు వరకు.. దేశ గతిని మార్చగల ఈ తీర్పులు చెప్పే వివిధ ధర్మాసనాల్లో మొత్తం కలిపి పది మంది న్యాయమూర్తులు పాలుపంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించే ఎనిమిది కీలక కేసులేంటో ఓ సారి పరిశీలిద్దాం.. 1. ఆధార్ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చిన్న పనికీ ఆధార్ కావాలంటున్న ఈ రోజుల్లో అసలు ఆధార్ కార్డే చెల్లుబాటు కాదనీ, దానికి రాజ్యాం గబద్ధత లేదనీ, వ్యక్తిగత గోప్యత హక్కును ఆధార్ ఉల్లంఘిస్తోందంటూ అనేక పిటిషన్లు వచ్చాయి. హైకోర్టు మాజీ జస్టిస్ కె.పుట్టస్వామి కూడా ఈ పిటిషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ఐదుగురు సభ్యుల ధర్మాసనం 40 రోజులపాటు ఏకధాటిగా విచారించి నాలుగున్నర నెలల ముందే తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పు ఈ ఆరు రోజుల్లో వెలువడనుంది. 2. అయోధ్య కేసు వివాదాస్పద రామ జన్మభూమి–బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడాల మధ్య సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయలా? వద్దా? అన్న విషయంపై ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం ప్రకటించనుంది. 3. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు ప్రభ్యుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ 2006లో ఎం.నాగరాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించనుంది. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లను తొలగించేం దుకు మోదీ ప్రభుత్వం విముఖంగా ఉండగా, తరతరాల నుంచి ఐఏఎస్ అధికారులుగా ఉంటున్నవారి కుటుంబీకులు కూడా రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారనీ, అదేమీ వారసత్వ హక్కు కాదని సుప్రీంకోర్టు అంటోంది. 4. శబరిమల ఆలయ ప్రవేశం కేసు 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమ తించాలా? వద్దా? అన్న విషయంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా కార్యకర్తలు స్త్రీలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తుండగా సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. 5. వ్యభిచారం కేసు వ్యభిచారం, వివాహేతర సంబంధం కేసుల్లో మహిళ తప్పు ఉన్నా కూడా ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ పురుషుడిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్న అంశంపై కూడా సీజేఐ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించనుంది. ఐపీసీ సెక్షన్ 497కు సవరణలు చేసి మహిళపై కూడా కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతించే అవకాశం ఉంది. 6. విచారణల ప్రత్యక్ష ప్రసారాల కేసు కోర్టుల్లో జడ్జీలు కేసులను విచారిస్తుండగా ఆ దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేయాలన్న కేసుకు సంబంధించి సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పనుంది. న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తే ముందుగా సీజేఐ విచారించే కేసులను ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 7. నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం కేసు రాజకీయ నేతలపై ఏదైనా కోర్టు నేరాలు, అభియోగాలు మోపితే.. వారిని ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ వచ్చిన ఓ ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం రాజకీయ నేతలు దోషులుగా తేలితేనే నిషేధం వర్తిస్తుండగా తుది తీర్పులు రావడానికి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. 8. లాయర్లుగా ప్రజాప్రతినిధులు.. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చాలా మంది న్యాయవాదులై ఉండి కోర్టుల్లో కేసులు కూడా వాదిస్తున్నారు. న్యాయవాదులుగా ఉన్నవారు పార్లమెంటుకు లేదా శాసనసభలకు ఎన్నికైతే వారికి ప్రభుత్వం వేతనం చెల్లిస్తోందనీ, వారు మళ్లీ సొంత సంపాదన కోసం కోర్టుల్లో కేసులు వాదిస్తూ ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు నెరవేర్చడం లేదు కాబట్టి వారు కోర్టులకు వెళ్లకుండా నిలువరించాలంటూ వచ్చిన పిటిషన్‌పై కూడా తీర్పు రానుంది. -
జడ్జీల నియామకం మాకొదిలేయండి: సుప్రీం
న్యూఢిల్లీ: జడ్జీల నియామకం అంశాన్ని తమకు విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థకు సంబంధించి దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన న్యాయవాదులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ఇది జడ్జీల నియామకానికి సంబంధించిన అంశం. దీనిని మాకు విడిచిపెట్టండి. ఆ విషయాన్ని మేం చూసుకోగలం. ఇలాంటి పిటిషన్లను మేం పరిగణనలోకి తీసుకోం’ అంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. -
కట్నం వేధింపులపై సుప్రీం తీర్పు సవరణ
న్యూఢిల్లీ: వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. తాము గతంలో ఇచ్చి తీర్పు చట్టాలకు లోబడి లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసుల్లో ఇరుపక్షాలు రాజీకి వచ్చినా కేసును కొట్టేసే అధికారం కేవలం హైకోర్టులకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది. మరోవైపు కుష్టు వ్యాధిగ్రస్తులు రిజర్వేషన్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా దివ్యాంగుల చట్టం–2016లో నిబంధనలు సవరించే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. -
సీజేఐగా రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్(63) నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి నియమితులైన మొట్టమొదటి సీజేఐ ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐగా లా కమిషన్‌కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని మోదీకి పంపగా ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయమంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ అంశాలకు సంబంధించి సీజేఐకు వ్యతిరేకంగా గొంతెత్తిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ కూడా ఉండటంతో సీజేఐగా ఆయన నియామకంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నార్సీ, లోక్‌పాల్ కేసుల విచారణలో కీలక తీర్పులు వెలువరించారు. -
రాజ్యాంగ హక్కులే మూలాధారం
పట్నా: ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజానికి రాజ్యాంగం రక్షణ కల్పించిన హక్కులే మూలాధారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. పట్నాలోని భారతి విశ్వవిద్యాలయంలో జరిగిన డా.పతంగ్‌రావు కదమ్ స్మారకోపన్యాసంలో జస్టిస్ మిశ్రా ప్రసంగించారు. పాక్షిక యూథనేషియా(స్వచ్ఛంద మరణం)కు గతంలో సుప్రీం అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ..‘ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ బతికే హక్కున్న ప్రతి పౌరుడికి చనిపోయే హక్కు కూడా ఉంటుంది. దీని ఆధారంగానే తీర్పు ఇచ్చాం’ అని వెల్లడించారు. -
తదుపరి సీజేఐగా జస్టిస్ గొగోయ్!
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి సుప్రీంలో తన తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ గొగోయ్ పేరును మిశ్రా ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ దీపక్ మిశ్రా చేసిన సిఫార్సును త్వరలోనే కేంద్ర న్యాయశాఖకు పంపనున్నట్లు వెల్లడించాయి. అన్ని సవ్యంగా సాగితే అక్టోబర్ 3న జస్టిస్ గొగోయ్ సీజేఐగా ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సాధారణంగా పదవీకాలం ముగిసేందుకు నెల రోజుల ముందుగా తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సీజేఐని కోరుతుంది. దీంతో తన తర్వాత అత్యంత సీనియర్‌ను తర్వాతి సీజేఐగా ప్రస్తుత సీజేఐ ప్రతిపాదిస్తారు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం కేంద్రం తదుపరి సీజేఐ నియామకంపై జస్టిస్ మిశ్రాకు లేఖ రాసింది. దీంతో సంప్రదాయాన్ని అనుసరించి జస్టిస్ గొగోయ్ పేరును జస్టిస్ దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు నిర్వహణతో పాటు కేసుల కేటాయింపులో సీజేఐ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రిటైర్డ్ జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలసి జస్టిస్ గొగోయ్ ఈ ఏడాది జనవరిలో మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐ మిశ్రా ప్రతిపాదించకపోవచ్చని వార్తలొచ్చాయి. సీజేఐ ప్రతిపాదనలను న్యాయశాఖ ప్రధాని ముందు ఉంచుతుంది. అనంతరం కొత్త సీజేఐ నియామకంపై ప్రధాని రాష్ట్రపతికి సలహా ఇస్తారు. అసోం నుంచి సుప్రీంకోర్టు వరకూ.. జస్టిస్ గొగోయ్ 1954, నవంబర్ 18న అసోంలో జన్మించారు. 1978లో బార్ అసోసియేషన్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత గొగోయ్ గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001, ఫిబ్రవరి 28న గొగోయ్ గువాహటి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, సెప్టెంబర్‌లో పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీఅయిన గొగోయ్, మరుసటి ఏడాది ఫిబ్రవరిలో అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్ 23న జస్టిస్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అసోంలో ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ను గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనమే పర్యవేక్షించింది. మద్రాస్ హైకోర్టు వివాదాస్పద మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును జస్టిస్ చలమేశ్వర్‌తో కలసి విచారించారు. అయితే 2016లో సౌమ్య అనే యువతి రేప్, హత్య కేసులో దోషికి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం యావజ్జీవంగా మారుస్తూ ఇచ్చిన తీర్పుపై అన్నివర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. -
న్యాయవ్యవస్థలో మౌలిక కొరత: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ పరిపాలనపై మచ్చ రావడానికి ముందుగానే న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి ఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మౌలిక సౌకర్యాల లేమికి ఆర్థికపరమైన అవరోధాలను సాకుగా చూపకూడదన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నిర్వహించిన సింపోజియంలో రాష్ట్రపతి కోవింద్‌తోపాటు సీజేఐ పాల్గొన్నారు. ‘మౌలిక వనరుల కొరత తీవ్రమై, న్యాయ పరిపాలనకు హాని కలిగించక ముందే చర్యలు తీసుకోవాల్సి ఉంది. నాణ్యమైన, జవాబుదారీ తనంతో కూడిన సత్వర న్యాయం అందించడానికి, న్యాయ ఉద్దేశం నెరవేరేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ అన్నారు. సామాన్యుడికి న్యాయం అందించటానికి, కక్షిదారులకు వసతులు, న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే న్యాయస్థానాల పరిధి పెరగాలన్నారు. కాగా, చాలా కేసుల్లో కక్షిదారులు వాయిదాలు కోరడం సర్వసాధారణంగా మారిందని, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులకు ఇది కూడా ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. -
‘ఎన్నికల్లో అక్రమాల’ కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: ఎన్నికల అక్రమాలను తక్షణ అరెస్టుకు వీలైన నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘వాదనలు విన్నాం. ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల అక్రమాలుగా పరిగణించే డబ్బులు పంచడం, తప్పుడు ప్రకటనలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ద్వారా జరిగే పలురకాల దుర్వినియోగం తదితర అక్రమాలను తక్షణం అరెస్టుకు వీలుకల్పించే నేరాలుగా పరిగణించాలని, కనీసం రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్లో పేర్కొన్నారు. 2000 తర్వాత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన తెలిపారు. -
‘ఆళ్వార్ మూకదాడి’పై చర్యలేవి?
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో జరిగిన మూకదాడి ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో 7రోజుల్లోగా నివేదిక అంద జేయాలని స్పష్టం చేసింది. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఆళ్వార్‌లో గత జూలై 20న రక్బార్ ఖాన్ అనే పాడిరైతుపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ఈ ఘటనకు సంబం ధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదలంటూ కోర్టు ధిక్కర ణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాలా దాఖలు చేశారు. ప్రభుత్వ సీఎస్, డీజీపీలతోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ ఘటనపై ఏమీ చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని రాజస్తాన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. మూకదాడులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం కొత్త చట్టం చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అంగీకారాన్ని తెలుపుతూ సెప్టెంబర్ 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. -
నాశనం చేయడం సులభం; సీజేఐ మిశ్రా
న్యూఢిల్లీ: ‘ఓ వ్యవస్థను విమర్శించడం, దానిపై దాడులు చేయడం, నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ వ్యవస్థ పనిచేసేలా మార్చ డం సవాళ్లతో కూడుకున్న కష్టమైన పని’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జస్టిస్ మిశ్రా మాట్లాడారు. వ్యవస్థలోని వ్యక్తులు తమ వ్యక్తిగత కోర్కెలు, లక్ష్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో, హేతుబద్ధతతో, పరిణతి, బాధ్యతలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినప్పుడే వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని అన్నారు. ‘న్యాయవ్యవస్థను బలహీన పరిచేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు. మనమంతా కలసి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి’ అని పేర్కొన్నారు. న్యాయ దేవత చేతిలోని త్రాసు సమన్యాయాన్ని సూచిస్తుందనీ, ఆ సమానత్వానికి భంగం కలిగించే ఎవరైనా ఆ దేవతను బాధ పెట్టినట్లేనని జస్టిస్ మిశ్రా అన్నారు. న్యాయ దేవత కన్నీరు కార్చేందుకు తాము ఒప్పుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) విస్తృతి దెబ్బతినకుండా ఉండాలంటే కొంత పరిశీలన తప్పనిసరన్నారు. తక్కువ విస్తృతి కలిగిన అంశాలపై పిల్ వేసేందుకు చెల్లించాల్సిన రుసుమును సుప్రీంకోర్టు ఇటీవల భారీగా పెంచడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ తదితర గొప్పవాళ్ల గుర్తుగా ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిని పొగడాలని రవి శంకర్ కోరగా, జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ‘వారంతా దేశం కోసం పోరాడారు. మన పొగడ్తల కోసం కాదు’ అని అన్నారు. -
మానవీయ విలువలతోనే హక్కుల పరిరక్షణ
ఎస్కేయూ (అనంతపురం) : ‘మానవత్వంలోనే దైవ త్వం ఉంది. మానవీయ విలువలను కలిగి ఉంటూ మానవ హక్కులను కాపాడుకోవాలి’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ‘మానవీయ విలువలు– చట్టబద్ధమైన ప్రపంచం’అనే అంశంపై అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ న్యాయ సేవా సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సుకు జస్టిస్ దీపక్ మిశ్రా ముఖ్య అతిథిగా, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 750 మంది న్యాయ నిపుణులు, 300 మంది న్యాయ విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ... ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా హక్కులను అనుభవించాలన్నారు. అహాన్ని తొలగించుకుంటేనే శాంతి లభిస్తుందని చెప్పారు. ఆధ్యాత్మికత హేతుబద్ధంగాను, హేతుబద్ధమైన ఆధ్యాత్మికంగానూ ఉండాలన్నారు. మన రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలే కాకుండా మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ధర్మమే సమాజాన్ని రక్షిస్తుందని.. సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణ, శ్రీసత్యసాయి సేవా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు జతీందర్ చీమా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఎస్ఎస్ నాగానంద్, ఆలిండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు నిమీశ్ పాండే, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గోరక్షక్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
-
ఆ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కొంత మంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి ప్రజలపై దాడిచేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోడానికి వీల్లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దాడులను అరికట్టేందుకు చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.