ESI card
-
ఇక ఈఎస్ఐ మొబైల్ అంబులెన్స్‌లు!
మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యసేవలు సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐ) కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులకు మరింత చేరువలో వైద్య చికిత్సలు అందించేందుకు మొబైల్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయిం చింది. ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, ప్యానల్ క్లీనిక్‌లు అందుబాటులోలేని మారుమూలప్రాంతాల్లో మొబైల్ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ఈ అంబులెన్స్‌ల్లో రక్త, మూత్ర పరీక్షలతోపాటు బయోకెమిస్ట్రీ, పెథాలజీ, హిస్టోపెథాలజీకి చెందిన 76 పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు కల్పిస్తోంది. అంబులెన్స్‌లో ఒక వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు తొలి విడతలో తెలంగాణకు పది వాహనాలు కేటాయించింది. వీటిని నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వినియోగించాలని ఈఎస్ఐసీ భావిస్తోంది. ఈఎస్ఐ సేవలు ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఈఎస్ఐ కార్డు కలిగిన 2 వేల కార్మికులు ఉంటేనే అక్కడ డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ మంది ఉన్నచోట వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న విషయా న్ని ఈఎస్ఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మొబైల్ సేవలకు నడుం బిగించింది. సులభంగా కార్మికుల చెంతకు చేరేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 108, 104 అంబులెన్స్ తరహాలో కార్మికులకు సులభంగా గుర్తిండిపోయేలా ఒక నంబర్ ఏర్పాటు చేయనున్నారు. -
ఈఎస్ఐ వైద్యసేవలపై పర్యవేక్షణ సంఘం
పాలక మండలి, కార్యనిర్వాహక మండలి ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కార్మిక బీమా వైద్యసేవలు (ఈఎస్ఐ) కార్డు కలిగిన వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యవేక్షణ సంఘంలో 11 మంది సభ్యులతో పాలక మండలి, 8 మంది సభ్యులతో కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయనుంది. పాలక మండలికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా, కార్య నిర్వాహక మండలికి రాష్ట్ర కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వీటిలో సభ్యులుగా స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాల నేతలకు చోటు కల్పిస్తారు. సంబంధిత ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించి, అభిప్రాయాలు, సలహాలు సూచనలు కోరుతూ ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర కార్మిక శాఖకు లేఖ అందింది. నిధులు ఖర్చు చేయాలన్నా, కొత్తగా ఆస్పత్రులను విస్తరించాలన్నా, నియామకాలు జరపాలన్నా ఈ సంఘం నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈఎస్ఐ వైద్య సేవలకు గాను ప్రస్తుతం కేంద్రం 87.5 శాతం నిధులు విడుదల చేస్తుండగా... దాన్ని 90 శాతానికి పెంచుతూ ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్ణయించింది. -
వైద్య బిల్లుల చెల్లింపు చకచకా!
♦ ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులకు వెంటనే రీయింబర్స్మెంట్ ♦ నెలల తరబడి ఎదురుచూపులకు చెక్ ♦ రీయింబర్స్‌మెంట్‌కు ప్రత్యేక బడ్జెట్ ♦ కార్మికశాఖకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కార్డుదారులకు శుభవార్త! కార్మికులు అత్యవసర సమయంలో ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందితే వాటి బిల్లుల చెల్లింపు విషయంలో నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. దీంతో కార్మికులు వైద్యం కోసం చేసిన అప్పులు గుదిబండగా మారేవి. ఇకపై వీటికి చెక్ పెట్టాలని ఈఎస్ఐ డెరైక్టర్ దేవికా రాణి కొత్త ప్రతిపాదన చేశారు. వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దానికి ఒక అధిపతి (హెడ్ఆఫ్ ది డిపార్ట్మెంట్)ని నియమించాలని నిర్ణయించారు. తద్వారా కార్మికుల వైద్య బిల్లులకు త్వరతగతిన చెల్లింపులు జరగనున్నాయి. ఈమేరకు ఈఎస్ఐ డెరైక్టరేట్ కార్యాలయం నుంచి కార్మికశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. అక్కడ గ్రీన్‌సిగ్నల్ లభిస్తే వెనువెంటనే కార్యరూపం దాల్చనుంది. దీనిద్వారా 10 లక్షల మంది కార్మికులకు లబ్ధిచేకూరనుంది. పెండింగ్‌లో 7 వేల దరఖాస్తులు ఈఎస్ఐ కార్డుదారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ఆ బిల్లులకు తొలుత సంబంధిత డిస్పెన్సరీలో ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఈఎస్ఐ డెరైక్టరేట్ కార్యాలయానికి పంపాలి. అక్కడ మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగం పరిశీలిస్తుంది. అనంతరం వైద్యుల కమిటీ ఆమోదం పొందిన తర్వాత కూడా అకౌంట్స్ విభాగం నుంచి డబ్బులు విడుదల కావడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. ప్రస్తుతం రీయింబర్స్మెంట్ విభాగం వద్ద 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ప్రతీ నెల దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నా... ఏడు వందలకు మించి పరిష్కారం కావడంలేదు. దీంతో కార్మికుల వైద్యబిల్లులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. గత ఫిబ్రవరి నుంచి వచ్చిన బిల్లుల వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కేవలం నెల రోజుల్లో రీయింబర్స్మెంట్ పొందవచ్చు.