ఈఎస్‌ఐ వైద్యసేవలపై పర్యవేక్షణ సంఘం
పాలక మండలి, కార్యనిర్వాహక మండలి ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కార్మిక బీమా వైద్యసేవలు (ఈఎస్‌ఐ) కార్డు కలిగిన వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యవేక్షణ సంఘంలో 11 మంది సభ్యులతో పాలక మండలి, 8 మంది సభ్యులతో కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయనుంది.
పాలక మండలికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా, కార్య నిర్వాహక మండలికి రాష్ట్ర కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వీటిలో సభ్యులుగా స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాల నేతలకు చోటు కల్పిస్తారు. సంబంధిత ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించి, అభిప్రాయాలు, సలహాలు సూచనలు కోరుతూ ఈఎస్‌ఐ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర కార్మిక శాఖకు లేఖ అందింది. నిధులు ఖర్చు చేయాలన్నా, కొత్తగా ఆస్పత్రులను విస్తరించాలన్నా, నియామకాలు జరపాలన్నా ఈ సంఘం నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈఎస్‌ఐ వైద్య సేవలకు గాను ప్రస్తుతం కేంద్రం 87.5 శాతం నిధులు విడుదల చేస్తుండగా... దాన్ని 90 శాతానికి పెంచుతూ ఈఎస్‌ఐ కార్పొరేషన్ నిర్ణయించింది.