harrasments
-
నా భర్తను చిత్రహింసలు పెట్టి వాంగ్మూలం తీసుకున్నారు: వర్రా కళ్యాణి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: తన భర్తను నవంబర్ 11వ తేదీన అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య వర్రా కళ్యాణి చెప్పారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వర్రా కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘కర్నూలు టోల్‌ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీన నా భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో మీడియాకి విడుదల చేస్తున్నాను. మూడు రోజులు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారు. నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలి. అదుపులోకి తీసుకునే వరకూ పోలీసులకు వర్రా రవీంద్రారెడ్డి ఎవరో కూడా తెలియదు.మాస్కులు వేసి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పారని మెజిస్ట్రేట్ ముందు నా భర్త వాంగ్మూలం ఇచ్చారు. విపరీతంగా రవీంద్రారెడ్డిని కొట్టారని పక్కన ఉన్నవాళ్లు ఉదయ్,సుబ్బారెడ్డి చెప్తున్నారు. పోలీసులు తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు. నా భర్తకు న్యాయం జరగాలి..స్వయంగా నేను గాయాలు చూశాను. అంత చిత్ర హింసలు పోలీసులు ఎందుకు పెట్టారు? వాళ్ళకు పై నుంచి ఉన్న ఒత్తిడి వల్లే ఇలా చిత్రహింసలు పెట్టారు. ఒప్పుకోకపోతే మీ భార్య,పిల్లలపై కూడా కేసులు పెడతామన్నారు. మా ఆయన ప్రశ్నించారంతే..అసభ్య పోస్టులు పెట్టలేదు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి నా భర్త పేరుపై 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టాడు’అని వర్రా కళ్యాణి తెలిపారు. -
సందేశ్‌ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్‌ఖాలీలోని ఝుప్‌ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్‌చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్‌యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్‌ను అరెస్ట్‌చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్‌కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..
సాక్షి, అన్నమయ్య: నర్సింగ్ చదువుతున్న అమ్మాయిల వెంటపడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలకు దిశ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, పోకిరీలు.. దిశ పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. మరొకసారి అమ్మాయిల వెంటపడి, వేధింపులకు గురిచేయమని ఇద్దరు యువకులు పోలీసులకు లేఖ రాసి ఇచ్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరులో నర్సింగ్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు శనివారం కాలేజ్‌కు వెళ్తున్నారు. ఇద్దరు యువకులు అమ్మాయిలను అనుసరించి వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధిత యువతులు దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ టీమ్ విద్యార్థినుల ఉన్న లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న సురేష్, చంద్ర శేఖర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కమారు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేయమని యువకులు లిఖితపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. ఇక, దిశ యాప్‌ను కొన్ని రోజుల కిందటే డౌన్లోడ్ చేసుకున్నట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. దిశ SOSకు కాల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు చాలా బాగుందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కీలక మలుపు తిరిగింది. ఆదివారం నిరసన దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్, ఖాప్ మహమ్ 24 నేత మెహర్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దేవ్ సింగ్ సిర్సా తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ‘ఇకపై ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనల్లో పాల్గొంటాం. రెజ్లర్లకు వెలుపలి నుంచి మద్దతు తెలుపుతామన్నారు. వారికేదైనా సమస్య వస్తే తోడుంటాం’అని రైతు సంఘాల నేతలు చెప్పారు. బాధిత రెజ్లర్ల డిమాండ్ల కోసం ఈ నెల 11–18 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి, సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ నిరసనలు కావు..తమది రాజకీయేతర సంస్థ అని చెప్పారు. ఇలా ఉండగా, తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆదివారం జంతర్‌మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)ను మోహరించారు. ఇలాఉండగా, నిరసనకు దిగిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు తెలపడంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానన్నానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆరోపణలు రుజువైతే శిక్ష విధించండి. దోషిగా తేలితే నన్ను కొట్టి చంపండి’అని పేర్కొన్నారు. -
న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు
న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాప్ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్ బజరంగ్ పూనియా తెలిపాడు. దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్ ‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గంగూలీ ఏమన్నాడంటే... భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ముగిస్తున్నాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ నెరవేరడంతో కేసును ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఎదురుదెబ్బ కాదని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్, వినేశ్, సాక్షి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని దీనిని కూడా పరిశీలిస్తామని వినేశ్ తెలిపింది. -
8 ఏళ్లప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు
చెన్నై/జైపూర్: నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించారని చెప్పారు! ‘మోజో స్టోరీ’ డిజిటల్ వార్తా చానల్ ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన ‘వుయ్ ది విమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఒక మగవాడిగా దాన్ని జన్మహక్కుగా భావించేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. -
పట్టు విడువని రెజ్లర్లు.. చర్యలు చేపట్టిన కేంద్రం.. నిరసన విరమణ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను తొలగించడం సహా డిమాండ్లన్నీ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజర్లు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ ధర్నాను విరమించారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలపై ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ డబ్ల్యూఎఫ్ఐ, దాని చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలాఉండగా.. ‘దంగల్’లో దిగితే ప్రత్యర్థుల పట్టుపట్టే రెజ్లర్లు అదే జోరుతో ధర్నాతో హడలెత్తించి.. డిమాండ్లు సాధించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో ఏళ్ల తరబడి తిష్టవేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను గద్దె దించేదాకా ధర్నా విరమించబోమని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, రవి దహియా, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పున్నా వెరువమని, అన్నింటికి సిద్ధపడే న్యాయ పోరాటానికి దిగామని చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని వారంతా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వ్యవహరించారు. అత్యవసర భేటీ నిర్వహించి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని ఉష హామీ ఇచ్చారు. మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ... లైంగిక ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న స్టార్ రెజ్లర్ల డిమాండ్‌పై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పందించింది. అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష నేతృత్వంలోని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులు శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు ఈసీ సభ్యులైన మాజీ షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్, సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే, ప్రత్యేక ఆహ్వానితులుగా శివ కేశవన్ ఈ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు కావడంతో వీటిపై నిగ్గు తేల్చేందుకు దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. ఏజీఎం తర్వాతే బ్రిజ్‌భూషణ్ స్పందన గోండా (ఉత్తర ప్రదేశ్): తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూ ఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ త్వరలోనే ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతీక్ భూషణ్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు. ‘ఈ నెల 22న డబ్ల్యూఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది ముగియగానే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు’ అని అన్నారు. -
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
పుల్లారెడ్డి ప్రజ్ఞారెడ్డికి అండగా నిలిచిన ద్రౌపది ముర్ము.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు వేధింపుల వ్యవహారం చివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరుకుంది. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రౌపది ముర్ముకు పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి వేధింపుల విషయమై వినతి పత్రం అందజేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞారెడ్డి వినతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, అంతుకు ముందు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి వేధిస్తున్నాడని గతంలో ఫిర్యాదు చేశారు. అంతుకుముందు.. రాఘవరెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని ప్రజ్ఞారెడ్డి వాపోయారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు. -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో..
సాక్షి, హైదరాబాద్: రహస్యంగా ఓ మహిళ సెల్ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసి.. ఓ మహిళను వేధించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఓ వివాహితకు ఏడాది క్రితం ఫేస్బుక్లో రామచంద్రాపురం బీడీఎల్ కాలనీకి చెందిన తాళ్ల అనుప్ గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరచూ మాట్లాడుకోవటం, కలుసుకోవటం చేసేవాళ్లు. గత అక్టోబర్‌లో బాధితురాలిని బయట కలిసిన నిందితుడు ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో ‘సర్బ్యూస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. దీంతో సెల్‌ఫోన్ హ్యాక్ చేసి.. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ సంభాషణలు సేకరించాడు. అప్పటినుంచి ఆమెను శారీరక సంబంధం కొనసాగించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేని పక్షంలో ఫొటోలు, వీడియోలు భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తామనని బెదిరించాడు. దీంతో ఆమె అనుప్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో అతను వేరే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. సెక్షన్ 354 (డీ), 506 కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: పండగ వేళ విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య 64 మంది పోకిరీల ఆటకట్టు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఆరు వారాల్లో రాచకొండ షీ టీమ్స్‌కు 64 మంది ఆకతాయిలు చిక్కారు. ఇందులో 23 మంది మైనర్లు కావడం గమనార్హం. 57 కేసు లు నమోదు కాగా.. వీటిలో 24 ఎఫ్ఐఆర్లు, 23 ఈ–పెట్టీ కేసులు, 10 కౌన్సెలింగ్ కేసులున్నాయి. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, రాచకొండ షీ టీమ్స్ సంయుక్తంగా ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీస్‌లో వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాయి. అలాగే షీ టీమ్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి.. మెట్రో రైల్ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కిన 16 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 45 రోజుల్లో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు రాచకొండ షీ టీమ్స్ 136 చైల్డ్ మ్యారేజ్‌లను అడ్డుకున్నాయి. -
బీజేపీ పాలనలో రైతులకు వేధింపులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో వేధింపులకు గురవుతున్నట్లు రైతులు భావిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 స్థానాలకు గాను 400 సీట్లను గెలుచుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ అమలు అసంభవంగా కనిపిస్తోందని తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు, రైతులు ప్రస్తుతం రైతుల ఆదాయం ఎంత అని బీజేపీని అడుగుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు కూడా పైకెగబాకాయి. అలాంటప్పుడు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఎప్పటికి నెరవేరుతుంది?’అని ఆయన ప్రశ్నించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘రైతులు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, వారు ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములకు సక్రమమైన పరిహారం అందజేస్తాం’అని చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి అనేక పథకాలు, హామీలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చెరకు రైతులకు చెల్లింపుల విషయమై ఆయన మాట్లాడుతూ..‘అసలు విషయం చెల్లింపులకు సంబంధించింది కాదు. పాత బకాయిల గురించి. రైతుల వేదన సీఎం యోగికి వినిపించడం లేదు’అని చెప్పారు. -
‘నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అత్త పెళ్లి చేసుకోమంటుంది’
భువనేశ్వర్: ‘సార్.. మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వివాహిత సునీతా ప్రధాన్ గురువారం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె భర్తతో కలిసి గంజాం జిల్లాలోని చికిటి సమితి, కె.నువాగాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరాడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి నివాసముంటోంది. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె భర్త చనిపోగా అప్పటి నుంచి తన ఐదేళ్ల కూతురితో కలిసి అత్త వారి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఆమెని తన అత్త, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఎస్పీకి తెలిపింది. దీంతో పాటు తన అత్త నేర చరిత్ర కలిగిన మహేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. ఇదే విషయంపై తన తండ్రి వారిని ప్రశ్నించగా, అతనిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆమె ఎస్పీ ఎదుట వాపోయింది. ఈ ఘటన పట్ల కె.నువాగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పటికైనా తమ అత్తవారింటి నుంచి ముప్పు ఉందని, నిందితులపై చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్పీని ఆమె కోరారు. అనంతరం ఎస్పీ పినాకి మిశ్రాకి ఫిర్యాదు పత్రం అందజేశారు. -
పక్క తడిపాడని కన్నతండ్రే..
ముంబై: ముంబైలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కన్న కొడుకును చిత్రహింసలకు గురిచేసాడు. వివరాల్లోకి వెళ్తే.. థానేలోని వాగ్లేకర్ ఎస్టేట్స్‌లో ఓవ్యక్తి తన రెండో భార్యతో కలిసి మొదటి భార్య కుమారుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 9 ఏళ్ల పిల్లాడు నిద్రలో పక్కతడిపినందుకు అతన్ని చిత్రహింసలు పెట్టాడు. పిల్లాన్ని చితకబాది భార్యాభర్తలిద్దరూ పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా బాలుని ప్రైవేటు భాగాలపై వాతలు పెట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఈ ఘటన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన -
క్యాష్ ఇస్తారా? కేటాయిస్తారా?
ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇది రైతుల బడ్జెట్ అని, ఇది వ్యాపారుల బడ్జెట్ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా ‘మహిళా బడ్జెట్’ అవవలసిన అవసరమైతే ఉంది. కొద్ది గంటల్లో బడ్జెట్! కష్టకాలంలో వస్తున్న బడ్జెట్. కరోనా వల్ల అందరూ కష్టపడ్డారు. అందరికన్న ఎక్కువ కష్టం అనుభవించింది మహిళలు, బాలికలు, బాలలే! లాక్డౌన్ సమయంలో వారికి రక్షణ, భద్రత లేకుండా పోయాయి. వారిపై లైంగిక హింసకు అడ్డు లేకుండా పోయింది! సొంత ఇంట్లోనే వారికొక ‘స్పేస్’ కరువై పోయింది. ఆ స్పేస్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ఇవ్వబోతున్నారా? లైంగిక హింసను నిరోధించడానికి కొత్త విధానాలు, కేటాయింపులు బడ్జెట్లో ఏమైనా ఉంటాయా? అయితే అవి ఎలాంటివి అయి ఉంటాయి?! ధీమా కోసం మహిళల కొంగుకు పది రూపాయలు ముడేస్తారా? భారీ నిధుల ప్రణాళిలతోనే ధైర్యం కల్పిస్తారా? స్త్రీ శిశు సంక్షేమానికి యేటా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి సంక్షేమం కన్నా కూడా లైంగిక హింస నుంచి మహిళలకు రక్షణ, భద్రత కల్పించడానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని కరోనా కలిగించింది. ఈ సంగతి బడ్జెట్ వేసే వాళ్ల దృష్టికి చేరనిదేమీ కాదు. నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియా లాక్డౌన్లో ఉన్న సమయంలో ఒక్క జూన్ నెలలోనే మహిళలు, బాలలపై లైంగిక నేరాలు జరిగినట్లు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కు 2043 ఫిర్యాదులు అందాయి! ఇక పిల్లలపై జరిగిన హింసకైతే అంతే లేకుండా పోయింది. లాక్ డౌన్ మొదలైన తొలి 11 రోజుల్లో చైల్డ్ హెల్ప్ లైన్‌కు 3 లక్షల కాల్స్ వెళ్లాయి! కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన మానసిక ఒత్తిడి కారణం గా మహిళలు, బాలలు లాక్డౌన్ మొత్తం క్షణక్షణం భయం భయం అన్నట్లుగానే గడిపారని మరికొన్ని నివేదికలు వచ్చాయి. స్కూళ్లు మూత పడటం, ఆన్లైన్ చదువులకు సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇరవై నాలుగు గంటలూ ఒకరి కళ్లెదురుగా ఒకరు ఉండిపోవడం, అభిప్రాయభేదాలు, అనవసర ఘర్షణలు, దంపతుల మధ్య మనస్పర్థలు అన్ని కలసి మహిళలు, పిల్లలపైనే దుష్ప్రభావం చూపించాయని స్వచ్ఛంద సంస్థల సర్వే నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఆర్థిక శాఖకు, పోలీసు శాఖకు తమ నివేదికలను అందించారు. ఆ సమాచారం ఆధారంగానైనా నేటి బడ్జెట్లో మహిళలు బాలల భద్రతకు, రక్షణకు మరింతగా నిధులను కేటాయించడం, కొత్తగా ప్రభుత్వ విధానాలను రూపొందించడం వంటివి ఉండొచ్చని, ఉంటే బాగుంటుందని ఒక ఆశ, ఒక ఆకాంక్ష ఈసారి వ్యక్తం అవుతోంది. ∙∙ మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చట్టాలు, శాసనాలు, పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మళ్లీ కొత్తగా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అనే సందేహాన్ని రానివ్వనంతగా మహిళల జీవితాన్ని దుర్భరం చేసేసింది లాక్డౌన్. వారి ఉద్యోగాలు పోయాయి. ఉపాధులు కొండెక్కాయి. ఇంటెడు చాకిరి కొండంతైంది. ఇంట్లో హింస పెరిగింది. పర్యవసానంగా మహిళల ఆరోగ్యం క్షీణించింది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. అంతకన్నా దారుణం వారికి వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, కరోనా కాలపు అగమ్యగోచరం రెండూ కలిసి మహిళల్ని జీవచ్ఛవాలను చేశాయి. ఈ దుస్థితి నుంచి వారిని తెరిపిన పడేసే ప్రాధాన్యాలు, నిధులు బడ్జెట్లో లేకుంటే.. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికి ఉన్న మహిళల శ్రమ శక్తి వాటా పదిహేడు శాతానికంటే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కనీసం 11 శాతానికైనా పెంచుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన మహిళల శక్తి సామర్థ్యాలను, వాళ్లకు కల్పించవలసిన రక్షణ భద్రతలను కూడా గుర్తించి నేటి బడ్జెట్‌కు తుది రూపును ఇచ్చి ఉంటుందనే అనుకోవాలి. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడూ మహిళలపై జరిగే లైంగిక నేరాలను తగ్గించే విషయంలో పరోక్షమైన పాత్రను వహిస్తాయి. షెల్టర్ హోమ్‌లు ప్రత్యక్ష నరక కూపాల నుంచి కాపాడతాయి. ఈ హోమ్‌ల సంఖ్య పెంచేందుకు, సమర్థవంతంగా వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిధులు కూడా ఈ బడ్జెట్లో ఉండాలని సూచిస్తున్న ఆర్థిక రంగ నిపుణులు.. ‘క్యాష్ బేస్డ్ సోషల్ ప్రొటెక్షన్’ ని కూడా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కల్పించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళల అకౌంట్లో కొంత డబ్బును విధిగా జమ చేయడమే నగదు రక్షణ విధానం. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమానికి, లైంగిక హింస నుంచి రక్షణకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చాలా వరకు తోడ్పడుతుంది. పై పెచ్చు వారికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. దీనిపైన కూడా ఇవాళ్టి బడ్జెట్లో విధానం నిర్ణయమై ఉంటుందని నేషనల్ ఉమెన్ కమిషన్ అంచనా వేస్తోంది. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఇక్కడితో ఆగిపోవడం లేదు
యూఎస్‌లో యాష్లీ జూడ్. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్ అష్రాఫ్! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్. ముగ్గుర్లో చిన్న.. నదీన్. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది. నాలుగేళ్ల క్రితం నదీన్ అష్రాఫ్ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్‌ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు. ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు. లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్మెంట్. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్ నటి యాష్లీ జూడ్ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే. ∙∙ యూఎస్‌లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అసాల్ట్ పోలీస్’ అనే పేజ్ని నడుపుతూ ఉంది. హాలీవుడ్లో హార్వీ వైన్స్టీన్లా ఈజిప్టులో అహ్మద్ బస్సమ్ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్ పోలీస్’లో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నదీన్ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్బుక్లో చురుగ్గా ఉండేది. నదీన్ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్ బస్సమ్ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్ అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ, లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్‌లో వైన్‌స్టీన్ అరెస్ట్ అయినట్లే ఈజిప్టులో అహ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్ గుర్తింపు పొందారు. నదీన్ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్ స్ట్రీట్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్ అష్రాఫ్. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్ ఆన్లైన్ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు. తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్ -
అతివలకు అండగా 'సఖి'
ఆదిలాబాద్‌టౌన్: నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు, గృహహింస, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ‘సఖి’ సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేనివారు సఖి కేంద్రానికి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సహాయాన్ని అందిస్తోంది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నారు. 2017లో సఖి కేంద్రం ఏర్పాటు మహిళలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2017 డిసెంబర్ 16న సఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్‌తో పాటు సఖి కూడా సేవలు అందిస్తోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ల వరకు సఖి కేంద్రం సమస్య పరిష్కరిస్తోంది. అత్తామామలు, భార్యాభర్తల గొడవలు, యువతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఐదురోజుల పాటు ఆశ్రయం కూడా కల్పిస్తోంది. లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, ఆడపిల్లల అమ్మకం, పనిచేసే చోట వేధింపులు, తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం జరిగేలా చేస్తోంది. ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 181 వేధింపులకు గురవుతున్న మహిళలకు న్యాయం చేసేందుకు సఖి కేంద్రం సేవలు అందిస్తోంది. అందుల్చో భాగంగానే ఉమెన్ హెల్ప్‌లైన్ పేరిట టోల్‌ఫ్రీ నంబర్ 181 ఏర్పాటు చేసింది. ఇబ్బందులు పడుతున్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్ 181కు సమాచారం అందిస్తే సహాయం అందిస్తోంది. ఎవరైనా అక్కడినుంచి రాలేని పరిస్థితిలో ఉంటే వారికోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకువస్తారు. 24 గంటల పాటు ఈ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. కేసుల పరిష్కారంలో ముందంజ 2017 నుంచి ఇప్పటివరకు 722 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 569 కేసులను పరిష్కరించగా 153 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 710 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 116 మందికి న్యాయసేవ, 85 మందికి వైద్య సహాయం, 54 మందికి పోలీసు సహాయం అందించారు. దాదాపు 70వేల మందికి అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం నిర్వాహకులు యశోద చెబుతున్నారు. ఈయేడాది 258 కేసులు నమోదు కాగా 170 కేసులు పరిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. విస్తృతంగా ప్రచారం సఖీ కేంద్రం సభ్యులు అందిస్తున్న సేవలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య సంఘాల సభ్యులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నారు. గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలకు తమ హక్కులతో పాటు తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలనే అంశాల గురించి వివరిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. దాడులకు గురైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నాం. అవసరమైన వారికి కేంద్రంలో ఐదురోజుల పాటు వసతి కూడా కల్పిస్తాం. బాధితులను తీసుకురావడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేశాం. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్ -
కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు
ముంబై: బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్లో..‘అనురాగ్ కశ్యప్ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్ ఘోష్ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు. -
కేసుల్లో సత్వర విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఆర్ఐ భర్తల వేధింపుల కేసులను వేగంగా విచారించి నిందితులకు తగిన శిక్ష పడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో సమస్యలు, మోసాల పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సహకారం, సమన్వయానికి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గురువారం కన్వర్జెన్స్ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. నగరంలోని ఎన్ఆర్ఐ సెల్‌తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా పోలీస్ స్టేషన్లలో 586 ఎన్ఆర్ఐ వైవాహిక సంబంధిత ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 2019 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్లోనే 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70పై కేసులు నమోదు చేశామని, వీటిలో 41 విచారణలోనూ ఉండగా, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. మరో 32 కేసులు నాన్ బెయిలబుల్‌గా నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులను సమర్థంగా విచారించేందుకు దర్యాప్తు అధికారులకు వెసులుబాటు ఉండేలా ఎస్.ఓ.పీలను రూపొందించామని వివరించారు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం నమోదైన మొత్తం 586 ఎన్.ఆర్.ఐ కేసులలో అత్యధికంగా 248 కేసులు హైదరాబాద్ కమిషనరేట్‌లో, 99 కేసులు రాచకొండ పరిధిలో,99 సైబరాబాద్ పరిధిలో, వరంగల్‌లో 42, కరీంనగర్ లో 21, నిజామాబాద్‌లో 8 , నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసుల చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఆరు, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఐదు కేసుల వంతున నమోదయ్యాయని వివరించారు. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్‌శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల సామాన్యుల్లో పోలీసులపై ఎలా నమ్మకం ఏర్పడిందో, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు అనంతరం ప్రవాస భారతీయులు చేసే వివాహాల సంబంధిత మోసాల్లో బాధితుల్లో అంతే భరోసా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. విదేశీ భర్తల కేసుల విషయంలో ఎన్ఆర్ఐ సెల్ బాధితులు, విచారణసంస్థల మధ్య వారధిలా పనిచేస్తోందన్నారు. అనంతరం ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియో, కరపత్రాన్ని విడుదల చేశారు. పలు ఎన్నారై వివాహ కేసుల్లో రాజీ కుదిరి ఒక్కటైన జంటలను ఈ సందర్భంగా వేదికపై సత్కరించారు.