illegal transportation
-
అర్ధరాత్రి పీడీయస్ బియ్యం అక్రమ రవాణా
సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్ ఫ్యాక్టరీకి రేషన్ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. -
రూ.25.86 లక్షల జరిమానా
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : నిబంధనలకు విరుద్ధంగా పట్టు వస్త్రాలను తరలిస్తున్న కోల్‌కతాకు చెందిన ఆషిఫ్ పటోలా ఆర్ట్స్ అనే వ్యాపారి నుంచి రూ. 25,86,112 లను పన్ను, జరిమానా, ఫైన్ల కింద కట్టించినట్లు నరసన్నపేట డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కింజరాపు వెంకటరమణ తెలిపారు. వాహన తనిఖీల్లో ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యాపారి నుంచి ఫైన్ కట్టించడం చాలా అరుదన్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుని విచారించి చివరికి వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని కట్టించి ప్రభుత్వ ఆదాయం పెంచినట్లు తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. నరసన్నపేటకు చెందిన జీఎస్టీఓ ఎన్.తిరుపతి బాబు, ఇన్స్పెక్టర్ బి.ఉపేంద్రరావు తదితరులు మడపాం టోల్ గేట్ వద్ద ఈ నెల 20వ తేదీ సాయంత్రం తనిఖీలు చేపట్టారన్నారు. ఆ సమయంలో కొల్కతా నుంచి విజయవాడకు వెళ్తున్న క్వాలీస్ వాహనంపై అనుమానంతో నిలిపి తనిఖీలు చేస్తుండగా ఎగ్జిబిషన్ సేల్స్ కోసం తరలిస్తున్న పట్టు వస్త్రాలను గమనించారన్నారు. పూర్తిగా ఆరా తీయగా అవి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు గుర్తించారన్నారు. సుమారు రెండు కోట్లు విలువైన 1080 పట్టు చీరలు రూ.12.50 లక్షలకు బిల్లులు చూపించి రవాణా చేసినట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఈ కేసుపై వాదనలు నిర్వహించిన అనంతరం అసిస్టెంట్ కమిషనర్ సి.హెచ్.కొండమ్మ ఆదేశాల మేరకు కోలకతాలో ఉన్న వస్త్ర వ్యాపారిని రప్పించామన్నారు. ఆయన వద్ద నుంచి రూ. 25,86,112లను కట్టించినట్లు తెలిపారు. -
ఇంటి దొంగలు
మార్టూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి ఆకలి దప్పులు తీర్చడం కోసం ఏళ్ల నుంచి ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా పప్పు, బియ్యం, చింతపండు వంటి కనీస అవసరాలు సరఫరా చేస్తున్నాయి. గతంలో తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేసే వారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు మూడు రకాల వస్తువులు పంపిణీ చేస్తూ వాటిని కూడా కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టే దిశగా ప్రయత్నిస్తోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం లోపభూయిష్టంగా మారి అక్రమార్కులకు లాభాల పంట పండిస్తోంది. మండల కేంద్రం మార్టూరు కూరగాయల మార్కెట్ ఆవరణలో నిత్యావసరాల గిడ్డంగి ఉంది. దీన్ని మండల లెవెల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్)..అని అంటారు. ఇక్కడి నుంచి మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ మండలాల్లోని 107 రేషన్ షాపులకు నెలకు 10 వేల బస్తాలు (50 కేజీల బియ్యం) సరఫరా చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం పూర్తిస్థాయిలో రేషన్ షాపులకు సరఫరా కావడం లేదు. ఇదే విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైంది. 107 రేషన్ షాపులకు సంబంధించి సగటున నెలకు 2 వేల బియ్యం బస్తాలు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా అద్దంకిలోని రైస్ మిల్లులకు చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ లావాదేవీల్లో రేషన్ షాపు నిర్వాహకుడికి కేజీ బియ్యం 8 రూపాయల చొప్పున 50 కేజీల బస్తాకు 400 రూపాయలు గిట్టుబాటు అవుతున్నట్లు సమాచారం. గిడ్డంగి నిర్వాహకులకు కేజీకి రెండు రూపాయలుపోగా 5 రూపాయలు లాభం కలుపుకుని అక్రమ వ్యాపారులు కేజీ 15 రూపాయల చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇక్కడ జరిగే మాయాజాలం తెలిసి అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమంది మిల్లర్లకు ధాన్యం సరఫరా చేస్తారు. ఆ మిల్లర్లే రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేస్తారు. ఈ మిల్లులనే క్లస్టర్ మిల్ రైస్ (సీఎంఆర్) అని పిలుస్తారు. ఈ సీఎంఆర్‌లకు ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియాన్ని మరుసటి నెలలో అదే ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరఫరా చేయడం విశేషం. ఈ అక్రమ వ్యాపార లావాదేవీలతో నెలకు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు సమాచారం. వ్యాపారుల సిండికేట్ అద్దంకిలోని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి అక్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా అద్దంకి అధికార పార్టీ నాయకుడి అనుచరుడి ఒకరికి ప్రభుత్వం అండకోసం కొంత వాటా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత మంగళవారం విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్ తన సిబ్బందితో రెండి బృందాలుగా ఏర్పడి నిర్వహించిన దాడిలో వలపర్ల సమీపంలోని 60 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడగా అద్దంకి ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు మార్టూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం అద్దంకిలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్‌ను అదే రోజు తనిఖీ చేసిన అధికారులు రేషన్ బస్తాల నిల్వలు సక్రమంగానే ఉండటంతో ఖంగుతిన్నారు. అనుమానం వచ్చిన అధికారులు ముందు రోజు అంటే గత సోమవారం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఏయే రేషన్ షాపులకు బియ్యం పంపిణీ నిర్వహించారో ఆ రూట్ మ్యాప్ తీసుకుని వలపర్ల, మార్టూరులోని రేషన్ దుకాణాలతో తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయట పడింది. ఒక్కో రేషన్ షాపులో 15 నుంచి 20 బస్తాల బియ్యం తరగతులను గుర్తించిన అధికారులు ఆ బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా మిల్లర్లకు చేరుతున్నట్లు నిర్ధారించుకుని సదరు మిల్లుపై కూడా దాడులు నిర్వహించిన అధికారులు 30 బస్తాల అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి జిల్లా పౌర సరఫరాల శాఖ ముఖ్య ఉద్యోగి ఒకరి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి మార్టూరులో నెలకు వేలాది బస్తాల అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహించే ఓ మహిళ నుంచి నెలకు 10 వేల రూపాయల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖలోనే గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. విజిలెన్స్ శాఖ జిల్లా అధికారిగా ఏఎస్పీ రజని పదవీ బాధ్యతలు చేపట్టాక అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారులు, బియ్యం వ్యాపారులపై విస్తృత దాడులు నిర్వహించడంతో ప్రస్తుతం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. మరింత సమర్థంగా దాడుల నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఉంగుటూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం ఉంగుటూరు టోల్‌గేటు వద్ద అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైకరం గ్రామానికి చెందిన కామన శ్రీనివాస్, విజయ త్రిమూర్తులు మినీ వ్యాన్‌లో 42 బస్తాల రేషన్ బియ్యాన్ని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా ఉంగుటూరు వద్ద పట్టుకున్నట్టు చేబ్రోలు ఎస్సై తాడి నాగ వెంకటరాజు తెలిపారు. బియ్యాన్ని ఉంగుటూరు సివిల్ సప్లయీస్ డీటీ జయశ్రీకి అప్పగించారు. కామన శ్రీనివాస్ పరారీలో ఉండగా విజయ త్రిమూర్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. -
రేషన్ బియ్యం పక్కదారి
సాక్షి, తిరుపతి: పేద, మధ్యతరగతి వారికి ఇస్తున్న రేషన్ బియ్యం మిల్లర్లకు భోజ్యం గా మారుతోంది. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా పంపిణీ (పీడీఎఫ్) బియ్యంలో సుమారు 45 శాతం రీసైక్లింగ్ జరుగుతోంది. రేషన్ డీలర్ల నుంచి పెద్ద మొత్తంలో సేకరించి మిల్లుల్లో సన్నగా పట్టిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అనధికారికంగా గోదాములు ఏర్పాటు చేసుకుని రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపుతున్నారు. రిటైల్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. జిల్లాలో కార్డు దారుల కోసం ప్రతినెలా 18,708 టన్నుల బియ్యం దిగుమతి అవుతున్నాయి. ఇందులో 7.5 వేల టన్నులకుపైగా బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా సరిహద్దులో అటు తమిళనాడు... ఇటు కర్ణాటక రాష్ట్రాలు ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న మిల్లర్లతో దళారులు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. 25 శాతం మంది బాగోలేవనే కారణంతో రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. మరో ఏడుశాతం మంది రేషన్ తీసుకులేకపోతున్నారు. 5 శాతం రేషన్ కార్డులు కొందరు డీలర్ల వద్ద ఉన్నాయి. లబ్ధి్దదా రులు రాకపోయినా బియ్యం తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. అసలు లబ్ధిదారుడికి కార్డు ఉందనే విషయం తెలియని పరిస్థితి. లబ్ధిదారుల బియ్యం రేషన్ దుకాణదారుల వద్దే ఉండిపోతున్నాయి. మరికొందరు బియ్యం వచ్చిన సమయంలో బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసి వచ్చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కొందరు డీలర్లు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు తెలిసిన వారికి అదే ధరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 45శాతం బియ్యం మిల్లర్లకు చేరుతున్నాయని అంచనా. అధిక ధరలకు విక్రయం.. రెండు రూపాయల కిలో బియ్యాన్ని కొందరు డీలర్లు రూ.10 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని శివారు ప్రాంతంలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. తిరుపతి రైల్యే కాలనీ, ఆటోనగర్, అక్కారంపల్లి, పుత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు సమీపంలో అనధికారిక గోదా ములు ఉన్నట్లు సమాచారం. నిల్వచేసిన బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్చేస్తున్నారు. రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపి రిటైల్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.30, రూ.35 చొప్పున విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మరికొందరు తమిళనాడు, కర్ణాటకతో పాటు నెల్లూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరలివెళ్తున్న బియ్యాన్ని అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. తిరుపతిలో ఓ నివాసంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న సమయంలో రేషన్ బియ్యం బస్తాలు బయటపడినట్లు భోగట్టా. కొన్నిచోట్ల అధికారుల సహకారంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. -
నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు
-
నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం : నక్షత్ర తాబేళ్లను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్లో డీఆర్ఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో ముఠా నుంచి 1125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను విజయవాడ నుంచి ఔరాకు తరలిస్తున్న ముగ్గురు మఠా సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. తాబేళ్లను బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. -
నిషేధం ఉన్నా లెక్క లేదు
గుంటూరు: పోలీసులు కళ్లుగప్పి జిల్లా నుంచి గుట్కాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూరు నుంచి మినీ లారీ అడుగు భాగాన బస్తాల్ని అమర్చి విశాఖపట్నం తరలిస్తుండగా గత ఏడాది నవంబరు 5న ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వాహనంలో రూ. కోటి విలువ చేస్తే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ మూమూలే.. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు ఏకకాలంలో పోలీసులు దాడులు చేసి 1275 గుట్కా బస్తాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవేమీ లెక్క చేయని వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం అక్రమ రవాణా జరుగుతుందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీరుగారిన నిషేధం గుట్కా ప్రాణాంతకమన్న ఉద్దేశంతో 2013లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఎక్కడా అమలు కావడం లేదు. గుంటూరు నగర శివారుల్లో ముఖ్యంగా వట్టిచెరుకూరు, వింజనంపాడు, ఏటుకూరు రోడ్లలో అక్రమార్కులు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి పాన్‌మసాలా తయారీ పేరుతో లైసెన్స్‌లు పొందుతున్నారు. వీటి లోపల మాత్రం పొగాకుతో నిషేధిత ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు సమాచారం. చిన్నచిన్న బడ్డీల్లో సైతం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ దాడులకు యత్నిస్తే అధికార పార్టీ నాయకులతో ఒత్తిళ్లు చేయించి వారి వైపు తిరిగి చూడకుండా చేసి రాత్రి వేళల్లో వాహనాల ద్వారా గుట్కా బస్తాల్ని తరలిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. రెట్టింపు ధరలకు విక్రయాలు నిషేధం లేని సమయంలో ఎమ్మార్పీకే విక్రయించేవారు. నేడు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్‌పై ఎమ్మార్పీ రూ.2 ఉంటే రూ. 6కు అమ్ముతున్నారు. గతంలో ఖైనీ ప్యాకెట్ రూ. 5 ఉంటే ప్రస్తుతం రూ 15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో విషయానికి వస్తే చెప్పాల్సిన పనిలేదు. ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ అక్రమ రవాణాదారులు కోట్లు గడిస్తున్నారు. మామూళ్ల వసూలు అవాస్తవం జిల్లాలో అనేకసార్లు దాడులు నిర్వహించి ఇప్పటి వరకు దాదాపుగా రూ.6 కోట్ల విలువ చేసే గుట్కాల్ని సీజ్ చేశాం. సమాచారం ఉంటే 9440379755 నంబర్‌కు ఫోన్ చేయాలి. వివరాలను గోప్యంగా వుంచుతాం. నెలవారీ మామూళ్ల మాట అవాస్తవం. – గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
చీకటి దందా !
మొరం దందా కొత్త పుంతలు తొక్కుతోంది. కాసులకు మరిగిన మొరం మాఫియా అక్రమ రవాణాకు కొత్తదారులు వెతుకుతోంది. పగటి పూట కాకుండా.. అర్ధరాత్రి వేళల్లో మొరం రవాణాకు తెరలేపారు. చీకటి పడితే చాలు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : రెవెన్యూ అధికారుల బృందం శుక్రవారం అర్ధరాత్రి మోపాల్ మండలం కంజర్ శివారులో నిర్వహిస్తున్న అనుమతి లేని క్వారీ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొరం తరలించేందుకు వచ్చి న తొమ్మిది టిప్పర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించిన అక్రమార్కులు మిగిలిన టిప్పర్లను దారి మళ్లించారు. ఈ దందాకు అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరుడు సూత్రధా రి అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పలుచోట్ల తవ్వకాలు.. మోపాల్‌తో పాటు, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, ఎడపల్లి తదితర మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో భూగర్భాన్ని తొలిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టిన తవ్వకాలతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. పట్టా, ప్రభుత్వ భూములు తేడాలేకుండా విచ్చలవిడిగా తవ్వకాలను చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం మొరం తవ్వకాలు జరపాలంటే భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. నిర్దేశిత మొత్తంలో సీనరేజీ చెల్లించి మొరాన్ని తరలించాలి. ఇవేవీ పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లడమే కాకుండా, భూగర్భ గనులశాఖకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లో వాణిజ్య అవసరాలకు మొరం డిమాండ్ అధికంగా ఉంది. ఒక్కో టిప్పరుకు రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు విక్రయిస్తున్నారు. నగరంలో రియల్ వెంచర్లకు, ప్రైవేటు కట్టడాలకు ఈ మొరాన్ని తరలిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలే లేవు.. అక్రమ మొరం తవ్వకాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అడపాదడపా టిప్పర్లను పట్టుకుని నామమాత్ర జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. కానీ మొరం తవ్వుతున్న ప్రదేశాలకు వెళ్లి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి. ఎంత పరిమాణంలో మొరాన్ని తరలించారు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన జరిమానాలు విధించాల్సి ఉంది. అలాగే కేసులు నమోదు చేసి మొరం తవ్వుతున్న జేసీబీలను, తరలిస్తున్న టిప్పర్లను కోర్టుకు అప్పగిస్తే.. అక్రమ దందాకు చెక్పడే అవకాశాలుంటాయి. అయితే నామమాత్ర జరిమానా విధించి వాహనాన్ని వదిలేయడం వల్ల మళ్లీ యథేచ్ఛగా ఈ అక్రమ దందాకు ఆస్కారం ఏర్పడుతోంది. తొమ్మిది టిప్పర్లు పట్టివేత మోపాల్(నిజామాబాద్ రూరల్): మోపాల్ మండలంలో మొరం అక్రమ దందాపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కంజర్ గ్రామశివారులో శుక్రవారం అర్ధరాత్రి మాటు వేసి క్వారీ వద్ద తొమ్మిది టిప్పర్లను పట్టుకున్నారు. వీరిని పసిగట్టిన మరో ఐదు టిప్పర్లు తప్పించుకుపోయాయి. అనుమతుల్లేకుండా మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను గతంలోనూ పట్టుకున్నప్పటికీ నామమాత్రపు జరిమానాలు విధించడంతో తిరిగి తమ దందాను కొనసాగిస్తున్నారు. ఒకటి, రెండు టిప్పర్లు కాకుండా సుమారు 15 టిప్పర్ల ద్వారా మొరం రవాణా చేస్తుండటంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా అధికారులు అర్ధరాత్రి దాడులు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడిలో ఆర్ఐ నారాయణ, ఎస్ఐ సతీశ్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, వీఆర్వోలు ఇంతియాజ్, రఫీక్, సంజీవ్, పృథ్వీ, వీఆర్ఏలు ఉన్నారు. -
మట్టి హాంఫట్!
► నీరు–చెట్టు పనుల పేరుతో దోపిడీ ► ప్రతిరోజూ 400 ట్రిప్పులు అమ్మకం ► నాలుగు మాసాలుగా ఇదే తంతు ► చెరువునే చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. వర్క్ అలాట్మెంట్ కాకపోయినా ఈ పనుల పేరు చెప్పి చెరువులు, వంకలు, వాగుల్లోని మట్టిని కొల్ల గొడుతున్నారు. ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముకుంటూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కడప చుట్టుపక్కల 4 మాసాలుగా ఈ దందా సాగుతున్నా ఇరిగేషన్ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు తొంగి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప కార్పొరేషన్: నీరు–చెట్టు పనులు కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పనులు చేపట్టే విషయంలో తెలుగు తమ్ముళ్లు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. నిబంధలనల ప్రకారం నీరు–చెట్టు కింద పూడిపోయిన వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక తీత, చెరువు నుంచి పొలాల్లోకి వున్న కాలువలను బాగుచేయడం వంటి పనులు చేయాలి. కానీ అవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పుట్లపల్లి చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. పంటలు కోసిన తర్వాత ఈ మట్టిని పొలాల్లోకి తోలి భూసారాన్ని పెంచితే రైతులకు ఉపయోగముంటుంది. అలాకాని పక్షంలో చెరువు కట్టను బలోపేతం చేసేందుకు ఈ మట్టిని వినియోగించాలి. అంతిమంగా ఈ పనుల వల్ల రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం అమలు మాత్రం తమ్ముళ్లకు ఆర్జించిపెట్టడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. పుట్లపల్లి చెరువులో సాగుతున్న నీరు–చెట్టు పనులే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో నాలుగు మాసాలుగా ఈ మట్టి దందా సాగుతోంది. కేవలం రూ.10 లక్షల వర్క్‌ను ఇలా నెలల తరబడి చేస్తూ మట్టిని కొల్లగొడుతున్నట్లు సమచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల వరకూ తోలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన 4నెలలకు రూ.2కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. వర్క్ అలాట్మెంట్ అయిన చోట కాకుండా చెరువు మధ్యలోని మట్టిని జేసీబీతో తోడుతూ ప్రయివేటు సంస్థలకు, ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు కంటే కొసరే ఎక్కువ: అసలు కంటే కొసరే ఎక్కువన్నట్లు ఇక్కడ పని మంజూరైంది రూ.10లక్షలైతే, మట్టిని అమ్ముకోవడం ద్వారా ఇరవై రెట్లు అధికంగా ఆర్జించినట్లు సమాచారం. చెరువులో, కాలువల్లో ఉన్న నల్లమట్టిని తీయాల్సి ఉండగా, సారవంతమైన ఎర్రమట్టిని తీస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలతో చేపట్టిన ఈ పనులు నాలుగునెలల పాటు సుదీర్ఘ కాలం సాగుతుండటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సుమారు రూ.1.60లక్షల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ ముఖ్యనేత ఉండటం వల్లే యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖలోని ఈఈ స్థాయి అధికారి దీనికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త కలెక్టరేట్‌కు ఈ చెరువు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ దందాను అడ్డుకోలేని స్థితిలో ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పేరు చెప్పి చెరువులో ఇష్టానుసారం గోతు లు తవ్వుతున్నారు. భవిష్యత్‌లో ఈ గోతు లు పెను అనర్థాలకు దారితీసే అస్కారం ఉందని పుట్లంపల్లె గ్రామస్తులు సైతం వాపోతున్నారు. గతంలో కూడా గుంతలున్నాయనే విషయం తెలియక ఈత సరదాతో పసిప్రాణాలు గాల్లో కలిసిన దాఖలాలున్నాయి. సమాజానికి ఎటుచూసినా అనర్థదాయకంగా మారనున్న ఈ వ్యవహారాన్ని తక్షణమే కట్టడి చేయాల్సి ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం: నీరు–చెట్టు పనులకు వర్క్ మంజూరైంది. మొత్తం రూ.5లక్షలు విలువైన చేయాల్సి ఉంది. అయితే చెరువులోని మట్టిని అమ్ముకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాం. మట్టి అమ్ముకున్నట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం. మురళీకృష్ణ, డీఈ, మైనర్ ఇరిగేషన్‌శాఖ కడప. -
పులి చర్మంతో దొరికిన థాయ్‌లాండ్ పూజారి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని వివాదాస్పద పులుల గుడి నుంచి పులి చర్మంతో పారిపోతున్న పూజారిని అధికారులు పట్టుకున్నారు. పూజారుల నివాస స్థలాల్లో జరిపిన తనిఖీల్లోనూ బతికున్న సింహం, ఇతర వన్యప్రాణులనుతో పాటు 20 పాత్రల్లో భద్రపరిచిన పులుల అవయవాలు, కళేబరాలను గుర్తించారు. గుడి నుంచి చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడి రిఫ్రిజిరేటర్లో బుధవారం అధికారులు 40 పులిపిల్లల కళేబరాలను కనుగొన్న సంగతి తెలిసిందే. -
ఏడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
వర్ధన్నపేట టౌన్ (వరంగల్ జిల్లా) : వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సోమవారం పట్టుకున్నారు. బంతిని గ్రామం సమీపంలో ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక దుమారం
ఉచిత ఇసుక విధానం అధికార టీడీపీకి వరమైంది. సామాన్య జనానికి భారమైంది. అధికారులకు తలనొప్పిగా తయారైంది. రీచ్‌ల వద్ద పాగావేసి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. వారి కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలనే రూలును అనధికారికంగా అమలు చేస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా వారి అక్రమాలు ఆగడం లేదు. మరోపక్క ఉచిత ఇసుక కాస్తా సామాన్యులకు చేరేసరికి మరింత ‘ప్రియ‘మైపోయింది. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో జనానికి కంటిమీద కునుకులేదు. చీకటిపడితే ట్రాక్టర్ల హోరు. ఇసుక రవాణాతో గ్రామం మోతెక్కిపోతోంది. ఈ గ్రామానికి అనుకొని ఉన్న బలగ రీచ్, ఆమదలవలస సమీపంలోని గోపీనగరం ఇలా ఈ మూడు ప్రాంతాల నుంచి అక్రమ వ్యాపారం సాగుతోంది. అన్ని రీచ్‌లూ అనధికారికమే.. 36 మంది ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి ఈ అక్రమ రవాణాకు నేతృత్వం వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇందుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇసుక ఉచితం లేని సమయంలో ట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు చొప్పున నెలవారీ వసూలు చేసేవారు. ఇవి పోలీసు సర్కిల్ స్థాయి అధికారితోపాటు జిల్లా అధికార పార్టీ నాయకుడికి వెళ్లేవి. ప్రస్తుతం తమ్మినాయుడుపేట నుంచి రోజూ రాత్రి 12 నుంచి 4 వరకు రవాణా సాగుతోంది. సమీప ప్రాంతాల్లో, తోటల్లో రాశులుగా వేస్తున్నారు. విశాఖపట్నం దీనిని తరలించనున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోకుండా అధికార పార్టీ నాయకులు చూసుకుంటున్నారని సమాచారం. అనధికార క్వారీల నుంచి పొక్లెయినరుతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వుతున్నారు. మరో పక్క ఇసుక రీచ్‌కు వెళ్లేందుకు నది గట్లు సైతం తవ్వేసి రోడ్డు మార్గం చేసేశారు. రీచ్‌కు జాతీయ రహదారి నుంచి కిలోమీటర్ లోపలకు వెళ్లాలి. ఇసుకలో నుంచి ట్రాక్టర్లు తప్ప కార్లు, బైక్‌లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. శ్రీకాకుళం మున్సిపాలిటీ బలగ ప్రాంతంలో ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. జాతీయ రహదారికి అనుకుని అనువైన ప్రదేశాల్లో పోగులు వేసి తర్వాత తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ అధికారులు రీచ్‌కు వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. ట్రాక్టర్లు వివరాలను అధికారులు సేకరించినా అధికార పార్టీ నాయకులను కాదని చర్యలు తీసుకునే ధైర్యం చేయటం లేదు. వీరికీ వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత అక్రమ రవాణాతో స్థానికులకు కంటిమీద కునుకుండటం లేదు. ఈ ధ్వని కాలుష్యానికి చెవులు చిల్లులు పడుతున్నాయని వీరంతా వాపోతున్నారు. నిలదీస్తే బెదిరించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దాంతో మాట్లాడలేకపోతున్నారు. -
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇసుక ర్యాంపు వద్ద నుంచి పరిమితులకు మించి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఆదివారం ఇసుక తరలిస్తున్నవారిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నాయకులు ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్‌ను రంగంలోకి దించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఒక స్థాయిలో వీరి మధ్య వాదన కాస్తా తోపులాటగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను నచ్చజెప్పి సోమవారం రెవెన్యూ అధికారుల సాయంతో హద్దులు నిర్ణయిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లు సీజ్
బోధన్ (నిజామాబాద్ జిల్లా) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. బోధన్ మండలం కొప్పర్తి నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సీఐ వెంకన్నకు సమాచారం అందింది. వెంటనే స్పందించి ఆయన టిప్పర్లను పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా: ఐదుగురి అరెస్ట్
చంద్రగిరి (చిత్తూరు జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని చంద్రగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక వాహనంతోపాటు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి వెస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ చెప్పారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. వీరిపై గతంలోనూ ఎర్రచందనం అక్రమరవాణా కేసులున్నాయని తెలిపారు. -
ఇసుక తరలిస్తున్న 19 ట్రాక్టర్ల పట్టివేత
మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) : మంచిర్యాల మండలంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 19 ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించి కొంతమంది డ్రైవర్లు ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు. -
15 మంది తమిళ కూలీల అరెస్ట్
-
15 మంది తమిళ కూలీల అరెస్ట్
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద శనివారం 20 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది తమిళ కూలీలను సుండుపల్లి ఎస్ఐ మధుసూదనరెడ్డి అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15మందిని అరెస్ట్ చేసారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.11.20 లక్షలు ఉంటుందని ఎస్ఐ చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన తలారి విజయకుమార్ తమ నాయకుడని, ఆయన ఆదేశం మేరకే ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నామని కూలీలు చెప్పినట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు. కూలీలను ప్రత్యేక బస్సులో రాయచోటి కోర్టుకు తరలించారు. -
13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
దర్శి (ప్రకాశం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్లను దర్శి పోలీసులు సీజ్ చేశారు. వీరాయపాలెం వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలసి సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. 13 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
34 లారీల ఇసుక పట్టివేత
ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా) : ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహన్‌రావు లారీలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. -
4 ఇసుక లారీలు సీజ్
గోరంట్ల (అనంతపురం) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా గోరంట్లలో పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వైఎస్సార్ జిల్లా నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ఈ లారీలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు లారీ నిర్వాహకులపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. -
అక్రమంగా మద్యంబాటిళ్ల తరలింపు
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తున్న 700 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కురుపం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు ఆటోలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు మాటువేసి వారిని పట్టుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. ఆటోలో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో టేకు అక్రమ రవాణా
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు అందులోని 12 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాసిపేట్ మండలం నుంచి మంచిర్యాలకు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న రూ.30 వేల విలువ చేసే కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అక్రమంగా ఒక వాహనంలో కలప దుంగలను తరలిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. కాగా నిందితులు పరారైనట్లు అటవీ అధికారులు తెలిపారు. కలపను స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు.