India lose
-
భారత్‌కు తొలి ఓటమి
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. పటిష్టమైన చైనా జట్టుతో బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సహజ యామలపల్లి 2–6, 3–6తో ప్రపంచ 43వ ర్యాంకర్ జిన్యు వాంగ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 0–6, 0–6తో ప్రపంచ 7వ ర్యాంకర్ క్విన్వెన్ జెంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో రుతుజా భోస్లే–ప్రార్థన ద్వయం 1–6, 1–6తో హాన్యు గువో–జియు వాంగ్ జోడీ చేతిలో పరాజయం పొందడంతో భారత ఓటమి ఖరారైంది. నేడు జరిగే మూడో మ్యాచ్‌లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. -
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
నాలుగు దేశాల హాకీ మెల్బోర్న్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత్ 2-3 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (21వ ని., 53 వ ని.) రెండు గోల్స్ సాధించగా... ఆసీస్‌కు హేవర్డ్ (24వ ని., 36 వ ని.) రెండు గోల్స్ అందించాడు. ట్రెంట్ మిటన్ (43 వ ని.) ఆసీస్‌కు మూడో గోల్ అందించాడు. మహిళల విజయం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో రాణీ రాంపాల్ గోల్‌తో భారత్ 1-0తో ఆసీస్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా మహిళల జట్టుపై భారత్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
ఆఖరి క్షణాల్లో ఆవిరి
తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి చివరి నిమిషంలో గోల్ చేసి నెగ్గిన జర్మనీ చాంపియన్స్ ట్రోఫీ ఇంకొన్ని క్షణాలు గడిస్తే ఒలింపిక్ చాంపియన్‌ను నిలువరించామన్న ఆనందం కలిగేది. కానీ ఒకే ఒక్క తప్పిదం భారత ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం 34 సెకన్లు మిగిలి ఉండగా గోల్‌ను సమర్పించుకున్న టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైనప్పటికీ... అంతిమ క్షణం వరకు పోరాడిన జర్మనీ అనుకున్న ఫలితాన్ని సాధించి చాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. భువనేశ్వర్: సొంతగడ్డపై సంచలన ప్రదర్శనతో శుభారంభం చేయాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-1 గోల్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ చివరి క్షణాల వరకు జర్మనీని గోల్ చేయనీకుండా నిలువరించిన టీమిండియా ఆఖర్లో పట్టు సడలించింది. కేవలం 34 సెకన్లు మిగిలి ఉండగా గోల్‌ను సమర్పించుకొని పరాజయాన్ని మూటగట్టుకుంది. జర్మనీ తరఫున ఏకైక గోల్‌ను 60వ నిమిషంలో ఫ్లోరియన్ ఫుచ్స్ చేశాడు. అంతకుముందు పలుమార్లు జర్మనీ గోల్ చేసే అవకాశాలను సమర్థంగా అడ్డుకున్న భారత గోల్‌కీపర్ శ్రీజేష్ చివర్లో తడబడటంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది. శ్రీజేష్ అడ్డుగోడలా నిలబడకపోతే జర్మనీ ఖాతాలో మరిన్ని గోల్స్ చేరేవి. చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా తర్వాత... తొలి టోర్నమెంట్లో పాల్గొంటున్న భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించకపోయినా జర్మనీ దూకుడుకు పగ్గాలు వేయడంలో సఫలమైంది. వేగవంతమైన ఆటతీరుకు మారుపేరైన జర్మనీ ఆరంభంలోని 10 నిమిషాల్లోనే రెండు పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. అయితే వీటిని నిలువరించడంలో భారత రక్షణశ్రేణి విజయవంతమైంది. 14వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ దక్కినా... గుర్జిందర్ సింగ్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ జకోబి అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా రెండు జట్లు వేగంగా ఆడినా... జర్మనీయే గోల్ చేసే అవకాశాలను సృష్టించింది. కానీ భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కారణంగా జర్మనీకి నిరాశ తప్పదేమో అనిపించింది. ఇక మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనుకుంటున్న తరుణంలో... అందివచ్చిన అవకాశాన్ని జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ ఫుచ్స్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎడమ వైపు నుంచి రివర్స్ ఫ్లిక్ షాట్ తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి జర్మనీ విజయా న్ని ఖాయం చేశాడు. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్ లో అర్జెంటీనాతో టీమిండియా తలపడుతుంది. శనివా రం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 3-1తో ప్రపం చ చాంపియన్ ఆస్ట్రేలియాపై; బెల్జియం 2-1తో పాకిస్తాన్‌పై; నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై గెలిచాయి. ‘జర్మనీలాంటి జట్టుతో ఆడుతున్నపుడు సదా అప్రమత్తంగా ఉండాలి. కానీ చివరి నిమిషంలో తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్నాం. ఓడిపోయినా మా ఆటగాళ్ల ఆట ఆకట్టుకుంది’ అని భారత జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలంట్ ఒల్ట్మన్స్ తెలిపారు. -
తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్
న్యూఢిల్లీ: మేటి జట్లతో ఆడే సమయంలో ఆద్యంతం అప్రమత్తంగా లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు తెలిసివచ్చింది. సొంతగడ్డపై శుక్రవారం మొదలైన జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు ఓటమి ఎదురైంది. ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన పూల్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 2-3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో కంగుతింది. ఆరెంజ్ సేన ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్ సాధించిపెట్టారు. దీంతో నెదర్లాండ్స్ తొలి అర్ధభాగానికే 3-1తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆట మొదలైన మూడో నిమిషంలోనే నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. భారత రక్షణ శ్రేణిని సునాయాసంగా బోల్తాకొట్టించిన మిలన్ వాన్బాల్ ఫీల్డ్ గోల్ చేశాడు. 1-0 ఆధిక్యం పొందిన జట్టు ఇదే జోరుతో ఆతిథ్య జట్టుపై పదేపదే దాడులను కొనసాగించింది. తర్వాత ఆట 13వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా గుర్జిందర్ సింగ్ గోల్‌గా మలచి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆట 25వ నిమిషంలో మార్క్ రిజ్కర్స్ గోల్‌తో నెదర్లాండ్స్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మూడు నిమిషాల వ్యవధిలో జోరు మీదున్న మిలన్ వాన్బాల్ రెండో గోల్ చేయడంతో 3-1తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే ఆట 42వ నిమిషంలో ఆకాశ్‌దీప్ ఫీల్డ్ గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. మరో గోల్ కోసం భారత ఆటగాళ్లు చేసిన దాడుల్ని నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పరాజయం తప్పలేదు. శనివారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 3-2తో ఈజిప్టుపై, దక్షిణాఫ్రికా 2-1తో ఇంగ్లండ్‌పై, ఫ్రాన్స్ 4-3తో స్పెయిన్‌పై, మలేసియా 3-2తో న్యూజిలాండ్‌పై గెలుపొందాయి. జర్మనీకి బెల్జియం షాక్ యూరోపియన్ చాంపియన్ బెల్జియం 3-1తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి షాకిచ్చింది. పూల్-ఎలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఆటగాళ్లు అసాధారణ ఆటతీరుతో ఆధిపత్యం కనబరిచాడు. 30వ నిమిషంలో మాక్సిమ్ కెపెల్లో, 45వ నిమిషంలో అర్థర్ వాన్ డొరెన్, 70వ నిమిషంలో అలెగ్జాండర్ లింథోడ్ గోల్స్ చేయగా, జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను క్రిస్టోఫర్ రుహుర్ (62వ ని.) చేశాడు. పూల్-బిలో ఆస్ట్రేలియా 5-2తో అర్జెంటీనాపై ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున జస్టిన్ డౌగ్లస్ (7వ ని.), ఫ్రాంక్ మెయిన్ (16వ ని.), కెప్టెన్ డానియెల్ బీల్ (23వ ని.), హమ్మండ్ (49వ ని.), హేవర్డ్ (49వ ని.) తలా ఓ గోల్ చేశారు. అర్జెంటీనా జట్టుకు జాక్విన్ లియోనల్ కొయెల్హో (31వ ని.), కెప్టెన్ గాంజాలో పెల్లట్ (62వ ని.) చెరో గోల్ సాధించిపెట్టారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7-4తో కెనడాపై జయభేరి మోగించింది. కొరియా తరఫున ఇన్వూ సియో (2, 16, 37వ ని.), సియూన్జు యూ (7, 31, 42వ ని.) చెరో మూడు గోల్స్ చేయగా, మిన్యంగ్ యూ (49వ ని.) ఒక గోల్ చేశాడు. కెనడా జట్టులో విక్రమ్‌జీత్ సంధు (22వ ని.), జాన్స్టన్ (52వ ని.), జాను మహల్ (58వ ని.), ఒలివర్ స్కాల్ఫిల్డ్ (59వ ని.) గోల్స్ చేశారు.