ఆఖరి క్షణాల్లో ఆవిరి
తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి
చివరి నిమిషంలో గోల్ చేసి నెగ్గిన జర్మనీ
చాంపియన్స్ ట్రోఫీ
ఇంకొన్ని క్షణాలు గడిస్తే ఒలింపిక్ చాంపియన్‌ను నిలువరించామన్న ఆనందం కలిగేది. కానీ ఒకే ఒక్క తప్పిదం భారత ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం 34 సెకన్లు మిగిలి ఉండగా గోల్‌ను సమర్పించుకున్న టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైనప్పటికీ... అంతిమ క్షణం వరకు పోరాడిన జర్మనీ అనుకున్న ఫలితాన్ని సాధించి చాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది.
భువనేశ్వర్: సొంతగడ్డపై సంచలన ప్రదర్శనతో శుభారంభం చేయాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-1 గోల్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ చివరి క్షణాల వరకు జర్మనీని గోల్ చేయనీకుండా నిలువరించిన టీమిండియా ఆఖర్లో పట్టు సడలించింది.
కేవలం 34 సెకన్లు మిగిలి ఉండగా గోల్‌ను సమర్పించుకొని పరాజయాన్ని మూటగట్టుకుంది. జర్మనీ తరఫున ఏకైక గోల్‌ను 60వ నిమిషంలో ఫ్లోరియన్ ఫుచ్స్ చేశాడు. అంతకుముందు పలుమార్లు జర్మనీ గోల్ చేసే అవకాశాలను సమర్థంగా అడ్డుకున్న భారత గోల్‌కీపర్ శ్రీజేష్ చివర్లో తడబడటంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది. శ్రీజేష్ అడ్డుగోడలా నిలబడకపోతే జర్మనీ ఖాతాలో మరిన్ని గోల్స్ చేరేవి.
చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా తర్వాత... తొలి టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించకపోయినా జర్మనీ దూకుడుకు పగ్గాలు వేయడంలో సఫలమైంది. వేగవంతమైన ఆటతీరుకు మారుపేరైన జర్మనీ ఆరంభంలోని 10 నిమిషాల్లోనే రెండు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించింది. అయితే వీటిని నిలువరించడంలో భారత రక్షణశ్రేణి విజయవంతమైంది. 14వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ దక్కినా... గుర్జిందర్ సింగ్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ జకోబి అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా రెండు జట్లు వేగంగా ఆడినా... జర్మనీయే గోల్ చేసే అవకాశాలను సృష్టించింది.
కానీ భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కారణంగా జర్మనీకి నిరాశ తప్పదేమో అనిపించింది. ఇక మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనుకుంటున్న తరుణంలో... అందివచ్చిన అవకాశాన్ని జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ ఫుచ్స్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎడమ వైపు నుంచి రివర్స్ ఫ్లిక్ షాట్ తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి జర్మనీ విజయా న్ని ఖాయం చేశాడు. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్ లో అర్జెంటీనాతో టీమిండియా తలపడుతుంది. శనివా రం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 3-1తో ప్రపం చ చాంపియన్ ఆస్ట్రేలియాపై; బెల్జియం 2-1తో పాకిస్తాన్‌పై; నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై గెలిచాయి.
‘జర్మనీలాంటి జట్టుతో ఆడుతున్నపుడు సదా అప్రమత్తంగా ఉండాలి. కానీ చివరి నిమిషంలో తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్నాం. ఓడిపోయినా మా ఆటగాళ్ల ఆట ఆకట్టుకుంది’ అని భారత జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలంట్ ఒల్ట్‌మన్స్ తెలిపారు.