తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్ | India lose opening tie to Netherlands in junior Hockey Junior World | Sakshi
Sakshi News home page

తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్

Published Sat, Dec 7 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్

తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్

న్యూఢిల్లీ:  మేటి జట్లతో ఆడే సమయంలో ఆద్యంతం అప్రమత్తంగా లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు తెలిసివచ్చింది. సొంతగడ్డపై శుక్రవారం మొదలైన జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు ఓటమి ఎదురైంది. ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన పూల్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 2-3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో కంగుతింది.

ఆరెంజ్ సేన ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి ఆటగాళ్లు  మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్ సాధించిపెట్టారు. దీంతో నెదర్లాండ్స్ తొలి అర్ధభాగానికే 3-1తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆట మొదలైన మూడో నిమిషంలోనే నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. భారత రక్షణ శ్రేణిని సునాయాసంగా బోల్తాకొట్టించిన మిలన్ వాన్‌బాల్ ఫీల్డ్ గోల్ చేశాడు. 1-0 ఆధిక్యం పొందిన జట్టు ఇదే జోరుతో ఆతిథ్య జట్టుపై పదేపదే దాడులను కొనసాగించింది. తర్వాత ఆట 13వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా గుర్జిందర్ సింగ్ గోల్‌గా మలచి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆట 25వ నిమిషంలో మార్క్ రిజ్‌కర్స్ గోల్‌తో నెదర్లాండ్స్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మూడు నిమిషాల వ్యవధిలో జోరు మీదున్న మిలన్ వాన్‌బాల్ రెండో గోల్ చేయడంతో 3-1తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే ఆట 42వ నిమిషంలో ఆకాశ్‌దీప్ ఫీల్డ్ గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. మరో గోల్ కోసం భారత ఆటగాళ్లు చేసిన దాడుల్ని నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పరాజయం తప్పలేదు. శనివారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 3-2తో ఈజిప్టుపై, దక్షిణాఫ్రికా 2-1తో ఇంగ్లండ్‌పై, ఫ్రాన్స్ 4-3తో స్పెయిన్‌పై, మలేసియా 3-2తో న్యూజిలాండ్‌పై గెలుపొందాయి.
 జర్మనీకి బెల్జియం షాక్
 యూరోపియన్ చాంపియన్ బెల్జియం 3-1తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి షాకిచ్చింది. పూల్-ఎలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఆటగాళ్లు అసాధారణ ఆటతీరుతో ఆధిపత్యం కనబరిచాడు. 30వ నిమిషంలో మాక్సిమ్ కెపెల్లో, 45వ నిమిషంలో అర్థర్ వాన్ డొరెన్, 70వ నిమిషంలో అలెగ్జాండర్ లింథోడ్ గోల్స్ చేయగా, జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను క్రిస్టోఫర్ రుహుర్ (62వ ని.) చేశాడు. పూల్-బిలో ఆస్ట్రేలియా 5-2తో అర్జెంటీనాపై ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున జస్టిన్ డౌగ్లస్ (7వ ని.), ఫ్రాంక్ మెయిన్ (16వ ని.), కెప్టెన్ డానియెల్ బీల్ (23వ ని.), హమ్మండ్ (49వ ని.), హేవర్డ్ (49వ ని.) తలా ఓ గోల్ చేశారు. అర్జెంటీనా జట్టుకు జాక్విన్ లియోనల్ కొయెల్హో (31వ ని.), కెప్టెన్ గాంజాలో పెల్లట్ (62వ ని.) చెరో గోల్ సాధించిపెట్టారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7-4తో కెనడాపై జయభేరి మోగించింది. కొరియా తరఫున ఇన్‌వూ సియో (2, 16, 37వ ని.), సియూన్జు యూ (7, 31, 42వ ని.) చెరో మూడు గోల్స్ చేయగా, మిన్‌యంగ్ యూ (49వ ని.) ఒక గోల్ చేశాడు. కెనడా జట్టులో విక్రమ్‌జీత్ సంధు (22వ ని.), జాన్‌స్టన్ (52వ ని.), జాను మహల్ (58వ ని.), ఒలివర్ స్కాల్‌ఫిల్డ్ (59వ ని.) గోల్స్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement