Karnataka Election Results 2018
-
కుమారస్వామి ప్రమాణానికి ఆయనెందుకు రాలేదు?
బెంగళూరు/భువనేశ్వర్: నరేంద్ర మోదీ ప్రాభవానికి, ఎన్డీఏ వరుస విజయాలకు అడ్డుకట్టవేసే క్రమంలో ఒక్కటవుతోన్న విపక్ష పార్టీలు నేడు ఓకే వేదికపై చేరాయి. జనతాదళ్(సెక్యూలర్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. ముగ్గురు తప్ప! వారు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్. కేసీఆర్, స్టాలిన్లు కుమార ప్రమాణానికి రాలేకపోవడానికి గల కారణాలను ఇదివరకే ప్రకటించారు. బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం యత్నిస్తోన్న కేసీఆర్.. రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేదు. అందుకే మంగళవారమే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేడౌడలను కలిసొచ్చారు. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం కావడంతో తాను రాలేనని డీఎంకే నేత స్టాలిన్ కుమారస్వామికి వర్తమానం పంపారు. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు వేదికగా విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయా నేతలు భావిస్తున్నవేళ నవీన్ గైర్హాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నవీన్ ఎందుకు రాలేదు?: 18 ఏళ్లుగా ఒడిశాలో అధికారంలో కొనసాగుతోన్న నవీన్ పట్నాయక్.. తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలపట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా మెలగటం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న సందర్భంలోనూ నవీన్ స్థిమితంగా ఉండిపోయారుతప్ప కూటమిలో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఒకవైపు ఒడిశాలో తన ప్రత్యర్థి బీజేపీనే అయినా.. కాషాయ వ్యతిరేక కూటమిలో చేరికపై నవీన్ నిర్లిప్తత ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. మైనింగ్ కుంభకోణం, శారద స్కామ్ వంటి కేసుల్లో బీజేడీ పెద్ద తలల ప్రమేయం ఉండటం, ఆ కేసుల్లో సీబీఐ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తు.. కేంద్రం సూచనలకు అనుగుణంగా జరుగుతుండటం తదితర కారణాల వల్లే నవీన్ బీజేపీపై గట్టిగా గళం విప్పడంలేదని ఒడిశా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విచిత్రమేమంటే బీజేపీ కూడా నవీన్-కాంగ్రెస్‌ల సయోధ్యపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తుంది. ఇటు బీజేపీకి-అటు కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటించే నవీన్ పట్నాయక్.. ఏ ఒక్క పార్టీని వ్యతిరేకించే కూటమిలోనో చేరబోరని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. -
‘కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని నిలిపేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏడీహెచ్‌ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్‌ఎం తన పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా సోమవారం సాయంత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది తెలియాల్సిఉంది. గతవారం యడ్యూరప్పను సీఎం చేసిన ఇదే కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై జేడీయూ-కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఫలితాంగా మే 19న అసెంబ్లీలో బలపరీక్షలో జరగడం, డివిజన్ ఓటింగ్‌కు ముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే గవర్నర్.. కుమారస్వామినా ఆహ్వానించడం తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజారిటీ(112 సీట్లు) రాకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించింది? అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని, ఓటరు తీర్పును అవమానించడం కాదా? అన్న ప్రశ్నలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సవివరంగా సమాధానమిచ్చారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?: ‘‘చాలా మంది అడుగుతున్నారు.. బలం లేకపోయినా మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెలా వచ్చారు? అని. నిజమే, మరి ఏ పార్టీకి బలం రాలేదు కాబట్టి కర్ణాటకలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అలా చేస్తే ప్రజా తీర్పును గౌరవించినట్లవుతుందా? అతిపెద్ద పార్టీగా అవతరించిది కాబట్టే బీజేపీకి మొదటి అవకాశం లభించింది. నిజానికి కర్ణాటక ప్రజలు ఇచ్చింది అయోమయ తీర్పు కాదు. సుస్పష్టంగా కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు. కాబట్టే, ప్రజా తీర్పును గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రుల్లో చాలా మంది ఓడిపోయారు. ముఖ్యమంత్రి కూడా ఒక స్థానంలో ఓడిపోయి, రెండో స్థానంలో బొటాబొటి మెజారిటీతో గెలిచారు. జేడీఎస్ సైతం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతోనే 38 సీట్లు గెలుచుకుంది. ఎక్కడిక్కడ ఓటర్లు కాంగ్రెస్ వ్యతిరేకులనే గెలిపించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు కాబట్టే.. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంది. కోర్టుకు అబద్ధాలు చెప్పారు: కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో గెలిచిన జేడీఎస్.. తిరిగి అదే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం ముమ్మాటికీ అపవిత్రచర్యే. అధికారం కోసం విలువలు, సిద్ధాంతాలు వదిలేసిన ఆ రెండు పార్టీలను కన్నడజనం అసహ్యించుకుంటున్నారు. ఈ అపవిత్రపొత్తుతో అక్కడి జనం సంతోషంగాలేరు. యడ్యూరప్ప బలనిరూపణ కోసం ఏడు రోజులు గడువు అడిగారని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారని తీర్పును ప్రభావితం చేసేలా వాళ్లు కోర్టుకు అబద్ధాలు చెప్పారు’’ అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ సంబురాలపై సెటైర్లు: కర్ణాటకలో కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకోవడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘ఏం సాధించారని వీళ్లు సంబురాలు చేసుకుంటున్నారు? ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకా, దొంగ ఓట్లు, నకిలీ ఐడీకార్డులు సృష్టించినందుకా, కులం, మతం ప్రాతిపదికన జనాన్ని చీల్చేందుకు ప్రయత్నించినందుకా, 122 సీట్ల నుంచి 78 సీట్లకు దిగజారినందుకా, ముఖ్యమంత్రి ఒక స్థానంలో చిత్తుగా ఓడిపోయినందుకా లేక జేడీఎస్‌తో అపవిత్రపొత్తు పెట్టుకున్నందుకా? ఎందుకు వాళ్లు జరుపుకొంటున్నారో అర్థంకావడంలేదు. కర్ణాటక ప్రజలు బీజేపీని మాత్రమే ఆశీర్వదించారు. అందుకే 40 స్థానాల నుంచి 107 స్థానాలకు ఎదిగాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ నెల 23న కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. -
కుమారస్వామికి దిమ్మతిరిగే సవాల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఓడిపోలేదని, అసెంబ్లీలో యడ్యూరప్ప అత్యుత్తమ ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్‌లు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్న ఆయన.. కాబోయే సీఎం కుమారస్వామికి దిమ్మతిరిగేరీతిలో సవాల్ విసిరారు. దమ్ముంటే..: ‘‘ఎన్నికల ముందు కాకుండా.. ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. నిన్నటిదాకా సాగిన కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించకూడదనేదే ఆ రహస్య ఒప్పందం. నేను ముఖ్యమంత్రినైతే కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి అన్నారు. ఇప్పుడు మేం ఆయనకు సవాలు విసురుతున్నాం.. దమ్ముంటే చెప్పిన మాట(కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు) మీద నిలబడండి. జేడీఎస్-కాంగ్రెస్‌ది ఫక్తూ అవకాశవాద పొత్తేకానీ సైద్ధాంతిక పొత్తు కానేకాదు’’ అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. (చదవండి:బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ఒక్కడికి భయపడి..: ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపైనా కేంద్ర మంత్రి జవదేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘‘బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. కానీ వాస్తవానికి ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్‌ను జరగనీయకుండా అడ్డుకోవడం, కాగ్‌ను విపరీతంగా నిందించడం, సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. నిజంగా మేము ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిఉంటే వాళ్లు మా వెంట వచ్చేవాళ్లేకదా, తప్పుడు ఆడియోలతో కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. ఎన్నికల్లో ఓడిపోతే తప్పు ఈవీఎంలపై నెడతారు. యడ్యూరప్పను సీఎంగా ప్రమాణం చేసియిస్తే గవర్నర్‌ను నిందిస్తారు. మరి వీళ్ల సీఎంతో ప్రమాణం చేయిచేటప్పుడు మాత్రం గవర్నర్ మంచోడే అంటారు. మోదీ ఒక్కడికి భయపడి, ఆయనకు వ్యతిరేకంగా కూటములు నిర్మించడం నిజమైన రాజకీయం కానేకాదు. ఆ కూటములు ఎప్పటికీ నిలబడలేవు’’ అని జవదేకర్ వివరించారు. (చూడండి: అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం) -
జేడీఎస్-కాంగ్రెస్ అత్యవసర భేటీ
సాక్షి, బెంగళూరు: బలపరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిన దరిమిలా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు జేడీఎస్-కాంగ్రెసలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఇరుపార్టీలు ఉమ్మడిగా లెజిస్లేటివ్ భేటీని నిర్వహించాయి. బెంగళూరులోని హిల్టన్ హోటల్లో జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు వీరేనంటూ కొన్నిపేర్లు కూడా వెల్లడయ్యాయి. మరోవైపు సోమవారం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం..
రాయ్‌పూర్: బలపరీక్ష సందర్భంలో ప్రొటెం స్పీకర్ సహా బీజేపీ ఎమ్మెల్యేలంతా జాతీయగీతాన్ని అవమానించి ఘోరతప్పిదం చేశారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ‘‘మీరంతా టీవీల్లో గమనించే ఉంటారు.. జాతీయగీతం ఆలపించడానికి ముందే ప్రొటెం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యేలు అసహనంగా సీట్లలో నుంచి లేచిపోవడాన్ని చూసేఉంటారు. ఆ చర్యతో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ దేశవ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకున్నాయి’’ అని అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న ఆయన.. కర్ణాటక బలపరీక్షలో బీజేపీ ఓటమిపై స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలాతో కలిసి శనివారం రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ‘‘ఇదే..దీని గురించే మా పోరాటమంతా. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు జాతీయగీతం పట్ల గౌరవంలేదు. ప్రజాస్వామ్యమంటే అసలే గిట్టదు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. కాబట్టే మేం జనంతో కలిసి మేము గట్టిగా పోరాడుతున్నాం. బలం లేకపోయినా యడ్యూరప్పను సీఎం చేయడం ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకునే వ్యవహారానికి తెరలేపారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలోగానీ, మొన్న గోవా, మణిపూర్లలోగానీ వీళ్లు ప్రజాతీర్పును గౌరవించకుండా అడ్డదారుల్లో అధికారం కైవసం చేసుకునేందుకు యత్నించారు. జాతిని కల్లోలం వైపునకు నెడుతోన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం. కర్ణాటక పరిణామం వాళ్లకొక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విజయంసాధించిన జేడీయూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, దేవేగౌడ గారికి, ప్రత్యేకించి కన్నడిగలకు నా అభినందనలు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. (చూడండి: కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!) ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష.. యడ్యూరప్ప నిష్క్రమణతో ఊహించని మలుపు తిరిగినట్లైంది. డివిజన్ ఓటింగ్‌కు ఆదేశించకముందే యడ్డీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కసరత్తు ప్రారంభించారు. -
కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన దరిమిలా గవర్నర్ వజుభాయ్ వాలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారమే కుమారస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రానున్నట్లు తెలిసింది. ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని కన్నడ రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటు కుమారస్వామి సైతం మీడియాతో మాట్లాడుతూ ‘గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్, జేడీఎస్‌లను ఓటర్లు విశ్వసించలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజనీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస 78, జేడీఎస్ 38, బీఎస్పీ 1, ఇతరులు 2 సీట్లను గెలుచుకోవడం, అతిపెద్ద పార్టీ అయిన కారణంగా బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, ఆ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం లాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి. సరిగ్గా 60 గంటలు కూడా గడవకముందే యడ్డీ బలపరీక్షలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. -
బలపరీక్షలో నెగ్గేది కాంగ్రెసే
-
కర్నాటకం: హైదరాబాద్ టూ బెంగళూరు
-
వేసవి విడిది కాదు, రాజకీయ వేడిఇది!
వేసవి విడిది కోసం అంతా చల్లని ప్రాంతాలకు పరుగులు పెడుతోంటే, కర్నాటక రాజకీయం నేతల్ని మండుటెండల్లో భాగ్యనగరానికి పరుగులు పెట్టించింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ధాటినుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జెడిఎస్ లకు హైదరాబాద్ రాజకీయ విడిదిగా మారడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం లే నప్పుడు ఎమ్మెల్యేలను గంపగుత్తాగా తీసుకెళ్లి ప్రత్యర్థులకు చిక్కకుండా దాచిపెట్టే సాంప్రదాయం గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతూ వస్తోంది. పాలిటిక్స్‌లోని ఈ రిసార్ట్ రాజకీయాలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ రాజకీయ విడిదిని ఏర్పాటు చేసాయన్నది ఓసారి చూద్దాం. హర్యాణా... హర్యాణా రాజకీయాలు 1982లో ఇదే రిసార్ట్స్ రాజకీయాలకు తెరమీదకొచ్చాయి. అక్కడ కాంగ్రెస్‌కి దీటుగా పురోగమిస్తోన్న లోక్ దళ్ పార్టీ, బీజేపీల కలయికని కాదని, కాంగ్రెస్‌ని బలనిరూపణ కోసం పిలవడంతో లోక్ దళ్ అధినేత దేవీలాల్ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి కాపాడుకోవడం కోసం తన పార్టీ 48 ఎమ్మెల్యేలతో సహా, తనకు మద్దతునిస్తానన్న బిజెపి ఎమ్మెల్యేలను ఢిల్లీలోని ఓ హోటల్‌కి తరలించారు. అయితే ఇంత భద్రంగా దాచినా ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది ఆ పార్టీ. ఒక ఎమ్మెల్యే బయటకు పోయే దారిలేక హోటల్లోని పైప్‌లైన్‌పైన జారుకుంటూ తప్పించుకుపోవడంతో చివరకు కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కర్నాటక... చాలా రాష్ట్రాలకు రిసార్ట్ రాజకీయాల అనుభవం ఉన్నా, కర్నాటకకి మాత్రం ఈ విషయంలో ఎక్కువ అనుభవాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కర్నాటక పలుసందర్భాలో రాజకీయ విడిదికి కేంద్రంగా మారింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు 1983 లో రామకృష్ణ హె గ్డే రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించారు. 2004, 2006, 2008, 2009–11, 2012 వరకు అనేక సందర్భాల్లో కర్నాటక రాజకీయాలు రిసార్ట్స్‌లో సేదదీరాయి. ప్రధానంగా 2009 నుంచి, 2011 మధ్య కాలంలో ప్రత్యర్థి పార్టీలనుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దాదాపు 80 మంది బిజెపి ఎమ్మెల్యేలను బెంగుళూరులోని స్టార్ హోటల్‌కి తరిలించారు. ఆంధ్రప్రదేశ్ ... మన తెలుగు రాష్ట్రంలో కూడా రిసార్ట్ రాజకీయాల్లో స్థానం ఉంది. 1984లో నందమూరి తారక రామారావుని గద్దె దించేందుకు రెండు సార్లు రిసార్ట్ రాజకీయాలకు నాంది పలికారు. 1984లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాటి గవర్నర్ రామ్‌లాల్ ఠాకూర్ , ఎన్‌టిఆర్‌ని బర్తరఫ్ చేసి, నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలను హైదరాబాద్ నుంచి బెంగుళూరులోని నంది హిల్స్‌కి, అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రభుత్వం పడిపోవడంతో. మళ్ళీ ఎన్‌టి రామారావు రథయాత్ర ద్వారా జనంలోకెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇందిరాగాంధీ ఆరోజు శంకర్ దయాళ్ శర్మని గవర్నర్‌గా నియమించారు. ఆ తరువాత 1995లో చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టిరామారావుని గద్దెదించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యేలందర్నీ రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని అప్పటి వైస్రాయ్ హోటల్‌కి తరలించి దాచిపెట్టి, ఎవ్వర్నీ కలవనివ్వకుండా కట్టడి చేసారు. బలనిరూపణకు అవసరమైన ఎమ్మెల్యేలను నయానా భయానా దక్కించుకునేవరకూ ఈ నాటకం కొనసాగడం తెలిసిందే. గుజరాత్ ... 1995లో 47 మంది ఎమ్మెల్యేలున్న శంకర్ సింగ్ వఘేలా బీజేపీ పైన తిరుగుబాటు చేసి తన ఎమ్మెల్యేలందర్నీ మధ్యప్రదేశ్‌లోని స్టార్ హోటల్ ఖజురహో తరలించారు. చివరకు ఒప్పందం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కి బదులుగా వఘేలా మద్దతుదారుడైన సురేష్ మెహతా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అది ఎంతోకాలం నిలవలేదు. తరువాత తన అనుయాయులతో పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఉత్తర ప్రదేశ్ ... 1998 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కళ్యాణ్ సింగ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని నాటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రమేష్ భండారీ డిస్మిస్ చే శారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జగదాంబికా పాల్ ని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన 48 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బలనిరూపణ సందర్భంగా బిజెపి తన సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సింగ్ కోర్టుకి వెళ్లడంతో తిరిగి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. బిహార్... బీహార్‌లో 2000 సంవత్సరంలో జనతాదళ్‌యూ(జేడీయూ) నేత నితీష్ కుమార్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆçహ్వనించిన సందర్భంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు తమ శాసన సభ్యులను పాట్నా లోని ఓ హోటల్లో దాచిపెట్టారు. అదే సందర్భంలో బలనిరూపణలో ఓటమిపాలవడానికి ముందు నితీష్ కుమార్ ఏడు రోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2005లో లోక్ జనశక్తి పార్టీ, బీజేపీ, జేడీయూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తన ఎమ్మెల్యేలను జమ్షెడ్పూర్లోని ఓ హోటల్లో ఉంచింది. మహారాష్ట్ర ... 2002లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ–శివసేన లోకి తన సభ్యులు జారిపోకుండా ఉండేందుకు ఆనాటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ బెంగుళూరులోని హోటల్‌కి తన ఎమ్మెల్యేలను తరలించారు. ఉత్తరాఖండ్... 2016లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో తన సభ్యులను కాపాడుకునేందుకు బిజెపి తన శాసన సభ్యులను తీసుకొని జైపూర్‌లోని ఓ హోటల్లో బసచేసింది. ఇరు పార్టీలు గెలుపుగుర్రాల్ని కైవసం చేసుకునేందుకు విపరీతంగా డబ్బు పాచికలు వేసారు. అయితే చివరకు రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్రం తొలుత నిర్ణయించినా అది హైకోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆ తరువాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. తమిళనాడు... తమిళనాడు తమ్ముళ్ళు కూడా ఏం తక్కువ తినలేదనడానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతర రాజకీయాలు సాక్ష్యం. 2017లో పన్నీర్‌సెల్వం చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన అనంతరం ఎఐడిఎంకె నాయకురాలు వి.కె.శశికళ తన ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడుకునేందుకు వాళ్లందర్నీ చెన్నై లోని రిసార్ట్స్‌కి తరలించడం తెలిసిందే. -
తాజ్‌కృష్ణలో ముగిసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్ - జేడీఎస్ అధినేతలు తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం ముగిసింది. కర్ణాటక సీఎల్పీ నేతగా సిద్ధారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిన్నర్ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. వారికి టీ కాంగ్రెస్ ఏపీ సరిహద్దు వరకు 200 వాహనాల కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఏపీసీసీ, కర్ణాటక నాయకుల కాన్వాయ్ జత చేరనుంది. -
యడ్యూరప్ప నోటివెంట అసలు నిజం..
బెంగళూరు: బలపరీక్షలో బీజేపీనే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎలా గెలుస్తారంటే మాత్రం.. ‘రేపు మీరే చూస్తారుగా..’. అని తప్పించుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం అసలు నిజం కక్కేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నూటికి నూటాఒక్కశాతం బలపరీక్షలో తమదే విజయమన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘అవును. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మేమెలా గెలవగలం..’’ అని అనేశారు. రేపు రాష్ట్రంలో సంబురాలు: ‘‘ఊహించినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రేపు సాయంత్రం కర్ణాటకలో సంబురాలు జరుగుతాయి. ఆ విజయాన్ని ఆరుకోట్ల కన్నడిగులకు అంకితం చేస్తాం. జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్రపొత్తు, వాళ్లు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ప్రజలు బుద్ధిచెప్పినా, దొడ్డిదారిలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా చివరికి గెలుపుమాదే’’ అని సీఎం యడ్యూరప్ప అన్నారు. -
అసంతృప్తితో వెళ్లిపోయిన కుమారస్వామి
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన తరహాలో కర్ణాటకలోనూ బీజేపీ పాచిక పారేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేలకు ఎర చూపుతూ బీజేపీ లింగాయత్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మధ్య సఖ్యత కొరవడుతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టడంతో జేడీఎస్ నేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడిన ఆయన తీవ్ర అసంతృప్తితో హోటల్ నుంచి నోవాటెల్‌కు వెళ్లిపోయారు. మీ ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేక పోతున్నారంటూ పెదవి విరిచారు. జాగ్రత్తగా ఉంటే మంచిదంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, పరమేశ్వరలకు సూచించారు. నోవాటెల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ కానున్నారు. చుక్కలు చూపిస్తోన్న 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోని 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించేయత్నం చేయడం కారణంగా.. తాజ్‌కృష్ణలో జరిగిన సీఎల్పీ భేటీలో వీరి నుంచి సమావేశంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు సీఎల్పీ భేటీకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గమనార్హం. వీరిలో రాయచూర్ జిల్లా మక్కి ఎమ్మెల్యే ప్రతాఫ్ గౌడ, బళ్లారి జిల్లా హోస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఉన్నారు. దీంతో బీజేపీ తమ నేతలను ప్రలోభాలకు గురిచేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర నేతలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి నెలకొంది. -
ఎమ్మెల్యేల తరలింపు, ప్లాన్ వన్..టూ.. త్రీ..!
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అధికార పీఠం ఎవరికి దక్కబోతుందో మరికొన్ని గంటల్లో తేలబోతుంది. అధికారం దక్కించుకోవడానికి రేపు బెంగళూరులోని విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్-జేడీఎస్‌లు ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ, నోవాటెల్‌కు తరలించి, భేటీల మీద భేటీలు నిర్వహిస్తోంది. రేపు విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో ఏ విధంగా వ్యవహరించాలో ఎమ్మెల్యేలకు సూచిస్తోంది. నేడు ఉదయం ఇక్కడికి వచ్చిన వీరిని, రేపు ఉదయం కల్లా మళ్లీ బెంగళూరుకు తరలించాల్సి ఉంది. అయితే వీరిని ఏ విధంగా బెంగళూరు తీసుకెళ్లాలి.. మధ్యలో బీజేపీ ఎలాంటి పన్నాగాలకు పాల్పడకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో అనే అంశాలపై కాంగ్రెస్-జేడీఎస్ ఇప్పటికే నిర్ణయించాయి. ఎమ్మేల్యేల తరలింపు మూడు రకాల ప్లాన్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అవేమిటంటే... ప్లాన్ వన్ : ఇప్పటికే ఎమ్మెల్యేల తరలింపుకు రెండు ప్రత్యేక విమానాలు సిద్ధమైనట్టు తెలిసింది. వీరు ఏ సమయానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతారో సరియైన టైం తెలియనప్పటికీ, ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి ఎమ్మెల్యేలందరూ సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందింది. ప్రత్యేక విమానాలు కాబట్టి విమానశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి గంటన్నరలో బెంగళూరుకు చేరుకోవచ్చు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ.. ప్రత్యేక విమాన అనుమతిని నిరాకరించింది. దీనిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ప్లాన్ టూ : ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేల తరలింపుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, బస్సుల ద్వారానైనా బెంగళూరుకు తరలించాలని నాలుగు ఏసీ స్లీపర్ బస్సులు రెడీ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ టూ బెంగళూరు 550 కిలోమీటర్లు. హై ఎండ్ బస్సులు కావడంతో, బెంగళూరుకు 8 గంటల్లో చేరుకోవచ్చు. తెలంగాణ బోర్డర్ వరకు ఇక్కడి కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ తెలంగాణ బోర్డర్ దాటించిన తర్వాత, ఏపీలోకి ప్రవేశమవుతారు. ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బెంగళూరుకి అత్యంత సురక్షితంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. అయితే నేడు హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రోడ్డు మార్గం ద్వారానే వచ్చారు. దీంతో మళ్లీ రోడ్డు మార్గమే బెస్ట్ అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ త్రీ : ప్రత్యేక విమానాల్లో తరలింపు సాధ్యం కాక.. బస్సుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే మూడో ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అదే కార్ల ద్వారా ఎమ్మెల్యేల తరలింపు. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున మొత్తం ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి బెంగళూరుకు తరలించడానికి సరిపడ కార్లను సిద్ధం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన కార్లతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ కార్లను ఎమ్మెల్యేల కోసం రెడీ చేశారు. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా బెంగళూరు వెళ్లేందుకు రెడీగా అయ్యారు. ఇది మూడో ప్లాన్. ఈ మూడు రకాల ప్లాన్లతో కాంగ్రెస్-జేడీఎస్‌లు తమ పార్టీ ఎమ్మెల్యేలను రేపటికి బెంగళూరు తరలించబోతున్నాయి. విధాన సౌధలో బలపరీక్ష ఎదుర్కోబోతున్నాయి. -
తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్- జేడీఎస్ అధినేతలు చర్చిస్తున్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ కీలక భేటీలో పాల్గొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలపరీక్షలో నెగ్గాలని నేతలకు సూచించారు. తమ కూటమి అభ్యర్థి కుమారస్వామికే సీఎం పీఠం దక్కేలా చూసేందుకు అంతా సంసిద్ధం కావాలని సూచించారు. శనివారం బల నిరూపణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, మధుయాష్కీ, కుంతియలు పాల్గొన్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. తాజ్‌కృష్ణకు కుమారస్వామి చేరుకుని కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు. నోవాటెల్ నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు రానున్నారు. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కీలక సమావేశం అనంతరం రాత్రి బెంగళూరుకు పయనం అవుతారు. రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపన్నను నియమించి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆర్డర్ ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే బోపన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన దేశ్‌పాండేను పక్కనపెట్టి బోపన్నను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
బలపరీక్షలో గెలిచేది బీజేపీనే! ఎలాగో తెలుసా..
న్యూఢిల్లీ: కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌లో నిమిషానికో మలుపు.. సెకనుకో ఊహాగానం! శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఎదురుచూస్తున్నవేళ.. జేడీయూ-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టుకు ఫోర్జరీ సంతకాల జాబితా: కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీ-లా హోటల్ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారట. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదట. దీంతో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారట. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ‘రిపబ్లిక్’ కథనంలో వెల్లడించింది. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసంగా గెలుస్తారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ ఏమంటోంది?: తమ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరిని.. బీజేపీ నేతలు ఢిల్లీలో బంధించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యే (ఆనంద్ సింగ్) పేరును కూడా వెల్లడించింది. అయితే, ‘రిపబ్లిక్’ కథనం చెప్పినట్లు 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. -
తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్ కీలక సమావేశం
-
దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీకి, జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి పోరు వాడివేడిగా ఉంది. కర్ణాటక రాజకీయ పరిస్థితులు ఓ వైపు నుంచి కాక పుట్టిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ కాస్త కూల్‌గా వ్యవహరించారు. రాజకీయాలన్నింటిన్నీ పక్కన పెట్టి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవె గౌడకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. దేవె గౌడకు ఫోన్ చేసిన మోదీ, ఆయన 85వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.‘మన మాజీ ప్రధాని హెచ్డీ దేవె గౌడ జీతో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. దేవె గౌడ ఆరోగ్యవంతుడిగా సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు దేవె గౌడ మన దేశ ప్రధానిగా పనిచేశారు. నేడు ఆయన 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యడ్యూరప్పచే ప్రమాణ స్వీకారం చేయించడంపై ఆ రాష్ట్ర గవర్నర్‌పై కాంగ్రెస్, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ వారి ప్రయత్నాలకు చెక్‌పెట్టిన బీజేపీ, అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. బీజేపీ వైపే మొగ్గుచూపిన కర్ణాటక గవర్నర్ సైతం బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప చేతనే రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయించారు. రేపటి వరకు ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ ఉత్కంఠబరిత రాజకీయ పరిస్థితులతో బీజేపీపై కాంగ్రెస్, జేడీఎస్‌లు గుర్రుగా ఉన్నాయి. Spoke to our former Prime Minister Shri HD Deve Gowda Ji and conveyed birthday wishes to him. I pray for his good health and long life. — Narendra Modi (@narendramodi) May 18, 2018 -
నాలుగో రోజూ కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
ముంబై : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న వాడివేడి రాజకీయాలు, ముడి చమురు ధరలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వీటన్నింటి ప్రభావంతో నేడు(శుక్రవారం) సెన్సెక్స్ 301 పాయింట్ల మేర కుప్పకూలింది. 301 పాయింట్ల దిగజారిన సెన్సెక్స్ చివరికి 34,848 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 86 పాయింట్ల నష్టంలో 10,600కు దిగువన 10,596 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్‌లో ఎల్ అండ్ టీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గ్రాసిమ్‌లు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. అటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, ఐటీసీ, కొటక్ మహింద్రా బ్యాంకులు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 250 పాయింట్లు కిందకి పడిపోయింది. అమర రాజా బ్యాటరీస్, ఎస్ఆర్ఎఫ్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, నాల్కో, గ్రాఫైట్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఎస్కార్ట్స్, జ్యోతి ల్యాబ్స్‌లు దాదాపు 13 శాతం వరకు క్షీణించాయి. ఇప్పటికే మండుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గోల్డ్‌మ్యాన్ శాచ్స్ రిపోర్టు వెల్లడించడంతో, మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుల దేశీయ కరెంట్ అకౌంట్ లోటుకు ప్రమాదకరమని ఈ గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసు దిగ్గజం వెల్లడించింది. మరోవైపు కర్ణాటక రాజకీయ పరిస్థితులు వాడివేడిగా మారుతున్నాయి. శనివారం ఫ్లోర్ టెస్ట్ ఖాయం కావడంతో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రారంభం నుంచి నష్టాలు పాలవుతూ వచ్చిన మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్‌కు వచ్చేసరికి ఆ నష్టాలను మరింత పెంచుకున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్రాష్ అయింది. 34 పైసలు బలహీనపడి 68.04 వద్ద నమోదైంది. -
ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్‌గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్ తరలించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం... యెడ్డీ ఆదేశాల తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంట తర్వాత యెడ్యూరప్ప.. పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్, షాంగ్రీ-లా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేయాలని, భద్రత ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. గంటల వ్యవధిలోని పోలీస్‌శాఖ ఆ ఆదేశాలను అమలు చేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని వెంటనే రాష్ట్రం తరలించాలని ఆయా పార్టీలు ప్రణాళిక రచించాయి. కాంగ్రెస్ తరపున డీకే శివకుమార్, జేడీఎస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు. ఆటంకాలు... తొలుత వారిని ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా కొచ్చి(కేరళ)కు గానీ తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ(Directorate General of Civil Aviation) నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) తప్పనిసరై మరోచోటకు తరలించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అంతకు ముందు జేడీఎస్ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందిన విషయం తెలిసిందే. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేల తరలింపు సాగిందిలా... తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. రాత్రి 11.30 ని. సమయంలో డీజీసీఏ.. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఫ్లాన్ మార్చి వారిని రాష్ట్రం దాటించాలని నిర్ణయించారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఈగల్టన్ రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. బస్సులు నిండిపోవటంతో మరో బస్సు(స్లీపర్) వాటికి కలిసింది. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా పరిస్థితులు సర్దుకున్నాక ఆ మూడు బస్సులు వేగంగా ఆంధ్రా సరిహద్దు వైపు కదిలాయి. ముందస్తు జాగ్రత్తగా... అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో(గౌరీబిదనూరు, చికబళ్లాపూర్ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నాలు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్ వరకు ఎమ్మెల్యేలు జమీర్ అహ్మద్ ఖాన్, శివరామ హెబ్బర్‌లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కీ మాటల్లో.. ‘మా పార్టీ ఎమ్మెల్యేల తరలింపు చాలా ప్రణాళిక బద్ధంగా జరిగింది. వారికి హైదరాబాద్‌లో ఉంచటమే సురక్షితమని భావించి ఇక్కడికి రప్పించాం. అధికారం కోసం బీజేపీ దారుణంగా దిగజారింది. అందుకు ప్రధాని మోదీ మద్ధతు పలకటం దారుణం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ కిడ్నాప్ చేసింది. ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తోంది. బీజేపీ నేతలు క్రిమినల్స్‌లాగా వ్యవహరిస్తున్నారు’ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ మండిపడ్డారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమానం నిలిపివేత
సాక్షి, బెంగళూరు: కర్టాటక కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రయాణించాల్సిన విమానాన్ని గంటలపాటు నిలిపివేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని శిబిరానికి వచ్చేందుకుగానూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, ఆరుగురు తాజా ఎమ్మెల్యేలు కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆసీనులయ్యారు. కానీ.. విమానం టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యేలు, నేతలు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం పెరిగిపోయింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే విమానాన్ని నిలిపివేశారేమోనన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అందుకే బస్సుల్లో వచ్చారు..: కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం రాత్రి కూడా సరిగ్గా ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలనుకున్నా, అందుకు ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించడంతో చివరికి బస్సుల్లో తరలించారు. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి నేతలు శుక్రవారం బయలుదేరారు. గంటల నిరీక్షణ అనంతరం.. విమానానికి అనుమతి దొరకడంతో నేతలు హైదరాబాద్ వైపునకు ఎగిరివెళ్లారు. తాజ్‌కృష్ణలో సీఎల్పీ భేటీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో సీఎల్పీ సమావేశం జరుగనుంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరమైన హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లోనే సాయంత్రం 5గంటలకు సీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి బలపరీక్షలో సభ్యులు అనుసరించాల్సిన విధానంపై సీనియర్లు సూచనలు చేయనున్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
-
కొచ్చికి కాంగ్రెస్-జేడిఎస్ ఎమ్మెల్యేలు
-
గోవా,మణిపూర్,బీహార్‌లపై కర్ణాటక పరిణామాల ప్రభావం