Masters Champions League
-
జెమినీ అరేబియన్స్ కెప్టెన్‌గా సెహ్వాగ్
మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ దుబాయ్: మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో పాల్గొనే జెమినీ అరేబియన్స్ జట్టుకు డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా, టీమ్ డెరైక్టర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు టీమ్ ప్యాట్రన్ మేధా అహ్లువాలియా ఈ విషయాన్ని ప్రకటించారు. జట్టుకు సంబంధించిన లోగో, జెర్సీలను ఆటగాళ్లు, మేనేజ్మెంట్ దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లో ఆవిష్కరించారు. విభిన్న తరహాలో జట్టును పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశామని టీమ్ యజమాని, సీఈఓ నళిన్ ఖైతాన్ అన్నారు. జెమినీ జట్టులో సంగక్కర, చందర్‌పాల్, బ్రాడ్ హాగ్, జస్టిన్ కెంప్, మురళీధరన్, మిల్స్, రాణా నవీద్, ఆశిష్ బగాయ్లాంటి మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లను తిరిగి బరిలోకి దించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఎంసీఎల్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. ప్రతి ఫ్రాంచైజీ తరఫున జట్టు బరిలోకి దిగుతుంది. మొత్తం 250 మంది మాజీలు ఈ టోర్నీలో భాగం పంచుకుంటున్నారు. దుబాయ్, షార్జాల్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. -
ఎంసీఎల్ జట్టును కొన్న సంజయ్ దత్
దుబాయ్: మాజీ క్రికెటర్లతో ప్రారంభం కాబోతున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ జట్టును కొన్నారు. ప్రస్తుతం దత్ జైలులో ఉన్నందున అతని భార్య మాన్యత దీనికి సంబంధించిన డీల్‌ను మాట్లాడినట్లు సమాచారం. ‘మా కుటుంబంలో అందరికీ క్రీడల పట్ల ఆసక్తి ఉంది. ముఖ్యంగా సంజయ్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఎక్కువ’ అని మాన్యత చెప్పారు. దత్ బయటకు వచ్చేవరకూ ఓ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ జట్టుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అలాగే ధోని స్నేహితుడు అరుణ్ పాండే కూడా ఓ జట్టులో వాటా కొనుక్కుం టున్నట్లు సమాచారం. వచ్చే జనవరిలో జరిగే ఈ లీగ్‌లో సెహ్వాగ్, లారా, కలిస్ తదితర మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. -
మాజీలతో మరో లీగ్
దుబాయ్: ఓవైపు సచిన్, వార్న్ కలిసి లెజెండ్స్ టి20 లీగ్ ప్రారంభిస్తుంటే... మరోవైపు దుబాయ్‌లో మాజీ క్రికెటర్లతో మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) పేరుతో మరో లీగ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ క్రికెట్ బోర్డు అనుమతితో జరగనున్న ఈ లీగ్ 2016 ఫిబ్రవరిలో మొదలవుతుంది. మొత్తం 90 మంది మాజీ క్రికెటర్లతో ఆరు జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. లారా, వసీం అక్రమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ఇందులో ఆడతారు. జీఎం స్పోర్ట్స్ అనే సంస్థ పదేళ్ల పాటు ఈ లీగ్ నిర్వహణకు అనుమతి తీసుకుంది. డీన్‌జోన్స్ దీనిని పర్యవేక్షిస్తారు.