putlur
-
బాధను దిగమింగి.. చెల్లిని నిద్రపుచ్చుతూ
సాక్షి, పుట్లూరు : అమ్మ ప్రేమ కమ్మనిది.. నాన్న ప్రేమ చల్లనిది.. రెండూ కలగలిస్తే అన్న. ప్రమాదం జరిగి ఒంటిపై గాయాలు బాధ కలిగిస్తున్నా జ్వరంతో బాధపడుతున్న చెల్లిని అన్న తన ఒడిలో నిద్రపుచ్చుతున్న దృశ్యమిది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని ఎ.కొండాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వేగంగా వస్తున్న ఆటో బోల్తాకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరలక్ష్మి కుమారుడు మోహిత్‌రాం (3) అనే బాలుడు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తెకు జ్వరం వస్తుండటంతో చికిత్స చేయించేందుకు వెళ్తున్న కర్నూలు జిల్లా తుమ్మలపెంట గ్రామానికి చెందిన సతీష్‌కుమార్, మహిత, వీరి కుమారుడు వంశీకృష్ణకు తీవ్రంగా గాయాలయ్యాయి. కుమార్తెకు ప్రమాదం తప్పింది. అయితే, తల్లిదండ్రులిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నప్పుడు చిన్నారికి తొమ్మిదేళ్ల అన్న తన గాయాల బాధను భరిస్తూనే అన్నీ తానై సపర్యలు చేశాడు. తర్వాత తల్లికి చికిత్స చేస్తున్న బెడ్ పక్కనే తన ఒడిలో చెల్లిని నిద్రపుచ్చుతున్న దృశ్యాలు ఆసుపత్రుకి వచ్చిన వారి హృదయాలను కదిలించాయి. -
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బూతుపురాణం
సాక్షి, అనంతపురం : ఈ సారి ఎన్నికల్లో తనయుడు పవన్‌కుమార్ రెడ్డిని పోటీలో దింపిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రచారంలో హామీలు గుప్పించడమే కాదు.. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారు. ఆదివారం తాగునీటి సమస్యపై ఓ సామాన్యుడు ప్రశ్నించగా.. అసహనంతో రగిలిపోయారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కార్యకర్తలతో దాడి చేయించారు. ఆదివారం జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ శింగనమల అభ్యర్థి శ్రావణశ్రీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్లూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పుట్లూరులో తమకు ఎప్పుడూ మెజార్టీ రాలేదన్నారు. తమకు మెజార్టీ ఇస్తేనే చెరువులకు నీరు నింపుతామని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే యామినీబాల అవినీతికి పాల్పడిందని, అందుకే కొత్త అభ్యర్థిని తెచ్చామన్నారు. సభ చివర్లో.. సార్..మా గ్రామంలో తాగేందుకు నీళ్లు లేవు అని వడ్డెర కాలనీకి చెందిన వెంకటనారాయణ ఎంపీ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీంతో ఎంపీ దివాకర్‌రెడ్డి అతన్ని అసభ్య పదజాలంతో దుషించారు. ‘తాగి వచ్చి మాట్లాడుతున్నావ్.. నీకు ఎవరు తాపి పంపారు’ అని మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వెంకటనారాయణపై మూకుమ్మడి దాడికి పాల్పడగా తీవ్రంగా గాయపడ్డాడు. ఓటమి భయంతోనే జేసీ బెదిరింపులు : రాఘవరెడ్డి నీటి సమస్యలపై ప్రశ్నించిన వెంకటనారాయణపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేత రాఘవరెడ్డి ఖండించారు. ఓటర్లను బెదిరించడం తగదన్నారు. మహిళల సమక్షంలో వెంకటనారాయణను బూతులు తిట్టడం దారుణమన్నారు. జేసీ సభ్యతా-సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే జేసీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఓటర్లను బెదిరించిన జేసీ దివాకర్‌పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గోమాతకు సీమంతం
పుట్లూరు : పర్వదినాలతోపాటు, ప్రతి నిత్యం గోమాతను పూజిస్తారు. ఈ క్రమంలోనే పుట్లూరు మండలంల కేంద్రంలో బుధవారం రాత్రి గోమాతకు సీమంతం నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు గ్రామస్తులు. ముక్కోటి దేవతలు కొలువుదీరిన గోవుకు సీమంతం చేయడంతో గ్రామానికి, భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్పారు. దీంతో ఆవు యజమాని రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆవుకు ప్రత్యేక అలంకరణగావించారు. చీరె, పసుపు కుంకుమలు పెట్టి, మహిళలు సీమంతపు పాటలు పాడారు. కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒంగోలు జాతికి చెందిన ఈ ఆవు గతంలో అందాల పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు గెలుచుకుంది. -
విత్తనం.. రణం
పప్పుశనగ పంపిణీ అస్తవ్యస్తం పుట్లూరులో రైతుల ధర్నా.. స్పృహ తప్పిన మహిళలు తాడిపత్రి, విడపనకల్లులోనూ రోడ్డెక్కిన వైనం అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.27 మండలాల్లో పంపిణీ అని చెబుతున్నా.. రోజుకు ఐదారు మండలాల్లో కూడా సాఫీగా సాగడం లేదు. సర్వర్లు పనిచేయక, బయోమెట్రిక్ మిషన్ల మొరాయింపు, కౌంటర్లు తగ్గించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. తోపులాట చోటుచేసుకుంటోంది. అదనంగా విత్తనం ఇవ్వాలంటూ కొన్ని మండలాల్లో రోడ్డెక్కుతున్నారు. దీనికితోడు దళారులు, వ్యాపారుల రంగ ప్రవేశంతో విత్తనం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. సోమవారం ఐదారు మండలాల్లో పంపిణీ చేశారు. సర్వర్ పనిచేయకపోవడంతో ఉదయం 10 తర్వాత కాని పంపిణీ మొదలు కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి విత్తనం ఇవ్వలేదంటూ పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు పుట్లూరు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్దఎత్తున రైతులు తరలిరావడంతో పంపిణీ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మండే ఎండలోనే ధర్నా కొనసాగించడంతో ముగ్గురు మహిళా రైతులు స్పృహతప్పి పడిపోయారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. రైతులు బారులు తీరినా ఒకట్రెండు కౌంటర్ల ద్వారా ఇస్తుండటంతో తాడిపత్రి కేంద్రంలో ధర్నాకు దిగారు. పంపిణీ ఆపేయడంతో యాడికిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మూడు రోజులైనా పంపిణీ కేంద్రాలు తెరవలేదని విడపనకల్లు రైతులు రోడ్డెక్కారు. బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో ఉరవకొండలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మండలాల్లో విత్తనం కావాలని రైతుల నుంచి డిమాండ్లు వస్తున్నా అందించలేని స్థితిలో వ్యవసాయశాఖ ఉంది. ఏ రోజు ఏ మండలాల్లో ఏ గ్రామ రైతులకు పంపిణీ చేస్తున్నారో అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ అంటున్నా దళారులు, వ్యాపారులు రైతులను మభ్యపెట్టి ఒక్కో బస్తాకు రూ.300 నుంచి రూ.400 చెల్లిస్తూ విత్తనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిఘా పెట్టామని అధికారులు చెబుతున్నా.. అదుపు చేయలేని పరిస్థితి ఉంది. 55,492 క్వింటాళ్లు పంపిణీ ఇప్పటివరకు 27 మండలాల పరిధిలో 54,813 మంది రైతులకు 55,942 క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. జిల్లాకు మొదటి విడతగా కేటాయించిన 50 వేల క్వింటాళ్లు ఇప్పటికే పంపిణీ చేయగా.. అదనంగా 10 వేల క్వింటాళ్లు తెప్పించామన్నారు. ఇప్పుడు మరో 10 వేల క్వింటాళ్లు తెప్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిమాండ్ ఉన్న మండలాల్లో మరో రెండు, మూడు రోజులు పంపిణీ చేస్తామని తెలిపారు. -
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
పుట్లూరు (అనంతపురం) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి గల్లంతయ్యాడు. తాడిపత్రి పట్టణానికి చెందిన సయీద్(22) అనే యువకుడు ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి పుట్లూరులోని సుబ్బరాయసాగర్‌లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితులంతా కలిసి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులతో పాటు స్థానికులు గాలింపుచర్యలు చేస్తున్నారు. -
విద్యార్థిని ప్రసవం.. అదుపులో ఐదుగురు
పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిని తల్లిని చేసిన కేసులో పోలీసులు గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. పదో తరగతి చదివే ఓ విద్యార్థిని గత నెల 28న ఓ శిశువును ప్రసవించిన విషయం తెలిసిందే. తనపై కొందరు అత్యాచారం చేసినట్టు బాధిత విద్యార్థిని విచారణలో తెలపడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
విద్యుత్ షాక్ తో రైతుకు తీవ్రగాయాలు
పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలు.. ప్రసాద్ అనే రైతు ట్రాన్స్ఫారం నుంచి తన పొలానికి లైన్ల మరమ్మతుల కోసం విద్యుత్ ప్రసారం నిలిపివేసేందుకు అధికారుల అనుమతి తీసుకున్నాడు. మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి రైతులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని సిబ్బంది తీరుపై మండిపడ్డారు.