విత్తనం.. రణం
విత్తనం.. రణం
Published Tue, Oct 18 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
పప్పుశనగ పంపిణీ అస్తవ్యస్తం
పుట్లూరులో రైతుల ధర్నా.. స్పృహ తప్పిన మహిళలు
తాడిపత్రి, విడపనకల్లులోనూ రోడ్డెక్కిన వైనం
అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.27 మండలాల్లో పంపిణీ అని చెబుతున్నా.. రోజుకు ఐదారు మండలాల్లో కూడా సాఫీగా సాగడం లేదు. సర్వర్లు పనిచేయక, బయోమెట్రిక్ మిషన్ల మొరాయింపు, కౌంటర్లు తగ్గించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. తోపులాట చోటుచేసుకుంటోంది. అదనంగా విత్తనం ఇవ్వాలంటూ కొన్ని మండలాల్లో రోడ్డెక్కుతున్నారు. దీనికితోడు దళారులు, వ్యాపారుల రంగ ప్రవేశంతో విత్తనం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. సోమవారం ఐదారు మండలాల్లో పంపిణీ చేశారు. సర్వర్ పనిచేయకపోవడంతో ఉదయం 10 తర్వాత కాని పంపిణీ మొదలు కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి విత్తనం ఇవ్వలేదంటూ పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు పుట్లూరు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్దఎత్తున రైతులు తరలిరావడంతో పంపిణీ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మండే ఎండలోనే ధర్నా కొనసాగించడంతో ముగ్గురు మహిళా రైతులు స్పృహతప్పి పడిపోయారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. రైతులు బారులు తీరినా ఒకట్రెండు కౌంటర్ల ద్వారా ఇస్తుండటంతో తాడిపత్రి కేంద్రంలో ధర్నాకు దిగారు. పంపిణీ ఆపేయడంతో యాడికిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మూడు రోజులైనా పంపిణీ కేంద్రాలు తెరవలేదని విడపనకల్లు రైతులు రోడ్డెక్కారు. బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో ఉరవకొండలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మండలాల్లో విత్తనం కావాలని రైతుల నుంచి డిమాండ్లు వస్తున్నా అందించలేని స్థితిలో వ్యవసాయశాఖ ఉంది. ఏ రోజు ఏ మండలాల్లో ఏ గ్రామ రైతులకు పంపిణీ చేస్తున్నారో అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ అంటున్నా దళారులు, వ్యాపారులు రైతులను మభ్యపెట్టి ఒక్కో బస్తాకు రూ.300 నుంచి రూ.400 చెల్లిస్తూ విత్తనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిఘా పెట్టామని అధికారులు చెబుతున్నా.. అదుపు చేయలేని పరిస్థితి ఉంది.
55,492 క్వింటాళ్లు పంపిణీ
ఇప్పటివరకు 27 మండలాల పరిధిలో 54,813 మంది రైతులకు 55,942 క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. జిల్లాకు మొదటి విడతగా కేటాయించిన 50 వేల క్వింటాళ్లు ఇప్పటికే పంపిణీ చేయగా.. అదనంగా 10 వేల క్వింటాళ్లు తెప్పించామన్నారు. ఇప్పుడు మరో 10 వేల క్వింటాళ్లు తెప్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిమాండ్ ఉన్న మండలాల్లో మరో రెండు, మూడు రోజులు పంపిణీ చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement