U Mumbai
-
ఎదురులేని దబంగ్ ఢిల్లీ
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–7)లో దబంగ్ ఢిల్లీ వరుస విజయాలతో టాప్‌లోకి దూసుకొచి్చంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 40–24తో యు ముంబాను చిత్తు చేసింది. ఢిల్లీ తరఫున రైడర్ నవీన్ 11 పాయింట్లతో అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 9 సార్లు పాయింట్లు తెచి్చపెట్టాడు. డిఫెండర్లలో రవీందర్ (8) ప్రత్యర్థి రైడర్లను హడలెత్తించాడు. ఒక్కసారి విఫలమవకుండా ఎనిమిది మందిని విజయవంతంగా టాకిల్ చేశాడు. మిగతా వారిలో జోగిందర్ నర్వాల్ (6), చంద్రన్ రంజీత్ (4), బలరామ్ (2) రాణించారు. యు ముంబా జట్టులో అర్జున్ దేశ్వాల్ (7) రైడింగ్‌లో ఆకట్టుకోగా... డిఫెండర్ సందీప్ నర్వాల్ 6 పాయింట్లు చేశాడు. తొలి అర్ధభాగంలో 14–11 స్కోరుతో కేవలం 3 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్న దబంగ్ ఢిల్లీ ద్వితీయార్ధంలో చెలరేగి ఆడింది. పది మ్యాచ్‌లాడిన ఢిల్లీకిది ఎనిమిదో విజయం. కేవలం ఒకే మ్యాచ్ ఓడిన దబంగ్ జట్టు మరో మ్యాచ్‌ను టైగా ముగించింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–25తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడుతుంది. -
యు ముంబా జోరు
న్యూఢిల్లీ: రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా పన్నెండో విజయం నమోదు చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 41–34తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 13–22తో వెనుకంజలో ఉన్న యు ముంబా ఆ తర్వాత చెలరేగింది. సిద్ధార్థ్ (19 పాయింట్లు) రైడింగ్‌లో విజృంభించడంతో క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లి అలవోకగా గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 12 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. జోన్ ‘ఎ’లో 17 మ్యాచ్‌లు ఆడిన యు ముంబా 67 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జోన్ ‘బి’లో 58 పాయింట్లతో బెంగళూరు టాప్‌లో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో యు ముంబా, పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. -
యు ముంబా ప్రతీకార విజయం
ముంబై: కెప్టెన్ అనూప్ కుమార్ (11) రైడింగ్, ట్యాక్లింగ్‌లో చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా కీలక విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 34-31తో పుణెరి పల్టన్‌పై నెగ్గింది. దీంతో టోర్నీ ఆరంభంలో పుణెరి చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. కీలక ఆటగాడు మంజిత్ చిల్లర్ లేకుండా బరిలోకి దిగిన పల్టన్ రైడింగ్‌లో విఫలమైంది. సుర్జీత్ (5), జీవా (2), రిషాంక్ (5), రాకేశ్ (4)లు డిఫెన్స్‌లో ఆకట్టుకున్నారు. పుణేరి తరఫున అజయ్ (9), దీపక్ (7), సోమ్‌వీర్ (4)లు రాణించారు. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబాంగ్ ఢిల్లీ; యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. మహిళల కబడ్డీ చాలెంజ్ లీగ్‌లో స్టోర్మ్ క్వీన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో స్టోర్మ్ క్వీన్స్ 21-11తో ఫైర్ బర్డ్స్‌పై గెలిచింది. ఈనెల 25న ఫైర్ బర్డ్స్, ఐస్ దివాస్ల మధ్య క్వాలిఫయర్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఈనెల 31న జరిగే ఫైనల్లో స్టోర్మ్ క్వీన్స్‌తో ఆడుతుంది. -
తెలుగు టైటాన్స్‌కు ఐదో స్థానం
* చివరి మ్యాచ్‌లో యు ముంబా చేతిలో ఓటమి * ప్రొ కబడ్డీ లీగ్ సెమీస్‌లో బెంగాల్, పుణేరి ముంబై: గతేడాది మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-3లో తమ పోరాటాన్ని పరాజయంతో ముగించింది. డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 22-38 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్లో టైటాన్స్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 38 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్తి పడింది. టైటాన్స్ ఓటమితో మరోవైపు బెంగాల్ వారియర్స్, పుణేరి పల్టన్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇప్పటికే పట్నా పైరేట్స్, యు ముంబా జట్లు కూడా సెమీస్‌కు చేరాయి. ముంబాతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు మరోసారి నిరాశపరిచింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ మినహా మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. రాహుల్ చౌదరీ ఒక్కడే 12 పాయింట్లు సంపాదించాడు. మరోవైపు జోరుమీదున్న ముంబా జట్టు ఆరంభం నుంచే నిలకడగా పాయింట్లు సాధించింది. విరామ సమయానికి ముంబా 18-10 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ అనూప్ కుమార్‌తోపాటు రిషాంక్, మోహిత్ చిల్లర్ రైడింగ్‌లో ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 26-22తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. -
యు ముంబా విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 30-17 స్కోరుతో ఘన విజయం సాధించింది. ముంబై తరఫున రిశాంక్ ఎనిమిది, కెప్టెన్ అనూప్ కుమార్ ఆరు పాయింట్లతో రాణించారు. ఢిల్లీ జట్టులో స్టార్ ఆటగాడు కాశీలింగ్ సహా అందరూ విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో ఆతిథ్య బెంగళూరు బుల్స్ జట్టు 36-26 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. -
‘హోరాహోరీ’ ఆరంభం
ఉత్కంఠ పోరులో ఓడిన తెలుగు టైటాన్స్ సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్ మూడో సీజన్‌కు ఘనమైన ఆరంభం లభించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ పోరాడి ఓడింది. రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 27-25తో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. ఆరంభంలో ఇరు జట్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీ తలపడ్డాయి. అయితే ముంబా జట్టు తొలి అర్ధభాగంలో 12-8తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ఆరంభంలో ముంబా జోరు పెంచడంతో ఆ జట్టు ఒక దశలో 22-10 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సుఖేశ్ హెగ్డే చకచకా పాయింట్లు తేవడం, రాహుల్ చౌదరి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడటంతో... చివరి క్షణాల్లో తెలుగు జట్టు ముంబాకు చేరువయింది. 27-24 ఆధిక్యంలో ఉన్న దశలో ముంబా జట్టు కొంత సమయం వృథా చేయడంతో పాటు పాయింట్లు ఇవ్వకుండా తెలివిగా ఆడి మ్యాచ్ చేజారకుండా చూసుకుంది. సుఖేశ్ హెగ్డే 9 పాయింట్లు సాధించగా... రాహుల్ 6 పాయింట్లు తెచ్చాడు. డిఫెన్స్‌లో రాణించిన ధర్మరాజ్ 4 పాయింట్లు సాధించాడు. ముంబై తరఫున కెప్టెన్ అనూప్ 6 పాయింట్లు సాధించాడు. రిశాంక్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-29తో దబాంగ్ ఢిల్లీపై నెగ్గింది. మ్యాచ్ ఆరంభానికి ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ఖాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి మ్యాచ్ మొత్తం వీక్షించారు. మధ్యలో సరదాగా తొడగొట్టారు. తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ దగ్గుబాటి రానా సందడి చేయగా... మ్యాచ్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. -
ఎదురులేని యు ముంబా
పుణే : ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినప్పటికీ.. ఆద్యంతం దూకుడుగా ఆడిన యు ముంబా జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2లో 12వ విజయాన్ని సాధించింది. పుణేరి పల్టన్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 39-34 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే ఓడిన యు ముంబా ఈ మ్యాచ్‌లో అనూప్ కుమార్, షబీర్ బాపు, రిశాంక్, మోహిత్ చిల్లార్లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. రిజర్వ్‌లో ఉన్న ఆటగాళ్లను బరిలోకి దించింది. తొలి అర్ధభాగంలో ముంబాకు గట్టిపోటీనిచ్చిన పుణేరి స్కోరును 13-13తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో ముంబా ఆటగాళ్లు జోరు పెంచారు. పవన్ కుమార్ రైడింగ్‌లో విజృంభించి నిలకడగా పాయింట్లు సాధించడంతో ముంబా జట్టు 36-23తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పుణేరి తేరుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. ప్రస్తుతం యు ముంబా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 45 పాయింట్లతో తెలుగు టైటాన్స్ రెండో స్థానంలో, 43 పాయింట్లతో బెంగళూరు బుల్స్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
యు ముంబా జోరు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 31-17 తేడాతో నెగ్గింది. దీంతో 45 పాయింట్లతో తిరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసి 16 రైడ్ పాయింట్లు అందుకుంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడిన ముంబా జట్టు ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు 45-26తో పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో ఢిల్లీ తలపడుతుంది.