urban development
-
పేదింటికి కేంద్రం చేయూత రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచటంతో చాలా గ్రామాలు ‘పట్టణ పరిధి’లోకి చేరటంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపు కానుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలుగా ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మూడొంతులకు పైగా గ్రామ పంచాయతీలు పట్టణాభివృద్ధి సంస్థల జాబితాలోకి వెళ్లాయి. గతంలో 9 పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా, వాటి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 28కు పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరనున్నాయి. దీంతో వీటికి పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందుతాయి. రెండో దశలోనూ పాత యూనిట్ కాస్ట్లే..చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర ఖజానాపై అతిపెద్ద భారం మోపనుంది. పీఎంఏవై పథకం మొదటి దశ కాలపరిమితి తీరిపోవటంతో, కేంద్రం రెండో దశకు శ్రీకారం చుడుతోంది.ఇందులో పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.2.25 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా, గతంలో ఉన్న రూ.1.5 లక్షలే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ కూడా రూ.72 వేలుగానే ఉంది. గ్రామీణ యూనిట్లకు పట్టణ కాస్ట్ దక్కేలా..కేంద్రం నుంచి గ్రామీణ యూనిట్ కాస్ట్ రూ.72 వేలు మాత్రమే అందితే, ఆ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కొంతైనా ఊరట దక్కేలా వ్యూహరచన చేసిన ప్రభుత్వం.. సింహ భాగం గ్రామాలకు పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ (రూ.1.5 లక్షలు) దక్కేలా పట్ణణాభివృద్ధి సంస్థల సంఖ్యను పెంచేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు ‘పట్టణ’ పరిధిలోకి రానున్నాయి. తద్వారా వాటికి ‘పట్టణ’ యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం గృహనిర్మాణ పథకానికే పరిమితం కాకుండా, కొన్ని ఇతర పథకాలకు కూడా లబ్ధి చేకూర్చనుండటం గమనార్హం.సాయంపై స్పష్టతకు మరింత సమయంరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికే రాష్ట్రంలో పథకాల ప్రకటన జరిగిపోయింది. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం పథకాలను సమీక్షించుకుంటూ మార్పు చేర్పులు చేసేసరికి మరింత ఆలస్యం అయింది. ఫలితంగా కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందో రాష్ట్రానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా పట్టణాభివృద్ధి సంస్థల పెంపు నేపథ్యంలో, ఎన్ని పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.అంటే తాజా నిర్ణయం మేరకు పట్టణ ప్రాంత ఇళ్ల సంఖ్యను తేల్చాల్సి ఉంది. ఆ మేరకు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి వివరాలు క్రోడీకరించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఎన్ని యూనిట్లను మంజూరు చేస్తుందో ఆ తర్వాతే తేలుతుంది. అప్పుడే కేంద్రం నుంచి వచ్చే సాయంపై స్పష్టత వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఆ సాయం భారీగా పెరుగుతుందని మాత్రం తేలిపోయింది. -
కొత్తగా 13 జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 13 పట్టణాభివృద్ధి సంస్థలు (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)లకు తోడు వనపర్తి, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి, కాగజ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రోడ్ నెట్వర్క్, తాగునీరు, ఉపాధి అవకాశాలు, శాటిలైట్ టౌన్íÙప్ల అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను ఈ యూడీఏల పరిధిలోకి తీసుకువచ్చారు. వీటితోపాటు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, స్తంభాద్రి (ఖమ్మం), మహబూబ్‌నగర్, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని పెంచారు. ఈ మేరకు ఆయా యూడీఏల పరిధిలోనికి వచ్చే మున్సిపాలిటీలు, గ్రామాలను ఈ ఉత్తర్వుల్లో నోటిఫై చేశారు. -
‘ప్రగతి’ బాటలో పొదుపు మహిళ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్‌ను సదస్సులో పంచుకున్నారు. వ్యాపారం చేసుకుంటున్నాం గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది. – పి.కృష్ణకుమారి, నరసరావుపేట మహిళలకు అండగా సీఎం మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి ఆహా క్యాంటీన్‌తో ఉపాధి గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం గత ప్రభుత్వంలో మోసపోయాం ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట ప్రతి రూపాయీ మాకే.. గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ మహిళా సాధికారతే లక్ష్యం మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలు ఇవీ.. ► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేయాలి. ► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. ► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. ► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. ► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. ► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. ► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. -
పట్టణాభివృద్ధికి నిధులివ్వండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పట్ట ణాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్తోపా టు ఇతర మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు లేదా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని ఆదివారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను గుర్తుచేశారు. టీఎస్ బీ పాస్, మున్సి పాలిటీల సంఖ్య పెంపు, పచ్చదనం పెంపునకు 10% బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ వంటి ప్రాజెక్టులను గుర్తుచేశారు. మెర్సర్ క్వాలిటీ ఇండెక్స్‌లో వరుసగా ఆరోసారి హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలిచిందని, వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు లభించింద న్నారు. దేశ గౌరవ, ప్రతిష్టలను విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అయిన నేపథ్యంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల మేర నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపి, ఆర్థికంగా మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్‌లో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టంకు ఖర్చయ్యే రూ.3,050 కోట్లలో 15% మూలధన పెట్టుబడిగా రూ.450 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లోని రూ.254 కోట్లు విడుదల చేయాలి. హైదరాబాద్‌సహా ఇతర మున్సిపాలిటీల్లో రూ.3,777 కోట్లు ఖర్చయ్యే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం కనీసం 20 శాతం అంటే రూ.750 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్‌లో ఎస్టీపీలు, మురుగునీటి సరఫరా నెట్‌వర్క్‌కు ఖర్చయ్యే రూ.8,684 కోట్లలో మూడోవంతును కేంద్రం భరించాలి. ఎస్ఎన్డీపీకి రూ.240 కోట్లు కేటాయించాలి. హైదరాబాద్‌లో పారిశుధ్యం మెరుగు కోసం రూ.400 కోట్ల మేర స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులివ్వాలి. ఎస్ఆర్డీపీ రెండోదశ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, స్కైవేలు తదితరాలకు రూ.3,450 కోట్లు ఇవ్వాలి. హైదరాబాద్‌లో 104 లింకు రోడ్ల వ్యయంలో మూడోవంతు అనగా రూ.800 కోట్లు కేంద్రం భ రించాలి. జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లు కేటాయించాలి. తెలంగాణ శానిటేషన్ హబ్‌కు రూ.100 కోట్లు సీడ్ ఫండింగ్ ఇవ్వడంతోపాటు జీహెచ్ఎంసీ మూడో విడత మున్సిపల్ బాండ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. -
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్ అధికారులు నవంబర్ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు. సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్‌తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఆర్ఎస్ఆర్, టీఎస్ఆర్, కేఎంఎల్ ఫైల్స్ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. -
AP: జగనన్న హరిత నగరాలకు శ్రీకారం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ‘జగనన్న హరిత నగరాలు’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. పచ్చదనం పెంపుతో పాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టి.. ఉత్తమ విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు ‘గ్రీన్ సిటీ చాలెంజ్’ కింద రూ.కోటి చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ సంస్థలు చేపట్టాయి. రూ.78.84 కోట్లతో పచ్చందం.. మొదటి విడతలో ఉన్న 45 యూఎల్బీల్లోని రోడ్లకు ఇరువైపులా, మధ్యనున్న మీడియన్స్‌లలో మొక్కలు నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. రహదారి వెడల్పును బట్టి ఐదు రకాలుగా విభజించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనం, సుందరీకరణ పనులకు రూ.78.84 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలకరి ప్రారంభం నుంచి ఆగస్టు 12లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆయా మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటిన అనంతరం పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు అప్పగిస్తారు. అనంతరం ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం 3 నెలలకు ఒకసారి పరిశీలించి.. మొక్కల సంరక్షణకు అవసరమైన సూచనలిస్తుంటుంది. సీఎం పర్యటన సాగిందిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి.. గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని సభావేదికకు చేరుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం పల్నాడు జిల్లా కొండవీడుకు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. -
తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, షామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. ► నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థ్ధిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటు కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేయవద్దు. -
రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్.. ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంకా.. ► లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ► లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. ► న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు. ► శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ : ► తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ► ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి. ► ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు. ► మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు. ► 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. ► 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ► గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు: ► ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. ► దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ► ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. టిడ్కో ఇళ్లపై సమీక్ష: ► గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. ► పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ► మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. ► టిడ్కో ఇళ్ల మీద సుమారుగా.. రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం. రోడ్లపై దృష్టి: ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ► ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. ► నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్ చేయాలి. ► జూన్‌నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష: ► కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు. ► ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ► సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష: ► విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. ► సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు. ► మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ► ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం. ► పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన. జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష: ► మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్లు. ► ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్లను వివరించిన అధికారులు. ► విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్. చదవండి: వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే -
పట్టణ సేవలకు ఏడీబీ రూ.2,625 కోట్ల రుణం
న్యూఢిల్లీ: భారత్‌లో పట్టణ సేవల పురోగతికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 350 మిలియన్ డాలర్ల (రూ.2,625 కోట్లు)ను రుణంగా ఇవ్వనుంది. మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వాలు సంస్కరణలను చేపట్టడంతోపాటు.. పనితీరు ఆధారితంగా పట్టణ పాలకమండళ్లకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ కార్యక్రమం అమలు విషయంలో ఏడీబీ సలహా, మద్దతు సేవలను అందించనుంది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి సోమవారం సంతకాలు చేశారు. విధాపరమైన సంస్కరణలను అమలు చేయడంలో, పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి పట్టణ పాలక మండళ్లకు ఏడీబీ తన సేవలను అందిస్తుంది. వాతావరణం మార్పులు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలను కూడా సూచిస్తుందని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలియజేసింది. అసోంలో నైపుణ్య యూనివర్సిటీకి సాయం అసోంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఏడీబీ మరో 112 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వనుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీ ఏర్పాటు మార్గం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏడీబీతో ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. -
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్
-
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపైనా కూడా సీఎం సమీక్షించారు. క్లాప్ కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలందించారు. మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని.. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం తెలిపారు. కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ►గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశాలు ►దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందన్న సీఎం ►ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయి: ►దీంతోపాటు.. ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుంది ►దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్న సీఎం ►అర్హులైన పేదలందరికీ కూడా 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్న సీఎం ►పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులతో పాటు, ఇతరులమీదో, ఇతర మార్గాలమీద ఆధారపడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చామన్న సీఎం ►అలాగే ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదనే భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం ►దీంతో పాటు, 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్న సీఎం ►దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం ►అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని మనం సృష్టించాం: ►ఇకపై అక్రమ ప్రాంతాల్లో, ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం ►పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే 90 రోజుల్లోగా వెంటనే ఇంటిపట్టాను మంజూరుచేసే కార్యక్రమం చేస్తున్నాం: విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష ►బీచ్‌కారిడార్, మల్టీలెవర్ కార్‌పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మరియు మ్యూజియం, బీచ్ కారిడార్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష ►టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష ►నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కోఇళ్లు పూర్తికావాలన్న సీఎం ►అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ►మొదటివిడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలో 85,888 ఇళ్లలో సుమారు 45వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగిలిన ఇళ్లు డిసెంబర్‌లోగా అప్పగిస్తామన్న అధికారులు ►లబ్ధిదారులకు ఇళ్లుఅప్పగించేటప్పుడు పూర్తిగా అన్నిరకాల వసతులతో ఇవ్వాలన్న సీఎం ► మౌలికసదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్న సీఎం వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం సమీక్ష ►విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం ►గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచిపెట్టారని సమావేశంలో ప్రస్తావన ►మూడు ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సిఫార్సులు ►లేకపోతే నదులు కలుషితం అవుతున్నాయని ఆందోళన ►ఈ నేపథ్యంలో మూడు చోట్ల వెంటనే ట్రీట్ మెంట్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ►మంగళగిరి – తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా మహిళా మార్ట్ ►మహిళా మార్ట్ నిర్వహణపై సీఎం అభినందనలు ►మహిళా సంఘాల సహాయంతో మార్ట్ నిర్వహణ బాగుందన్న సీఎం ►మార్ట్‌లో మహిళలను భాగస్వాములుగా చేయడం బాగుందన్న సీఎం ►తక్కువ ధరలకూ వారికి అందుబాటులో సరుకులు అందడం బాగుందన్న సీఎం ►ఒక్కో మహిళ నుంచి రూ.150ల చొప్పున 8వేలమంది మహిళా సంఘాల సభ్యులనుంచి సేకరించి, ఆ డబ్బుతో మార్టు పెట్టామన్న అధికారులు ►మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందన్న అధికారులు ►మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్‌లో ఉంచామన్న అధికారులు ►మార్ట్ నిర్వహణ పనితీరుపై నిశిత పరిశీలన చేసి.. మిగతాచోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏఎంఆర్డీఏ కమిషనర్ పి లక్ష్మీ నరసింహం, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వి రామ మనోహరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం ఎం నాయక్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
Jagananna Smart Town Scheme: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ – మిడిల్ ఇన్‌కం గ్రూప్ లేఔట్లు) నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ప్లాట్లకు ఉన్న డిమాండ్‌ను తెలుసుకోవడం కోసం నిర్వహించిన ప్రాథమిక సర్వేకు అపూర్వ స్పందన లభించింది. ఈ పథకం కింద ప్లాట్ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఔట్లను ప్రభుత్వం లబ్ధిదారులను సరసమైన ధరలకు అందించనుంది. లేఔట్లకు భూసేకరణ, ప్లాట్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక.. ఇలా ప్రతి దశలో పారదర్శకతతో వ్యవహరిస్తుంది. జిల్లా స్థాయి కమిటీల నుంచి వచ్చిన స్థలాల వివరాలు, లేఔట్ల ఏర్పాటు, ఇతర ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రూటినీ చేసి ఆమోదిస్తుంది. జిల్లాల్లో స్మార్ట్ టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం, ప్లాట్లను నిర్మించడం జిల్లా కమిటీల బాధ్యత అని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో లేఔట్లు ► డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్లు. ► లేఔట్లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు. ► అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పన. ► నగరాలు, పట్టణాల్లోని మార్కెట్ విలువ, లేఔట్‌కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది. ► అనంతరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు అందితే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదిస్తుంది. ఇవీ అర్హతలు ► ఒక కుటుంబానికి ఒకే ప్లాట్ ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలి. ► 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ► లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలి. ► ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్లాట్ల కేటాయింపు ఇలా.. ► డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) రూపొందించిన వెబ్సైట్లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► ప్లాట్ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ► లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. చెల్లింపులు ఇలా.. ► ప్లాట్ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలి. ► అగ్రిమెంట్ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాలి. ఒక నెలలోపు ప్లాట్ అమ్మకం మొత్తాన్ని చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తారు. వాయిదా చెల్లించడంలో ఆలస్యం అయితే 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. -
పట్టణాభివృద్ధిలో భారత్‌కు జపాన్ చేయూత
న్యూఢిల్లీ: పట్టణాభివృద్ధిలో జపాన్ సహకారం పొందేందుకు భారత్ ముందడుగు వేసింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకునేందుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధికార ప్రకటన ప్రకారం భారత్ తరఫున గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే జపాన్ తరఫున భూ, మౌలిక, రవాణా, పర్యాటక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఎంఓసీపై సంతకాలు చేయనున్నారు. నిజానికి పట్టణాభివృద్ధికి సంబంధించి రెండు దేశాలూ 2007లో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీని స్థానంలో తాజాగా ఎంఓసీ రానుంది. ఉపాధి కల్పనకూ అవకాశాలు అర్బన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, చౌక ధరల గృహ నిర్మాణం, పట్టణ వరద నివారణా నిర్వహణ, పారిశుధ్యం, వేస్ట్ వాటర్ నిర్వహణ, పట్టణ రవాణా, విపత్తు నిర్వహణ వంటి కీలక అంశాలపై రెండు దేశాలూ మున్ముందు సహకరించుకోనున్నాయి. ఇందుకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టుల వల్ల యువతకు కూడా ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయి. సహకారం విషయంలో వ్యూహం, కార్యక్రమాల అమలు వంటి కార్యకలాపాలకు సంయుక్త కార్యాచరణ బృందం (జేడబ్ల్యూజీ) కూడా ఏర్పాటవుతుంది. ఏడాదికి ఒకసారి జేడబ్ల్యూజీ సమావేశమవుతుంది. ఈ సమావేశం ఒక ఏడాది భారత్‌లో జరిగితే మరో సంవత్సరం జపాన్‌లో జరుగుతుంది. ఒకసారి సంతకాలు పూర్తయిన తర్వాత ఐదేళ్లు ఎంఓసీ అమల్లో ఉంటుంది. కాగా, పట్టణాభివృద్ధికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవులతో జరిగిన ఎంఓయూపై కూడా క్యాబినెట్ సమీక్షించింది. -
పట్టణ ప్రగతిపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష..
సాక్షి, నల్గొండ: విద్యుత్ తీగల కింద నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణాలకు అనుమతులు రావని.. ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడే కొనుగోలు దారులు దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. ఆదివారం నల్గొండలో పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కూడా ఇలాంటి అనుమతులు లేవన్నారు. ప్రస్తుతం ఇళ్ల మీద విద్యుత్ తీగల తొలగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని వెల్లడించారు. పట్టణ ప్రగతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ తీగల తొలగింపుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
విజయవాడకు కొత్త రూపు!
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూపురేఖలు మారిపోనున్నాయి. నగరాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సిటీ స్వరూపం మార్చేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన జీఓను కూడా సర్కారు విడుదల చేసింది. ప్రధానంగా రోడ్ల అభివృద్ధితోపాటు నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. క్రీడా సౌకర్యాలు మెరుగుపర్చడం.. సీవేజి ట్రీట్మెంట్ ప్లాన్లను ఏర్పాటుచేయడం.. పార్కుల అభివృద్ధి.. మున్సిపల్ పాఠశాలల్లో సౌకర్యాలు, సీసీ రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. అలాగే, నగర వాసులను ఎంతగానో అలరిస్తున్న ఫుడ్‌కోర్టు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రహదారిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. ఇవేకాక.. మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు కూడా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. డివిజన్ల సంఖ్య పెంపు అలాగే, నగరంలోని డివిజన్ల సంఖ్య కూడా పెరగనుంది. 1981లో బెజవాడ పురపాలక సంఘం విజయవాడ నగరపాలక సంస్థగా మారింది. అప్పట్లో నగరంలో 40 డివిజన్లు ఉండేవి. ఆ తర్వాత పునరి్వభజనతో అవి 44కు పెరిగాయి. అనంతరం 59 అయ్యాయి. తాజాగా, మరోసారి డివిజన్ల పునరి్వభజన చేయాలని సర్కారు నిర్ణయించడంతో ఆ సంఖ్య 64కు చేరుకునే అవకాశం ఉంది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు నగర జనాభాకు అనుగుణంగా ఈ డివిజన్ల పునరి్వభజన జరగనుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా 13.60 లక్షలు ఉన్నా.. 2011 జనాభా (10.45 లక్షలు) లెక్కల ప్రకారమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డివిజన్ల పునరి్వభజన ముసాయిదాను సిద్ధంచేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది డివిజన్ల స్వరూప జాబితాను ప్రకటించనున్నారు. ప్రస్తుత నగర స్వరూపం ఇదీ.. -
ప్రగతిలో పట్టణాలదే ప్రముఖపాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో ప్రస్తుతం 43 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, అతి కొద్దికాలంలో ఇది 50 శాతం దాటుతుందని అన్నారు. పట్టణీకరణ, జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)లు పనిచేయాల్సి ఉందని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయడం యూడీఏల ప్రాథమిక విధి అని, ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రచురణకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అవలంభించిన విధివిధానాల అధ్యయనానికి శుక్రవారం డీటీసీపీ, పురపాలక శాఖ అధికారులతో సమావేశం కావాలని అన్నారు. స్వయం సమృద్ధే లక్ష్యం.. పట్టణాభివృద్ధి సంస్థలు స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం ల్యాండ్ పూలింగ్–అభివృద్ధి విధానం తదితర మార్గాలను అనుసరించాలన్నారు. సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకునే దిశగా పట్టణాభివృద్ధి సంస్థలు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములతో కూడిన భూనిధి వివరాలను సేకరించాలన్నారు. హెచ్ఎండీఏ వినూత్న ఆలోచనలు, విధానాలతో సమర్థవంతంగా పనిచేస్తోందని, మిగతా సంస్థలూ వీటిని అమలు చేయాలన్నారు. కొత్త పురచట్టం నేపథ్యంలో హెచ్ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుచేర్పులపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు మర్రి యాదవరెడ్డి(వరంగల్), రామకృష్ణారావు(కరీంనగర్), రవీందర్‌రెడ్డి(సిద్దిపేట), ప్రభాకర్‌రెడ్డి(నిజామాబాద్), పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్షాకాలంలో నగర ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని అధికారులకు సూచించారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని.. ఎప్పటికీ పట్టా కూడా రాదని.. చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం కలగకుండా చూడాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘ చర్చ.. నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. వీటి కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండాలని.. మురుగునీటి శుద్ధి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలని.. ఇవన్నీ ఉండేలా ప్రతి మున్సిపాలిటీకి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని.. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలన్నారు. ఏ సమస్య వచ్చినా.. వెంటనే తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా ఉండాలన్నారు. మోడల్ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై వివరాలు అడిగారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గృహాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలన్నారు. నిర్మించే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని.. తాడేపల్లి మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘ చర్చించిన సీఎం.. వారికి శాశ్వతంగా సమస్య పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు.. ఇళ్ల నిర్మాణం కింద ప్రస్తుతం ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్లు విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. బకింగ్ హాం కెనాల్ కాలుష్యం కాకుండా చూడాలని.. కాల్వ గట్లపై మొక్కలను విస్తారంగా పెంచాలన్నారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి సాధ్యమవుతాయని, మున్సిపల్ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా నియంత్రించాలన్నారు. ఏ పౌరుడు, బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. (చదవండి: అక్టోబరు 4న వైఎస్సార్ వాహన మిత్ర ప్రారంభం) -
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పట్టణాభివృద్ధిలో విశేష అనుభవం ఉన్న ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాపు ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు, రానున్న సచివాలయ వ్యవస్థను వాడుకుని పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కమిషనర్లు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పురపాలక విభాగాల్లో అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ స్కూళ్లలో విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి కుళాయిల ఏర్పాటు, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షల్లో వాస్తవాలనే అధికారులు వివరించాలని, అవాస్తవ గణాంకాలతో మభ్యపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న మున్సిపల్ నిధులతో పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ విద్యాప్రమాణాల మెరుగుకు ప్రత్యేక కార్యాచరణను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. వర్క్‌షాపులో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఎంఏలు, మెప్మా పీడీలు, ఇంజనీర్లు, మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఏపీటిడ్కో ఎండీ దివాన్, ఈఎన్సీ చంద్రయ్య, డీటీసీపీ రాముడు, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ సంపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ట్విట్టర్లో టాప్!
నగర పౌరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులకు ఉన్నత స్థాయిలోని వారూ తమ తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి. కొద్దినెలల క్రితం శేరిలింగంపల్లి జోన్లో పర్యటన సందర్భంగా మేయర్ వాహనం నో పార్కింగ్ ఏరియాలో ఆపడాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో ఉంచారు. దీంతో ఆయన చలానా చెల్లించారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కారు వేగంగా ప్రయాణం చేసినందుకు ట్రాఫిక్ విభాగం జారీ చేసిన చలాన్లు పెండింగ్‌లో ఉండటం ట్విట్టర్లో హల్చల్ సృష్టించింది. దీంతో కమిషనర్ చలానా సొమ్ము చెల్లించడంతోపాటు ఇకపై వేగంగా నడపొద్దంటూ డ్రైవర్లను హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: ఇలా వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి నగరవాసులు ట్విట్టర్‌ను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న సంస్థల్లో జీహెచ్ఎంసీ తొలి స్థానంలో ఉంది. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ–ఆఫీస్‌ను అమల్లోకి తెచ్చింది. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, బర్త్ సర్టిఫికెట్లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తోంది. ఇక ఫిర్యాదుల కోసం ‘మైజీహెచ్ఎంసీ’యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీతో పాటు మేయర్, కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాధిపతులకు సైతం ట్విట్టర్ ఖాతాలున్నాయి. జీహెచ్ఎంసీకి వివిధ మాధ్యమాలతోపాటు ట్విట్టర్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నవారు లక్ష మంది కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. తమ ఈ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ అకౌంట్‌తోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేయర్ రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల ఖాతాలకు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఫిర్యాదు ఎప్పుడు పోస్ట్ చేసిన తేదీ, సమయంతో సహా తెలుస్తుండటంతో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి.. పరిష్కరిస్తున్నారు. దేశంలోని మిగతా నగరాల కంటే జీహెచ్ఎంసీని ట్విట్టర్లో ఫాలో అవుతున్నవారే ఎక్కువ. నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చిచూసినా, జీహెచ్ఎంసీనే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. కాగా, కార్పొరేషన్ ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్నవారు 47,087 మంది ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా ట్విట్టర్‌తోపాటు జీహెచ్ఎంసీ ఫేస్బుక్, మైజీహెచ్ఎంసీ యాప్, ఈ–మెయిల్స్, ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులతోపాటు నేరుగా నాకందే వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. – దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ బెంగళూర్, పుణే తదితర నగరాల కంటే జీహెచ్ఎంసీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం అభినందనీయం. ఎక్కువ మంది సోషల్ మీడియాను వాడుతుండటమే కాక సమస్యల పరిష్కారానికి కూడా వినియోగించుకుంటున్నారు. – అరవింద్‌కుమార్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఏపీలో కొలువుల జాతర... 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది. మూడు ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా.. కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్సైట్లను సిద్ధంచేశారు. శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి వివరాలను ఆయా వెబ్సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. రెండంచెల పరీక్ష విధానం.. అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జిపై.. సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది. 9,359 లైన్మెన్ పోస్టుల భర్తీ కూడా. ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్ (లైన్మెన్) ఉద్యోగాల భర్తీకి కూడా వేరుగా నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల సంఖ్య పెంపునకు ప్రతిపాదన మొదట 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయాలని సర్కారు నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 11,158కు పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలో మొదట ప్రతిపాదించిన వాటి కన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. -
పట్టణాభివృద్ధికి రూ.55 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.55 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ మేరకు మూడేళ్ల ప్రణాళికలతో పనులు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పురపాలక శాఖ 2017–18లో సాధించిన పురోగతిపై నివేదికతో పాటు ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను బుధవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ పరిధిలో 13 శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ వాటర్ రింగ్ మెయిన్ (నీటి పైపులైను) నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారుల నిర్వహణను మూడేళ్ల పాటు కాంట్రాక్టర్లే చూసేలా త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పారు. మెట్రో రైలు, మిషన్ భగీరథ, ఎస్సార్డీపీ, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల కోసం పనులన్నీ ఏకకాలంలో జరుగుతుండటంతో రోడ్ల విషయంలో కాస్త ఇబ్బంది ఉందని, ఈ పనులు పూర్తయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రహదారులను తవ్విన సంస్థలే వాటిని పునరుద్ధరించాల్సి ఉన్నా, అనుకున్న రీతిలో జరగట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2023 నాటికి పట్టణ జనాభా 50 శాతం దాటుతుందని పేర్కొన్నారు. ఉపాధి, విద్య, మెరుగైన జీవన ప్రమాణాల కోసం జరిగే వలసలతో పట్టణీకరణ పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం సవాలుగా మారిందన్నారు. ఒక్క రోజులో సాధ్యం కాదు.. ‘విశ్వనగరం ఒక్క రోజులో కాదు.. రోమ్ నగరాన్ని కూడా ఒక్క రోజులో నిర్మించలేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దశల వారీగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పురపాలక శాఖ కృతజ్ఞత లభించని (థ్యాంక్‌లెస్) పనులు చేస్తోందని, విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. సరిగ్గా పనులు చేస్తే ప్రశంసలు రావని, ఏవైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 74 పురపాలికలుండగా, వచ్చే నెల నుంచి మరో కొత్త 68 మున్సిపాలిటీలు మనుగడలోకి వస్తాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 142కు పెరుగుతుందన్నారు. పురపాలక శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు ఈ ఏడాది చివర్లోగా మెట్రో రెండో విడత ప్రాజెక్టు డీపీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు త్వరలో తుది రూపం. 44 పురపాలికల్లో రూ.460 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయల కల్పన. టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.1,460 కోట్ల పనులకు అనుమతులు. పలు పట్టణాల్లో 52 ఆధునిక శ్మశాన వాటికల నిర్మాణం. రూ.150 కోట్లతో 3 వేల ఖాళీ స్థలాల్లో పార్కుల నిర్మాణం. పట్టణాల్లో 203 మాంసాహార, శాఖాహార మార్కెట్ల నిర్మాణం. 2013–14లో జీహెచ్ఎంసీ ఆదాయం రూ.747 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1450 కోట్లకు చేరింది. మున్సిపల్ బాండ్ల విషయంలో జీహెచ్ఎంసీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో ఏప్రిల్‌లోగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి. కొల్లూరు వద్ద 15,600 ఇళ్లతో అతిపెద్ద టౌన్షిప్ నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.9 లక్షల వ్యయం. హైదరాబాద్‌లో 500 బస్తీ దవాఖాల ఏర్పాటు. ప్రతి 5 వేల జనాభాకు ఒక దవాఖానా. -
పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల రూపు రేఖలు మార్చేందుకు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.1003 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలకు గతంలో మంజూరు చేసిన ప్రత్యేక నిధులు లేదా పన్ను రూపేణ వచ్చిన, ఫైనాన్స్ కమిషన్ నిధుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను కలెక్టర్లకు మంజూరు చేస్తామన్నారు. పట్టణాలు, నగరాల ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల నిర్మాణాలు, పార్కుల ఏర్పాటు పనులను గుర్తించి ఈనెల 31లోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు, సలహాలతో ప్రజలు కోరుకునే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) ప్రకటించిన జిల్లాలోని మున్సిపాల్టీల మాస్టర్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 15వేల జనాభా గల గ్రామాలను నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 145కు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో మిషన్ భగీరథ, అండర్ డ్రెయినేజీ పనులు సమాంతరంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ రవీందర్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, నగర పాలక కమిషనర్ జాన్ సాంసన్, అధికారులున్నారు. -
పట్టణాభివృద్ధికి మరిన్ని నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) ద్వారా మరిన్ని నిధులు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. 39 శాతం రాష్ట్ర జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉందని, త్వరలో కొత్త పురపాలికల ఏర్పాటుతో ఇది 45 శాతానికి పెరగనుందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పట్టణాల్లోని మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలను ప్రణాళికాబద్ధంగా పక్కా రోడ్డు మ్యాపుతో అభివృద్ధి చేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పట్టణాలకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఇస్తున్న నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లోని జంక్షన్ టు జంక్షన్ రోడ్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కుల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీటిని పూర్తి చేస్తే పట్టణాల్లో గుణాత్మక మార్పు వస్తుందన్నారు. ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోండి.. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తే పట్టణాల అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నా రు. ప్రస్తుతం ఇస్తున్న టీయూఎఫ్ఐడీసీ నిధు లు పురపాలికలకు మార్గాల్లో వచ్చే నిధులకు అదనంగా వచ్చే నిధులని మంత్రి తెలిపారు. వీటితో చేపట్టే పనులను పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ పనుల వివరాలను నెలాఖరులోగా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలన్నారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు.