vasalamarri
-
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఇళ్లులేవు.. అనుమతులూ లేవు..
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు పక్కా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ఎప్పుడు చేపడతారా అని రెండేళ్లుగా వేచి ఉన్నామని.. ఇప్పటికీ ఇళ్లు, మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభమే కాలేదని అంటున్నారు. కనీసం సొంతంగా కట్టుకునే పర్మిషన్లూ ఇవ్వడం లేదని చెప్తున్నారు. పాత, సగం కూలిపోయిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే సొంతంగా కట్టుకునేందుకు అనుమతులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి ఇటీవల భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న సీఎం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి, స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతకుముందు జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించడానికి వాసాలమర్రి మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సీఎం సాయంత్రం తిరుగుప్రయాణంలో గ్రామంలోని రామాలయం వద్ద ఆగి మాట్లాడారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి ప్రత్యేకంగా లేఅవుట్ అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ అధికారులు గ్రామంలో పర్యటించి చేపట్టాల్సిన పనులపై సర్వే చేశారు. రూ.152 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. 481 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక వాసాలమర్రిలో ప్రస్తుతం 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ఈ 481 ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారి కోసం జీ ప్లస్ వన్, జీ ప్లస్ టూ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతర్గత మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకు, పార్కు, ఫంక్షన్‌హాల్, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, పోస్టాఫీస్, మినీ మార్కెట్, సబ్ సెంటర్లను నిర్మించాలని నిర్ణయించారు. గ్రామాన్ని పునర్నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఇళ్లు కూడా నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. కానీ ఇవేవీ ముందుకుపడలేదు. వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి గ్రామంలో 481 పెంకుటిళ్లు కూల్చివేసి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. రెండేళ్లు అవుతోంది. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనడమేగానీ నిర్మాణం ప్రారంభం కావడం లేదు. గ్రామ అభివృద్ధి కోసం రూ.152 కోట్లతో డీపీఆర్ పంపించారు. నిధులు రాలేదు. లేఅవుట్ కాలేదు. 50 ఇళ్లు కూలిపోయాయి. నా ఇల్లు కూడా సగం కూలిపోయింది. కొత్తగా కట్టుకుందామంటే పర్మిషన్ లేదు. వెంటనే ఇళ్లు కట్టించాలని, లేకుంటే కట్టుకునే పర్మిషన్ అయినా ఇప్పించాలని గ్రామస్తులు పంచాయతీపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదైనా సీఎం సార్ నిర్ణయం తీసుకోవాలని అధికారులు అంటున్నారు. మూడు విడుతలుగా నిధులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మౌలిక వసతుల కోసం రూ.58 కోట్లతో మరో డీపీఆర్ పంపించామని కలెక్టర్ చెప్తున్నారు. త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – పోగుల ఆంజనేయులు, సర్పంచ్, వాసాలమర్రి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం నూతన భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు. వానాకాలంలో పాత ఇళ్లు కొన్ని కూలిపోయాయి. కొందరు గుడిసెలలో జీవిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వకుండా.. మరోవైపు సొంత డబ్బులతో కట్టుకుందామనుకున్నా అనుమతులు ఇవ్వక పోవడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. – పలుగుల మధు, ఉప సర్పంచ్ -
ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో బస్సు కోసం ధర్నా
తుర్కపల్లి: పాఠశాల సమయానికి బస్సులు లేవని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి విద్యార్థులు సోమవారం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి బస్సులు లేక పోవడంతో విద్యార్థులు ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని, ఆటోలు రాకపోతే స్కూల్‌కు నడిచి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి, గజ్వేల్ రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని రాస్తారోకోను విరమింపచేశారు. -
ఎలాంటి యూనిట్లు పెట్టుకున్నారు
తుర్కపల్లి: ఐకమత్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వాసాలమర్రి ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచన వల్లే దళితబంధు పథకం వచ్చిందని, ఆ పథకాన్ని సది్వనియోగం చేసుకొని, అర్థికంగా ఎదిగి పది మందికి ఉపాధి చూపే స్థాయికి చేరుకోవాలని అన్నారు. బుధవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళితవాడలో సీఎం కార్యదర్శి రాహుల్»ొజ్జ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలసి పర్యటించారు. అనంతరం రైతు వేదిక భవనంలో దళితబంధు లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. లాబ్ధిదారులు ఏయే యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు, నెలకు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఎర్రవల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేసుకోవాలని వారికి సూచించారు. గ్రామంలో కొత్తగా పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు ఏర్పాటు చేస్తామని, చిన్న పరిశ్రమల ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వాసాలమర్రి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇతర కులాల్లో ఉన్న యువకులకు కూడా వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు, జెడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, అదనపు కలెక్టర్ దీపక్‌తివారి తదితరులు పాల్గొన్నారు. -
వాసాలమర్రికి పండగొచ్చింది
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోఎంపిక చేసిన దళిత కుటుంబాల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ అయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దళితులందరూ అర్థికంగా ఎదగాలని, మొట్టమొదటిగా దళితబంధు పథకాన్ని ఇక్కడినుంచే ప్రారంభిస్తున్నానని ఆగస్టు 4న సీఎం కేసీఆర్ చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు మరుసటి రోజున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున 76 దళిత కుటుంబాలకు సంబంధించి కలెక్టర్ పమేలా సత్పతి ఖాతాలోకి నిధులు ప్రభుత్వం జమ చేసింది. అనంతరం నిధులను దేనికి, ఎలా ఖర్చు చేస్తారు? ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై వివిధ శాఖల అధికారులు పలుమార్లు ఆయా దళిత కుటుంబాలతో సమావేశమై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలు పూర్తి కావడంతో 8వ తేదీ రాత్రి 8 గంటలకు నేరుగా 66 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులను ప్రభుత్వం జమ చేసింది. మరో 10 మందికి జమ కావాల్సి ఉంది. సాంకేతిక సమస్యల వల్ల 10 మందికి డబ్బులు జమ కాలేదని, వారికి కూడా త్వరలోనే వస్తాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ తెలిపారు. ఆనందోత్సవాలు వాసాలమర్రి దళితులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. తమ బతుకులు మారబోతున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధుల జమ ఖాయమైనా, నిన్న మొన్నటి వరకు కొంత సంశయంతో ఉన్న సమయంలో తమ ఖాతాల్లోకి రూ.10 లక్షలు వచ్చి చేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. లబ్ధిదారుల క్షేత్ర పర్యటన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, మేకలు, గొర్ల పెంపకంపై ఆసక్తి ఉన్న 30 మంది రైతులను గురువారం జిల్లా అధికారం యంత్రాంగం ధర్మారెడ్డి గూడెం, చిన్నకందుకూర్, రాయగిరి, కూనూర్ గ్రామాల్లో క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. వారికున్న అనుమానాలను నివృత్తి చేశారు. పశు పోషణ, కోళ్ల పెంపకం, గొర్లు, మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి, లాభాలు ఏవిధంగా గడించాలన్న విషయాలను వారికి తెలియజేశారు. -
దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణకు వచ్చింది. నిబంధనలు ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని పిటిషన్లో కోర్టుకు తెలిపారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని ఏజీ పేర్కొంది. అయితే నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్సైట్లో లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
అంబేద్కర్‌లా సీఎం కేసీఆర్‌కు చరిత్రలో స్థానం: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితబంధు పథకం అమలు చేయడంపై మరో అంబేడ్కర్‌గా పోల్చి చెప్పారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దళితబంధులాంటి పథకం ఎవరు తీసుకురాలేదని.. అంత ధైర్యం ఎవరూ చేయలేదని మోత్కుపల్లి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. దళితబంధును బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడగలరా..? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి దేశమంతా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని ఆపాలని చాలా మంది చూస్తున్నారు, మన మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోసం బయటికి వచ్చినట్లు తెలిపారు. డబ్బు తీసుకుని వస్తా అని చెప్పి తీసుకుని వచ్చిన మొగాడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. దళితులు ఇంకా బలహీన వర్గాలుగా ఉంచాలని చాలా మంది కుట్ర చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లా సీఎం కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. మరియమ్మ ఘటన అయిన తరువాత కేసీఆర్ ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. అలానే వరంగల్‌లో ఎస్సైపై అత్యాచారం కేసులో వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజల కోసం బతికే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. -
దళితబంధు నిధుల విడుదల: వాసాలమర్రిలో కొత్త పండుగ!
సాక్షి, యాదాద్రి, తుర్కపల్లి: ‘దళితబంధు’ పథకం అమలుతో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం గ్రామంలోని దళిత కుటుంబాలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. వాసాలమర్రిలోనే దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు గురువారం సాయంత్రం గ్రామంలోని దళితులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రా«థమిక వివరాలను సేకరించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే యూనిట్ల గ్రౌండింగ్, శిక్షణ అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయనున్నారు. వీలైనంత త్వరగా సొమ్ము జమ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. డప్పు దరువులతో కోలాహలం వాసాలమర్రి గ్రామంలోని దళితులు గురువారం ఉదయం నుంచే సంబరాల్లో మునిగారు. వ్యవసాయం, రోజుకూలి, ఇతర పనులకు వెళ్లేవారు గ్రామంలోనే ఉండిపోయారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకాలు చేశారు. పూలమాలలు వేశారు. గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు పలుగుల నవీన్‌తోపాటు దళితులంతా రంగులు చల్లుకున్నారు. డప్పుదరువులతో కోలాటం ఆడారు. కేసీఆర్‌ను స్తుతిస్తూ బతుకమ్మ పాటలు పాడారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ‘దళితబంధు’తో తమ బతుకులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. కూరగాయల సాగు చేస్తాం.. దళితుల బతుకుల్లో వెలుగులు నింపుతున్న అభినవ అంబేడ్కర్ కేసీఆర్. మా అమ్మ కూరగాయలు అమ్ముతుంటుంది. దళితబంధు నిధులతో మా ఎకరం భూమిలో బోరు వేసుకొని, డ్రిప్ పద్ధతిలో కూరగాయల సాగు చేసుకుంటాం. పాడి పశువులు పెంచాలన్న ఆలోచనలో ఉన్నాం. – చెన్నూరి మమత, బీటెక్ వ్యాపారం చేయాలని ఉంది కేసీఆర్ సార్ మా ఇంటికొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడిండు. మా సంగతులన్నీ చెప్పిన. వ్యాపారం చేస్తనన్న. ‘ఆలోచించి ముందుకు దిగు. పైసా పైసా పెరిగేటట్టు చూసుకో. నీ బతుకు మారుతది’ అని ఓ అన్న లెక్క చెప్పిండు. దళిత బంధు పైసలతో వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడతా. –బొట్టు నరేశ్ ఇసొంటి సీఎంను సినిమాల్లోనే చూసిన మేం ఆరుగురం.. చిన్న గుడిసెలో ఉంటం. చేసిన కష్టం తిండికే సరిపోతోంది. సీఎం సార్ మా ఇంటికి వచ్చిండు. ఇల్లు కట్టిస్త అని చెప్పిండు.పది లక్షల రూపాయలు ఇస్త ఏంచేస్తరన్నడు. అది విని నోట మాట రాలే, ఇసోంటి సీఎంను సినిమాల్లోనే చూసినం. –చెన్నూరి కవిత -
వాసాలమర్రికి కేసీఆర్ వరాలు
-
దళితబంధు షురూ.. వెంటనే పథకం అమల్లోకి: సీఎం కేసీఆర్
ఇంటింటికి వెళ్లి.. సమస్యలు విని.. వాసాలమర్రి పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ దళితవాడలో ఇల్లిల్లూ తిరుగుతూ వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఇస్తే ఏం చేస్తారంటూ ఆరా తీశారు. డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొందరి సమస్యలు విని.. వెంటనే పరిష్కరించాలంటూ అక్కడిక్కడే అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ ఇప్పిస్తం.. సీఎం కేసీఆర్‌ను కలిసిన జెరిపోతుల పోశమ్మ తన కూతురికి ఏదైనా సాయం చేయాలని కోరింది. తనకు కూతురు ఒక్కతే ఉందని, అల్లుడు డ్రైవర్‌గా పనిచేస్తాడని చెప్పింది. దీనితో కేసీఆర్ స్పందిస్తూ.. ఆమె అల్లుడికి దళితబంధు కింద ట్రాక్టర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే పనిముట్లు ఇప్పించండి! సీఎం: నీ పేరేంది, ఏం పనిచేస్తవు? కలకొండ కృష్ణాచారి. వడ్ల పనిచేస్తా. సీఎం: ఎంతమంది పిల్లలు ? కృష్ణాచారి: ముగ్గురు పిల్లలు సీఎం: ఏ కావాలి నీకు? కృష్ణాచారి: పనిముట్లు కావాలె, ఇంటికి ప్లాస్టరింగ్ లేదు సీఎం: సరే నీకు సాయం అందుతది. వెంటనే కృష్ణాచారికి పనిముట్లు ఇప్పించాలని, అతడి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయించాలని అక్కడే కలెక్టర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళితులందరికీ భూమి వాసాలమర్రిలో దళితులందరికీ భూమి పంపిణీ జరుగుతుంది. భూమి ఉన్నవారు ఎందరు, ఎంత ఉంది, భూమి లేనివారు ఎందరనేది పరిశీలిస్తున్నాం. గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో దళితులకు ఇచ్చిన 612 ఎకరాల అసైన్డ్ భూముల్లో ఆక్రమణలకు గురైన వాటిని రికవరీ చేస్తాం. వాటిని అందరికీ పంచుతాం. కాళేశ్వరం నీళ్లు వస్తాయి కాబట్టి పంటలు పండించుకోవచ్చు. సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ‘దళిత బంధు’పథకాన్ని బుధవారం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.7.60 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వాసాలమర్రి దళితులందరికీ భూమి ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. అక్కడి దళిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. వాసాలమర్రి గ్రామంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే పథకం అమల్లోకి..: దళితులు కష్టపడేతత్వం కలవారు. అలాంటి వారు పేదరికంలో ఉండొద్దు. వ్యాపారం, స్వశక్తితో స్వయంగా ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఈ రోజు నుంచే దళిత బంధు పథకం లాంచ్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నాను. వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున గురువారం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వాసాలమర్రి గ్రామ దళితులు ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా పైకి ఎదిగి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలి. రాష్ట్రంలో ఏడాది కిందనే దళిత బంధు అమలు కావాల్సి ఉంది. ఆరునూరైనా ఈ పథకాన్ని గొప్పగా అమలు చేస్తాం. రాష్ట్రంలో 15– 16 లక్షల దళిత కుటుంబా లు ఉన్నాయి. అందులో ఎలాంటి ఆధారం లేనివారికి దళిత బంధు పథకం ద్వారా ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. ఈ పథకం కింద రూ.30కోట్లతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. అనారోగ్యం, అనుకోకుండా వచ్చే ఇతర కష్టాలతో దళితులు దెబ్బతినకుండా ఇది ఉపయోగపడుతుంది. వాసాలమర్రితోపాటు అన్నిచోట్లా దళితుల మధ్య ఐకమత్యం ఉండాలి. ఏమైనా పోలీస్ కేసులు ఉన్నా రద్దు చేసుకోవాలి. యువతే కేసీఆర్ ఆస్తి.. దళిత సమాజంలోని చదువుకున్న యువతే కేసీఆర్ ఆస్తి. వారు ఎక్కువ బాధ్యత తీసుకుని, కుటుంబ సభ్యుల సమష్టి ఆలోచనలతో ఎదగాలి. దళిత కాలనీల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, మురికి కాలువలు, రోడ్లు నిర్మిస్తాం. భూముల సమస్య పరిష్కరిస్తాం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసి కేసీఆర్‌కు ధైర్యం కల్పించాలి. రాబోయే 15 రోజుల్లో గ్రామంలో భూముల సమస్య పరిష్కరిస్తాం. మళ్లీ ఆరు నెలల తర్వాత దళితవాడలో తిరిగి సమావేశమై అందరం భోజనం చేద్దాం. ఎవరెవరు ఎలా అభివృద్ధి చెందుతున్నారనేది మాట్లాడుకుందాం. ఇండ్లు కూడా పాతవి తీసేసి కొత్త ఇండ్లు కట్టుకుందాం. వాసాలమర్రిని ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా బంగారు వాసాలమర్రి అయ్యేలా సమష్టి కృషిచేద్దాం’’అని సీఎం చెప్పారు. వాసాలమర్రి పర్యటనలో సీఎం వెంట ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి పరిస్థితిని ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్ ఆగవ్వను ఆపారు! వాసాలమర్రిలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాసాలమర్రికి తొలిసారి వచ్చినప్పుడు సీఎం పక్కన కూర్చొని భోజనం చేసిన ఆగవ్వ.. బుధవారం దళితవాడలో సీఎంను కలిశారు. అయితే రైతు వేదిక వద్ద దళితులతో నిర్వహించిన సమావేశానికి వెళ్తున్న ఆమెను పోలీసులు ఆపేశారు. ‘నేను ఆగవ్వను, సీఎం సారుతో అన్నం తిన్న..’ అని చెప్పినా పంపలేదు. ఆమె నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది. ఇక పోలీసులు తమను వ్యవసాయభూముల వద్దకు వెళ్లనివ్వక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు గ్రామంలోని పలు ఇతర కాలనీల్లోనూ సీఎం పర్యటించారు. అధికారులు రూపొందించిన రోడ్‌మ్యాప్ ప్రకారం కాకుండా వేర్వేరు వీధుల్లోకి వెళ్లారు. నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను ఓపికగా విని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించుకున్న సుమారు 20 మంది మహిళా బీడీ కార్మికులకు రెండు రోజుల్లో పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్తుండగా సీఎం స్పందించి.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంట్లో ఉండే చదువుకున్న. వాళ్ల కష్టాలు నాకు తెలుసమ్మా’ అని చెప్పారు. వాసాలమర్రిని తాను దత్తత తీసుకున్నానని, గ్రామంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పర్యటన సందర్భంగా సర్పంచ్ అంజయ్య ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు. నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. దళితవాడలో దుబాసీ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన సీఎం అది శిథిలమై ఉండటాన్ని చూశారు. ‘అరె.. ఎట్లుంటున్నరయ్యా ఈ ఇంట్లో.. వాన వస్తే నీళ్లు వస్తలేవా?’ అని అడిగారు. దాంతో.. ‘పరిస్థితి బాగాలేదు కూలినాలి చేసుకుని బతుకుతున్నం. బతుకుదెరువు కష్టంగా ఉంది’ అని శ్రీనివాస్ బదులిచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం.. ‘నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా. మీ ఊరందరు సహకరిస్తే తొందరలోనే పూర్తి చేసుకుందాం..’ అని భరోసా ఇచ్చారు. ఇంటింటికీ తిరిగి.. సీఎం కేసీఆర్ సుమారు మూడు గంటల పాటు వాసాలమర్రిలో కలియదిరిగారు. దళితవాడతోపాటు ఇతర వాడల్లో కాలినడకన పర్యటించారు. స్వయంగా వినతిపత్రాలను స్వీకరించారు. దళిత మహిళలు సీఎం కేసీఆర్‌కు బొట్టుపెట్టి, మంగళ హారతులతో స్వాగతం పలికారు. దళితవాడలో తొలుత కొండపురం నర్సమ్మ ఇంటివద్ద సీఎం కేసీఆర్ ఆగారు. తనకు పింఛన్ ఇప్పించాలని ఆమె కోరగా.. వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. వాడలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను చూసి ఆయన చలించిపోయారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తే ఎలా ఖర్చుచేస్తారని సీఎం ప్రశ్నించగా.. కొందరు ఇల్లు కట్టుకుంటామని, పాత ఇండ్లు మరమ్మతు చేసుకుంటామని, భూమి అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. ఇల్లులేని వారికి ఇల్లు మంజూరు చేస్తానని, దళితబంధు డబ్బులను ఉపాధి కోసమే ఉపయోగించుకోవాలని సూచించారు. భోజనానికి రండి.. గజ్వేల్/మర్కూక్: వాసాలమర్రిలో పర్యటన ముగించుకున్న సీఎం తిరుగు ప్రయాణంలో.. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశిరెడ్డిపల్లి వద్ద కాసేపు ఆగారు. ‘అంతా మంచిగున్నరా.. అంటూ పలకరించారు. గ్రామంలో పలు సమస్యలు తీర్చాలంటూ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, మల్లేశం వినతి పత్రం అందజేశారు. గ్రామంలోకి రావాలని కోరారు. అయితే.. గ్రామంలోని ముఖ్యులు 10వ తేదీ తర్వాత ఫామ్‌హౌస్‌లో భోజనానికి రావాలని సీఎం సూచించారు. గ్రామ అభివృద్ధిపై చర్చించుకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకుపోదామన్నారు. సీఎం స్పందనతో గ్రామస్తుల్లో సంతోషం కనిపించింది. -
దళితబంధు సొమ్ముపై పూర్తి బాధ్యత మీదే: సీఎం కేసీఆర్
-
వాసాలమర్రిలోని దళితులకు తక్షణమే ‘దళితబంధు’
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటిస్తున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ‘‘భారతదేశంలో ఏళ్లుగా అణచివేతకు గురైన జాతి దళిత జాతి. కొందరు మహాత్ములు ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించారు. వారిలో ముఖ్యులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. 60 ఏళ్ల క్రితం ఆయన దళితుల కోసం పోరాటం చేయగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు లభించాయి. ఆయన మార్గం చూపారు. కానీ పూర్తి స్థాయిలో దళితుల అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వాలు సరైన దిశలో దళితుల అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం వల్లనే వారు ఇంకా పేదలుగానే ఉన్నారు’’ అన్నారు. ‘‘20 ఏళ్లు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నాం. గొల్ల, కురమలకు గొర్లు, గీత కార్మికులకు సాయం, సామాజిక వర్గాల వారిగా చేయూతనందిస్తున్నాం. ముసలి, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు. ఏడాది క్రితమే దళిత బంధు ప్రాంరభం కావాల్సి ఉండే.. ‘‘ఏడాది క్రితమే దళిత బంధు ప్రారంభం కావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అందుకే ఈ మధ్యనే దాన్ని ప్రారంభించాం. నెలల పాటు ఆలోచించి.. ఈ పథకాన్ని రూపొందించాం. దీన్ని విఫలం కానివ్వొద్దు. లబ్ధిదారులు దీన్ని వాడుకుని అభివృద్ధి చేసి చూపించాలి. దళితవాడలు ఐకమత్యంగా ఉండాలి. ఈర్ష్య , కోపం లేకుండా అందరం ప్రేమ భావనతో ఉండాలి. పథకాన్ని విజయవంతం చేయాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ మార్గంలో వెళ్లేటప్పుడు నేను వాసాలమర్రిని పరిశీలించాను. మీ ఊరు బలే గమ్మత్తుగా ఉంటది. ఈ ఊర్లో ఉన్నన్ని మట్టి గోడలు ఎక్కడా లేవు. ఒక్కటి కూడా ఇటుకల ఇళ్లు లేవు. గందరగోళంగా ఉంది ఊరి పరిస్థితి. ఎర్రవెల్లి కూడా ఇలానే ఉంటుండే. అందరం కూర్చుని ఆలోచించాం. ఊరు కూలగొట్టి.. కొత్తగా నిర్మిద్దాం అని చెప్పి వారిని ఒప్పించాను. టెంట్లు తెప్పించి ఊరును అందులో పెట్టా. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గృహప్రవేశాలు చేశాం. ఇక్కడ కూడా అలానే జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కేసీఆర్. వాసాలమర్రి బీసీలను కూడా ఆదుకుంటాం.. ‘‘ఇక్కడ దళిత వాడలో ఇళ్లు కూడా అలానే ఉన్నాయి. దీన్ని కూడా ఎర్రవెల్లి మాదిరిగానే అభివృద్ధి చేద్దాం. దళితులే కాదు.. ఊరంతా ఉన్న బీసీలు కూడా పేదలుగానే ఉన్నారు. వారిని కూడా ఆదుకుందాం. ఈ గ్రామంలో ప్రభుత్వ జాగా 612 ఎకరాలు ఉంది. దళితుల దగ్గర భూమి తక్కువ ఉంది. దీని గురించి ర్యాప్తు చేయమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాను. మరో 100 ఎకరాల భూమి తేలింది. దాన్ని దళితులకు ఇద్దాం. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘దళిత భూముల కమతాలను ఏకీకరణ చేద్దాం. దళిత బంధును పూర్తిగా నిరుపేదలకు తొలుత అందిస్తాం. మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను కనుక వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు అందిస్తాం. ఇవాళే జీవో విడుదల చేయిస్తాం. రేపట్నుంచే మీ అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ చేస్తాం. దళిత బంధు సొమ్మును వృధా కానివ్వొద్దు’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత రక్షణ నిధి ఏర్పాటు.. ‘‘ప్రభుత్వం మీకిచ్చే దళిత బంధు సొమ్ములో రూ. 10 వేలు కట్ చేస్తుంది. దానికి ప్రభుత్వం తరఫున మరో 10 వేల రూపాయలు జమ చేస్తాం. ఆలేరు నియోజకవర్గంలో 15 వేల దళిత కుటుంబాలుంటే.. వారందరి నుంచి 10 వేల రూపాయలు కట్ చేసి.. ప్రభుత్వం మరో 10 వేల రూపాయలు జమ చేసి మొత్తం 30 కోట్ల రూపాయలతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తాం. అనారోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యే ఆస్పత్రి ఖర్చులకు వినియోగించేలా దళిత రక్షణ నిధి నుంచి సొమ్ము తీసుకుంటాం. దీని మీద పూర్తి పెత్తనం దళితులదే’’ అన్నారు కేసీఆర్. దళిత బంధుతో పాటు మిగతా అన్ని పథకాలు వర్తిస్తాయి.. ‘‘దళితబంధు ఇచ్చాక ఓ కార్డు ఇస్తాం. దాని ద్వారా మీకిచ్చిన డబ్బును పర్యవేక్షిస్తాం. అలా కాకుండా డబ్బును వృధా చేస్తే.. జనాలు నన్ను తిడతారు. వాసాలమర్రే ఆలేరు నియోజకవర్గానికి ఆదర్శం కావాలి. దళితబంధును సద్వినియోగం చేసే బాధ్యత అక్కచెళ్లమ్మల్లదే. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకుని పట్టు పట్టి.. జట్టు కట్టి.. గెలిచి చూపాలి. మీరే నా అతిపెద్ద ఆయుధం. పది లక్షల రూపాయాల్లో పది పైసలు కూడా వృధా చేయవద్దు. దీని నుంచి సంపాదించిన సొమ్ముతో అభివృద్ధి చెందాలి. నిదానంగా ఆలోచించి.. మంచి ప్రణాళికతో ముందడుగు వేయాలి. వందకు వంద శాతం విజయవంతం చేసి చూపించాలి. దళిత బంధు ఇచ్చామని మిగతా పథకాలను ఆపం. ఇది అదనపు సదుపాయం’’ అన్నారు కేసీఆర్. -
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
-
వాసాలమర్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతోంది. గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ‘దళిత బంధు’ పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని స్పష్టమైన అవగాహనతో దళిత బందు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు గంటకుపైగా దళితవాడల్లో కాలినడకన కలియతిరిగారు. గ్రామమంతా కలియతిరిగి మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో కూడా మాట్లాడారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. జూన్ 22వ తేదీన కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్.. సర్పంచ్ ఇంట్లో భోజనం
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రానున్నారు. జూన్ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి, గ్రామస్తులతో కలసి సీఎం సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి మరో అంకాపూర్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన సంగతీ విదితమే. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి కేసీఆర్ వాసాలమర్రికి చేరుకుంటారు. 53 దళిత కుటుంబాలతో కూడిన కాలనీలో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుంటారు. దళిత బంధుపై చర్చిస్తారు. సర్పంచ్‌కు సీఎం ఫోన్ గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. వాస్తవానికి జూన్ 22నే సర్పంచ్ ఇంటికి వస్తానని చెప్పినప్పటికీ ఆరోజు సమయాభావం వల్ల వెళ్లలేకపోయారు. మరోమారు వస్తానని ఆ రోజు సర్పంచ్‌కు హామీ ఇచ్చిన సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు సర్పంచ్‌కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత గ్రామంలోని రైతువేదిక భవనంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి పరిమిత సంఖ్యలో 150 మంది మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామాభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. జూన్ 22 తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఏ ర్పాటు, యువత, రైతులు, మహిళల అభ్యున్నతికి అవసరమైన చర్యలు, గ్రామంలో మౌలిక వసతులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగు, తాగు నీటి వివరాలు, ఉపాధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. -
‘వాసాలమర్రి’ ఆగవ్వకు అస్వస్థత
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఈనెల 22న నిర్వహించిన గ్రామసభ, సహపంక్తి భోజనాల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్న ఆకుల ఆగవ్వ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. వాసాలమర్రిలో సభ ముగించుకొని ఇంటికి వెళ్లాక ఆగవ్వకు తీవ్ర కడుపునొప్పి రావడంతో భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కడుపునొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత గురువారం ఇంటికి పంపారు. ఎండ లో తిరగడంతో ఆమె అస్వస్థతకు గురైందని జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, గ్రామంలో దాదాపు 20 మంది సైతం అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వాసాలమర్రి బిడ్డ సుప్రజను డాక్టర్ చదివిస్తా..: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి సభలో సీఎం కేసీఆర్ మరో హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన బాలికను ఎంబీబీఎస్ చదివిస్తానని ప్రకటించారు. వాసాలమర్రికి చెందిన నర్సింహులు, రాణి దంపతుల కూతురు సుప్రజను విషయమై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సహపంక్తి భోజనం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఊరిలోని ప్రభుత్వ బడిలో పదో తరగతి పాసయ్యానని, డాక్టర్ కావాలని ఉందని చెప్పింది. అంత చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. అమ్మాయి తండ్రి తమకు అర ఎకరం మాత్రమే పొలం ఉందని, తల్లి హైదరాబాద్‌లో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తుందని చెప్పారు. చదువుకునేందుకు ప్రభుత్వ స్కీంలు ఉన్నాయి. కొందరికి తెలియదు. అయినా ఆమెను నేను చదివిస్తా. ఊర్లో ఇంకా ఇలాంటి వారు ఎందరున్నా వారందరినీ చదివించాలి’’ అని కేసీఆర్ సూచించారు. -
CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా..
సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి గ్రామసభలో సీఎం కేసీఆర్ తన చమత్కారాలతో నవ్వులు పూయించారు. కేసీఆర్ ప్రసంగం మొదలు పెడుతూ.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అనగానే గ్రామస్తులు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కొందరు ఈలలు వేశారు. ఇది చూసిన సీఎం.. ‘‘నేనేమైనా సినిమా యాక్టర్నా.. సీటీలు వేస్తున్నరు..’’ అన్నారు. దీంతో అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇక ‘‘పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వచ్చిండంటే ఊరికి చాలా పనులు జరుగుతయి. పెద్ద మనిషికి చప్పట్లు కొట్టండి..’’ అని సీఎం అన్నప్పుడు అంతా ఒక్కసారిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. తర్వాత ‘‘వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పమేలా సత్పతిని యాదాద్రి జిల్లాకు కలెక్టర్‌గా వేశాం. ఆమె అక్కడ బాగా పనిచేశారు. దాంతో ఆమెను వరంగల్ నుంచి తీయవద్దని నాతో కొందరు గొడవపడ్డారు కూడా. ఇప్పుడు ఆమెను మీ గ్రామ ప్రత్యేకాధికారిగా నియ మిస్తున్నా.. ఇక నుంచి తల్లి అయినా.. తండ్రి అయినా ఆమెనే’’ అని కేసీఆర్ అన్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. ఇది చూసిన కేసీఆర్.. ‘మీ కలెక్టర్‌కు చప్పట్లు బాగా కొడుతున్నరుగా..’’ అనడంతో అందరూ నవ్వారు. (చదవండి: ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు) ఊరికే కాదు.. జిల్లా మొత్తానికి నిధులు సీఎం కేసీఆర్ వాసాలమర్రికి నిధులు మంజూరు చేస్తారని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా.. ఆయన యాదాద్రి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలకు ని«ధులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఒక్కో పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున.. మేజర్ మున్సిపాలిటీ భువనగిరికి రూ.కోటి, నూతన మున్సిపాలిటీలైన ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, మోత్కూరులకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్లు లేకుంటే గుడ్డేలుగుల్లా ఉంటం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు దళితవాడ, చాకలివాడ, రైతుల వాడలకు రోజూ వెళ్లి మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.‘‘చాకలి, మంగలి వాళ్లు సమాజ సేవకులు. వారు చేసేది శుభ్రత. వారు పనిచేయకపోతే మనం గుడ్డేలుగుల్లా (ఎలుగు బంట్లలా) ఉంటం. వారు పొట్టకోసం చేసినా ప్రజలకు మంచి చేస్తున్నారు. వారిని గౌరవించాలి. వృద్ధిలోకి తీసుకురావాలి..’’ అని పిలుపునిచ్చారు. మహిళలతో సహపంక్తి.. సర్పంచ్‌పై ఆరా.. సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఆయన పక్కన గ్రామానికి చెందిన చెన్నూరి లక్ష్మి, ఆకుల ఆగమ్మ కూర్చున్నారు. కేసీఆర్ భోజనం చేస్తూ వారితో మాట్లాడారు. ‘మీ సర్పంచ్ ఎలాంటోడు, ఎంపీటీసీ మంచోడేనా’ అంటూ ఆరా తీశారు. ‘‘సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ మంచోళ్లే సార్. మా ఊర్లో ఏ కష్టమున్నా ఇద్దరూ వస్తరు. మంచి చెడ్డ అర్సుకుంటరు..’’ అని వారు చెప్పారు. భోజనం చేశాక కేసీఆర్ కొందరు గ్రామస్తులకు స్వయంగా వడ్డించారు. ఒకరిద్దరు మహిళల దగ్గరికి వెళ్లి భోజనం ఎలా ఉంది? అంటూ పలకరించారు. తర్వాత తనతో కలిసి భోజనం చేసిన మహిళలను స్వయంగా వెంట తీసుకెళ్లి వేదిక మీద కూర్చోబెట్టారు. -
ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు
వాసాలమర్రిలో ప్రతి కుటుంబానికి అవసరమైన లాభం ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నుంచి ఊరుమొత్తం నా కుటుంబం. ఇల్లు లేనోళ్లకు ఇల్లు కడదాం. ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ఇప్పిద్దాం. ప్రతి ఇంటికి ఒక పాడి పశువును ఇప్పిద్దాం. కమ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్డు వేసుకుందాం. జబ్బుపడిన వారికి హైదరాబాద్‌లో వైద్యం అందిద్దాం. రేషన్ కార్డులు ఇప్పిద్దాం. గ్రామ నిధిని ఏర్పాటు చేద్దాం. సీఎం మీ చేతిలో ఉన్నడు.. గ్రామం అభివృద్ధి చేయడానికి నేనున్న. సీఎం మీ చేతిలో ఉంటే ఇంకేం బాధ. రాష్ట్రాధినేత, ప్రభుత్వం మీ ఊరి పట్టున ఉంది. నిశ్చింతగా ఉండొచ్చు. అయితే గ్రామం ఐకమత్యం, పట్టుదలతో ఉండాలి. అవుననిపించుకోవాలి. చుట్టూ 10 గ్రామాలు వాసాలమర్రికి వచ్చి నేర్చుకోవాలి. ప్రేమతో మెలగాలి. అంతా దోస్తులు కావాలి. పిల్లలు మంచిగ చదువుకోవాలె. చదువుకునేందుకు ఎన్నో పథకాలు ఉన్నాయి. కొందరికి తెలియదు. స్తోమత లేక ఊళ్లో ఎవరూ చదువుకు దూరం కావద్దు. అలాంటి వాళ్లందరినీ చదివించాలి. సాక్షి, యాదాద్రి: ‘‘ఇక్కడ (వాసాలమర్రిలో) ఏదో ప్రత్యేకమైనది జరగాలి. మాటలతో కాదు. గొప్ప పట్టుదలతో జరగాలి. ఇవాళే దానికి పునాది రాయి పడాలి. జట్టుగట్టి.. పట్టుబట్టి ఊరిని బాగు చేసుకుందాం.. ఏడాదితిరిగే సరికి బి.వాసాలమర్రి అంటే బంగారు వాసాలమర్రి కావాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత నిర్వహించిన గ్రామసభలో ప్రసంగించారు. ‘అంతా అంతే బాగానే ఉంది కదా’ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం.. ఊరిని బాగుచేసుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పట్టుదలతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇంకో 20 మాట్ల వస్తా.. గ్రామాన్ని బంగారు వాసాలమర్రి చేద్దాం. అందరూ కలిసికట్టుగా పట్టుదలతో ఉంటరు గదా.. అందరిలో ప్రేమభావం రావాలి. ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ రావాలి. ముఖంలో చిరునవ్వులు రావాలి. ఊర్లో పోలీస్ కేసులు ఉండకూడదు. పక్కింటోడితో మంచిగా ఉండాలె. అంతా దోస్తులు కావాలె. గ్రామంలో నాకు ఈ రోజు నలుగురు పరిచయమైండ్రు. ఇంకో 20 మాట్ల వస్త. వచ్చినప్పుడు మీతో గింత దూరంలో ఉండి సభ నడువదు. దగ్గరగా కూర్చొని మాట్లాడుకుందాం. తినేటప్పుడు ఆగమ్మ, లక్ష్మి, సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ నవీన్ మాత్రమే పరిచయం అయ్యారు. మిగతా వారంతా దోస్తులు కావాలి. నేను వస్తున్నానని అన్ని చేసిండ్రు గ్రామానికి నేను వస్తున్నానని అధికారులు ఆగమేఘాల మీద ధనాధన్ అన్ని తయారు చేసిండ్రు. గ్రామంలో ట్రాక్టర్లు ఇవ్వాలంటే కేసీఆర్ వచ్చుడెందుకు? గివన్నెందుకు? అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చుడెందుకు? గిన్ని కార్లు వచ్చినయా? ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరగాలి. మీ అదృష్టం మంచిదని వేరే ఊర్ల వాళ్లు అంటున్నారు. మొదలుపెడితే వెనక్కి మర్రి చూడొద్దు కులమతాలకు అతీతంగా.. అందరికీ దండం పెట్టి చెప్తున్నా.. ఊరి అభివృద్ధి కోసం యజ్ఞంలాంటి పని పెట్టుకున్నం. ఇందులో కులం, మతం, ఆడ, మగ, రాజకీయ తేడా ఉండదు. అంతా ఊరు కోసం పనిచేయాలె. యశోద ఆస్పత్రివారు ఆరోగ్య శిబిరం పెట్టారు. జిల్లా కలెక్టర్ 270 మంది రైతులను అంకాపూర్‌కు తీసుకెళ్లి వచ్చారు. అక్కడ ఉన్నట్టే ఇక్కడా భూమి ఉంది. మనలాగే వడ్లు, కూరగాయలు పండిస్తరు. కానీ అక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ ఉంది. తప్పుచేస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులే ఫైన్ వేస్తరు. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీస్ అధికారి రాలేదు. చిన్న సమస్య వచ్చినా అభివృద్ధి కమిటీనే చూసుకుంటది. గ్రామంలో మహిళలు, చదువుకున్న వారు భాగస్వాములు కావాలి. గట్టిగా ఆలోచించాలి. పట్టుబట్టి తప్పును తప్పని చెప్పాలి. గ్రామాభివృద్ధి కోసం కమిటీలు వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని కులాల వారితో గ్రామాభివృద్ధి కమిటీ వేయా లని సూచించారు. ‘‘వారానికి రెండు గంటలు గ్రామంలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు శ్రమదాన కమిటీ, పరిశుభ్రత కమిటీ, తాగునీటి కమిటీ, హరితహారం, వ్యవసాయ కమిటీలు వేసి అంకాపూర్ మాదిరిగా వాసాలమర్రి పనిచేయాలి. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులను కమిటీల్లో నియమించాలి. నా నియోజకవర్గంలో ఎర్రవల్లిని చూడండి. అక్కడ ఇళ్లు కూలగొట్టాం. కొత్త ఇళ్లు కట్టాం. 24 గంటలు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రెండు మూడు రోజుల్లో కమిటీలు వేసుకుని చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువలు బాగు చేసుకుందాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి అందరూ ఉంటరు. వందకు వందశాతం బంగారు తెలంగాణ చేద్దాం’’ అని చెప్పారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, లింగయ్య, బొల్లం మల్లయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యమం నాటినుంచి చూస్తున్నా ఈ ఊరు మంచిగ లేదు. ఈ ఊరి మీదుగా చాలాసార్లు వెళ్లాను. బాగు చెయ్యొచ్చుగా అనుకున్నా. కొడకండ్ల రైతుబంధు భవనం ప్రారంభించి ఎర్రవల్లికి పోతుండగా ఊరిలో ఆగి కొందరితో మాట్లాడిన. ఎమ్మెల్యే గొంగిడి సునీత అప్పుడు అందుబాటులో లేదు. సర్పంచ్ అంజయ్య మరో 40మంది గ్రామస్తులు వచ్చి మాట్లాడారు. పట్టుబట్టి బాగు చేద్దాం అనుకున్నా. ఈలోపు కరోనా వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేయగానే ఎమ్మెల్యే సునీతకు ఫోన్‌చేసి చెప్పిన. ఇప్పుడు మంచిగా కలుసుకున్నం. బాగు చేయించే బాధ్యత నాది వాసాలమర్రి బాగుపడితే చుట్టూ పది ఊర్లు నేర్చుకోవాలి. బాగు చేయించే బాధ్యత నాది. నెల రోజుల తర్వాత చెట్టు కింద, గుడికాడ కూర్చొని మాట్లాడుకుందాం. ఊర్లో మూడు దళితవాడలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తా. గ్రామంలోని 1,500 మందికి చెందిన 3 వేల చేతులు కలిపితే ఊరి సమస్య బద్ధలై పోతుంది. వేలితో కొడితే దెబ్బతగలదు. పిడికిలి ఎత్తి సమష్టిగా గ్రామాభివృద్ధిని సాధిద్దాం. వ్యవసాయ, వృత్తిపనులు బాగు పడతాయి. మంచి పద్ధతిలో ముందుకుపోదాం. పెళ్లిళ్లు చేసే కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలి. మనోడు అనుకుంటే అన్నీ చేయవచ్చు. వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్, కలెక్టర్లు -
‘కేసీఆర్ సారు నా పక్కనే కూసుండి తిన్నరు, సంతోషమైంది’
సాక్షి, యాదాద్రి భువనగిరి: దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ గ్రామానికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామ రూపురేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రిని చేద్దామని ఆకాంక్షించారు. ఇక వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగమ్మ అనే మహిళ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కేసీఆర్ సారు పెద్ద కొడుకులా తనను ఆదరించారని చెప్పుకొచ్చారు. సీఎం సారే స్వయంగా తనకు పండ్లు ఇచ్చారని, శాఖం వడ్డించారని తెలిపారు. (చదవండి: సీఎం కేసీఆర్ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ! ) సీఎంతో తన సంభాషణ ఎలా సాగిందో ఆగమ్మ మాటల్లోనే.. ‘నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. సారు నా పక్కనే కూసుండి అన్నం తిన్నడు. ఆయన తినే కూర కూడా నాకు వడ్డించిండు. నేను కూడా నీ కొడుకునే అని చెప్పిండు. నాకు చానా సంతోషమైంది. పింఛన్ వస్తుందా అని సారు అడిగిండు. మా ఆయనకు వస్తున్నది అని చెప్పినా. కొడుకులు కోడళ్ల కన్నా కూడా మంచిగ.. సారు మా బాగోగులు తెలుసుకున్నరు’అని ఆగమ్మ ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: వాసాలమర్రికి నేనే అండగా ఉంటా: సీఎం కేసీఆర్) -
వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తా: సీఎం కేసీఆర్
-
వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తా: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామ రూపరేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రి కావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కావొద్దని, ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధి కమిటే సుప్రీంకోర్టు ‘చుట్టపక్కల గ్రామాలన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అందరూ కలిసి శ్రమిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. అంకాపూర్‌కు వెళ్లొచ్చి చూశారు కదా.. అక్కడ బంగారు భూమి లేదు. అంకాపూర్‌లో బిల్డింగ్లు ఎలా ఉన్నాయ్. అక్కడ ఉన్నది రైతులే.. అంకాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటే సుప్రీంకోర్టు. సర్పంచ్ తప్పు చేసినా ఆ గ్రామ కమిటే ఫైన్ వేస్తుంది. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీసులు వెళ్లాల్సిన అవసరం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటే మీకు అన్నీ జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటే మహిళలే ముఖ్యం. మీరు పట్టుబడితే, ఆలోచన చేస్తే ఊరు బాగుంటుంది. 1500 మంది వారానికి రెండు గంటలు ఊరి కోసం పనిచేస్తే మారదా. ఆరోజు నుంచి వాసాలమర్రి నా ఊరే. గ్రామంలో ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి. వాసాలమర్రిలో కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం. వాసాలమర్రి గ్రామస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలి. కులాలు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేద్ధాం.’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వాసాలమర్రికి అదృష్టం పట్టింది ‘మళ్లీ 20 రోజుల్లో వస్తా. ఈసారి చెట్టుకింద కూసుందాం. దళిత వాడల్లోకి వచ్చి వారి మంచి చెడులు తెలుసుకుంటా. 10వ తరగతి చదివిన సుప్రజ ఆర్థిక స్థోమతతో పై చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి నా దృష్టికి వచ్చింది. నేను తరచూ వెళ్ళేటప్పుడు వాసాలమర్రి వద్ద దేవుడు నాకు ఎందుకో బుద్ధి పుట్టించాడు. వాసాలమర్రికే ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారని మిగిలిన ఎమ్మెల్యేలు ఆలోచించొద్దు. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు. ఆరు మున్సిపాలిటీల్లో భువనగిరికి రూ.కోటి మిగిలిన అయిదు మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున నిధుల మంజూరు. వాసాలమర్రికి అదృష్టం పట్టింది. వంద గ్రామాల వారు వచ్చి వాసాలమర్రిని చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేయాలి. మనదంతా ఒకటే కులం అభివృద్ధి కులం. వాసాలమర్రిలో గ్రామఅభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో రాని నీళ్లు ఎర్రవల్లిలో 24 గంటలు నల్లా తిప్పితే నీళ్లు వస్తాయి’. అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ! Huzurabad: గులాబీ గూటికి ముద్దసాని కశ్యప్ రెడ్డి -
సీఎం కేసీఆర్ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ!
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2020 అక్టోబర్ 31న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం విదితమే. కేసీఆర్ తొలుత గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. ఇక మటన్, చికెన్, పప్పు, పచ్చిపులుసుతో సహా 23 రకాల వంటకాలు.. వాసాలమర్రి సహపంక్తి భోజనాల కోసం సిద్ధమవుతున్నాయి. మటన్, చికెన్, చేపలు, బోటీ, తలకాయ కూర, గుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, పప్పు, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, పచ్చిపులుసు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వంటలు వండిస్తున్నారు. చదవండి: CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి -
నేడు వాసాలమర్రికి కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2020 అక్టోబర్ 31న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం విదితమే. కేసీఆర్ తొలుత గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గ్రామస్తుల్లో ఆనందం తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న ఈ మారుమూల పల్లెకు ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. సీఎం రాకతో ఏళ్లతరబడి అభివృద్ధికి నోచుకోని వాసాలమర్రి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్న విశ్వాసంతో గ్రామస్తులు ఉన్నారు. గ్రామసభలో సీఎంతో తాము నేరుగా మాట్లాడుతామన్న ఆనందం వారిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, పాఠశాలలు, సామాజిక పింఛన్లు, మౌలిక సదుపాయాల కల్పన, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పాడిపరిశ్రమతో పాటు గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికను సర్పంచ్ పోగుల ఆంజనేయులు అధ్యక్షతన జరిగే సభలో ఆమోదించనున్నారు. నివేదిక సిద్ధం గ్రామ సమగ్రాభివృద్ధికి అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించి నివేదిక సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానంలో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 5 వేల మీటర్ల మేర సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ భవనం, రెండు అంగన్వాడి భవనాలు, 120 మంది యువతకు రుణాలు, స్కిల్, అన్‌స్కిల్డ్ యువతకు స్వయం ఉపాధి పథకాలు, వాహనాలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డెయిరీ యూనిట్లు, సీడ్ ప్లాంట్, వ్యవసాయ బోరు బావులు, ఫంక్షన్ హాల్, పీహెచ్సీ సెంటర్, విద్యుత్ సబ్‌సెంటర్, పాడిపశువుల పంపిణీ, భూమి లేని రైతు కూలీలకు భూములు, పంటల రక్షణకు అటవీ భూముల చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై గ్రామసభలో తీర్మానం చేయనున్నారు. మా ఊరు అన్ని రంగాల్లో బాగుపడాలి సీఎం దత్తత తీసుకున్న తర్వాత మా వాసాలమర్రి అన్ని రంగాల్లో బాగుపడుతుందని ఆ శిస్తున్నాం. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి అంశాన్ని సీఎంకు విన్నవిస్తాం. విద్యార్థులు, వ్యవసాయదారులు, మహిళలు, నిరుద్యోగుల భవిష్యత్ మారుతుందని గ్రామస్తులు ఆశతో ఉన్నారు. – పోగుల ఆంజనేయులు, సర్పంచ్ సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఊరి అభివృద్ధికి పూనుకోవడం, ప్రత్యేకంగా నేడు గ్రామానికి వ స్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామస్తు లందరూ ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి సమస్యలు, అభివృద్ధి గురించి సీఎం దృష్టికి తీసుకుపోతాం. గ్రామంలో పండుగ వాతావరణంలా ఉంది. – జహంగీర్, గ్రామస్తుడు వానకు ఇల్లు కురుస్తుంది మాది ఎనకటి నుంచి పెంకుటిల్లు. కోతులు పెంకలు పగుల గొట్టడంతో వర్షానికి ఇల్లు మొత్తం కురుస్తుంది. ముఖ్యమంత్రి సార్ మా ఊరును దత్తత తీసుకున్నడని సంతోషంగుంది. మాకు గూడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తదని ఆశతో ఉన్నాం. – తడక కనకలక్ష్మి, వాసాలమర్రి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సీఎం కేసీఆర్ మా ఊరిని అభివృద్ధి చేసేందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటది. గ్రామసభలో మాట్లాడే అవకాశం వస్తే ఈ విషయం గురించి సీఎం సార్ దృష్టికి తీసుకుపోతా. సీఎం వస్తుండటంతో గ్రామానికి కళ వచ్చింది. – కె.కిష్టమ్మ, గ్రామస్తురాలు -
సర్పంచూ.. 22న మీ ఊరొస్తున్నా : ఫోన్లో సీఎం కేసీఆర్
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం, గ్రామసభ ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సర్పంచ్ అంజయ్య మధ్య సంభాషణ సాగిందిలా.. సీఎం కేసీఆర్: హలో సర్పంచ్: సార్ నమస్తే సార్ సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా? సర్పంచ్: బాగున్న సార్.. బాగున్న సార్ సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి. సర్పంచ్: 22 తారీఖా సార్. సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్ టేకాఫ్ చేద్దాం ఇగ. సర్పంచ్: ఓకే సార్. థాంక్యూ సార్. సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్ హైదరాబాద్ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా? సర్పంచ్: 2,600 సార్. సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ? సర్పంచ్: మూడు వేలకు సరిపోతది సార్. సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా.. సర్పంచ్: అయితే ఎక్కువ గావలే సార్.. సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్స్ట్రా అనుకుందాం. సర్పంచ్: సరిపోతది సార్. సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్ వచ్చి సపరేట్ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్ కూడ వస్తది. సర్పంచ్: ఇప్పుడే వస్తదా సార్? సీఎం: ఆ.. కలెక్టర్ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్ సర్పంచ్: సార్.. ఓకే సార్ సీఎం: దీనికి కూడ రెయిన్ ఫ్రూప్ టెంట్ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్‌కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్‌గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా.. సర్పంచ్: ఊరు చిన్నది సార్. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్ టర్నింగ్‌ల, కొండాపూర్ రోడ్ల, అక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్ దగ్గర.. సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు. సర్పంచ్: అక్కన్నే పెడ్తసార్. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్. ట్రాఫిక్ ఇబ్బంది ఉండది. సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత. సర్పంచ్: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి.. సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది? సర్పంచ్: మాది ఊరి లోపలుంటది సార్. చిన్నది పెంకల ఇల్లు సార్. సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా. సర్పంచ్: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పోవాలే సార్. సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్ చేసుకుందాం. సర్పంచ్: ఒకే సార్, సరే సార్. సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు. సర్పంచ్: నా దగ్గర అట్లాంటివి లేవు సార్. సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్ మంచిగ ఇంప్లిమెంట్ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి. సర్పంచ్: మీ దయ, బ్లెస్సింగ్స్ సార్. సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది. సర్పంచ్: సరే సార్ సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద. సర్పంచ్: అర్థమైంది సార్. సీఎం: మీటింగ్ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్ తిని మీటింగ్ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం. సర్పంచ్: మంచిది సార్. -
CM KCR: వాసాలమర్రి సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు వాసాలమర్రి సర్పంచ్ పోగుల అంజయ్య ఫోన్ చేసి మాట్లాడారు. ఈనెల 22న దత్తత గ్రామంలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా ఊరంతా సామూహిక భోజనం చేద్దామని, అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. ఈ క్రమంలో సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని అంజయ్యకు సూచించారు. ఇక ఈ పర్యటన సందర్భంగా తుర్కపల్లి (మం), వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆరోజే(ఈనెల 22)న ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలిస్తున్నారు. కాగా, గతేడాది జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ పర్యటన ముగించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా వాసాలమర్రిలో ఆగి, స్థానికులతో మాట్లాడిన విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధిపై చర్చించిన ఆయన.. ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వాసాలమర్రిని సందర్శించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా... నూతన కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యలాయాలు ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం కేసీఆర్ సిద్ధిపేటకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 20న ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. చదవండి: త్వరలో సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..