volleyball tourny
-
Prime Volleyball League: వాలీబాల్ లీగ్‌కు వేళాయె... ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే!
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడలో కూడా లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు మొదలయ్యే ఈ లీగ్ ఈనెల 27న ఫైనల్‌తో ముగుస్తుంది. మ్యాచ్‌లు రాత్రి 7 గంటల నుంచి జరుగుతాయి. మ్యాచ్‌లను సోనీ టెన్–1,2,3,4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, చెన్నై బ్లిట్జ్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టార్పెడోస్, కాలికట్ హీరోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ పేర్లతో మొత్తం 7 జట్లు బరిలో ఉన్నాయి. ఒక్కో జట్టులో 14 మంది చొప్పున ఆటగాళ్లు ఉండగా, అందులో గరిష్టంగా ఇద్దరు విదేశీ యులు. గ్రూప్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొంటుండటం విశేషం. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచకప్ గెలుచుకున్న జట్లలో సభ్యుడైన అమెరికా దిగ్గజం డేవిడ్ లీ కాలికట్ తరఫున ఆడ బోతున్నాడు. హెన్రీ బెల్, జెరోమ్ వినీత్, అజిత్, అశ్వల్ రాయ్, అమిత్ గులియా, ముత్తుస్వామి ఇతర కీలక ఆటగాళ్లు. హైదరాబాద్ జట్టుకు విపుల్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... అర్జెంటీనాకు చెందిన రూబెన్ వెలోచిన్ కోచ్‌గా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ప్రేక్షకులను లీగ్ చూసేందుకు అనుమతించడం లేదు. బేస్ లైన్ వెంచర్స్ సంస్థ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను ప్రమోట్ చేస్తుండగా... ఫాంటసీ గేమ్ కంపెనీ అ23 ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
సెమీఫైనల్‌కు యు ముంబా
చెన్నై: ప్రొ వాలీబాల్ లీగ్‌లో యు ముంబా వాలీ జట్టు సెమీఫైనల్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. చెన్నైలో సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 10–15, 15–12, 15–13, 15–12, 15–8తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టుపై గెలిచింది. కాలికట్, కొచ్చి జట్లు గతంలోనే సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకోగా... చెన్నై, యు ముంబా, బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన సెట్ల స్కోరు ఆధారంగా చెన్నై (+1), యు ముంబా (–1) ముందంజ వేయగా... బ్లాక్ హాక్స్ హైదరాబాద్ (–3) నిష్క్రమించింది. లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టు పాయింట్ల ఖాతానే తెరువలేదు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో కాలికట్ హీరోస్తో యు ముంబా తలపడుతుంది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ ఆడుతుంది. గురువారం విశ్రాంతి దినం తర్వాత... శుక్రవారం ఫైనల్ పోరు జరుగుతుంది. -
బ్లాక్ హాక్స్ హైదరాబాద్ శుభారంభం
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్‌హాక్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 15–11, 13–15, 15–11, 14–15, 15–9తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై విజయం సాధించింది. బ్లాక్ హాక్స్ కెప్టెన్ కార్సన్ క్లార్క్ (15 పాయింట్లు) జట్టు గెలుపులో కీలకభూమిక పోషించాడు. అతను 12 స్పైక్ పాయింట్లు సహా 2 సర్వీస్, 1 బ్లాక్ పాయింట్ సాధించాడు. ఇతనితో పాటు అశ్వల్ రాయ్ (14 పాయింట్లు) రాణించాడు. ప్రత్యర్థి అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసోవ్ (12 పాయింట్లు), గగన్‌దీప్ సింగ్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నప్పటికీ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయారు. ఓవరాల్‌గా అహ్మదాబాద్ స్పైక్‌లో 33 పాయింట్లు సాధిస్తే... హైదరాబాద్ 39 చేసింది. సర్వీస్‌లో బ్లాక్‌హాక్స్ 8, డిఫెండర్స్ 4 పాయింట్లు చేయగా, ప్రత్యర్థి తప్పిదాలతో అహ్మదాబాద్‌కు 16 పాయింట్లు వస్తే, హైదరాబాద్‌కు 19 పాయింట్లు లభించాయి. -
28న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ
ఆత్మకూరు (రాప్తాడు) : రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామంలో ఈ నెల 28 నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్‌వైకే బృందం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ టోర్నీ ఉంటుందన్నారు. విజేత జట్టుకు రూ. 8వేలు, రన్నర్స్ జట్టుకు రూ.5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 97012 29767, 99668 02067, 98853 32097లో సంప్రదించాలని కోరారు.