అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యతిరేకించడం లేదని.. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తప్పక తమ దేశానికి వస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో పీసీబీకి ఈ మేరకు అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చాడు.
పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025
కాగా 2017 తర్వాత తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐసీసీపైనే భారం వేసిన పాక్ బోర్డు
ఈ క్రమంలో హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని.. అందుకు తగ్గట్లుగానే టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా తమ దేశంలోనే నిర్వహిస్తామని.. ఆ జట్టును తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని పేర్కొంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ బాస్‌గా నియమితుడు కావడంతో పాక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన రషీద్ లతీఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
సగం ప్రక్రియ పూర్తైంది
‘‘జై షా నియామకాన్ని పీసీబీ ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనే అనుకుంటున్నా. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్ వస్తే.. అందుకు జై షానే కారణం అనుకోవచ్చు. భారత ప్రభుత్వ మద్దతుతో అతడు బోర్డును ఒప్పిస్తాడు. ఇందుకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తైంది. టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది’’ అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా సంచలనానికి తెరతీశాడు.
కాగా 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టుకు అక్కడికి వెళ్లి పదహారేళ్లకు పైనే అయింది. 2008లో చివరగా టీమిండియా పాక్‌లో పర్యటించింది. 2013 తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు తెరపడింది.
చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’
Comments
Please login to add a commentAdd a comment