మందమర్రిలో నకిలీ నోట్ల కలకలం
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా కూరగాయల మార్కెట్లో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. హోల్‌సేల్ కూరగాయల వ్యాపారి పవన్‌కుమార్ చిరు వ్యాపారులకు కూరగాయలు వేసి సాయంత్రం డబ్బులు తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 5న కూరగాయల వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఇంటికి వెళ్లి లెక్కించే సమయంలో నకిలీ రూ.200 నోట్లు కనిపించాయి. ఒకే నంబరుతో ఉన్న మూడు కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. గురువారం రూ.200 నోట్లు మరో రెండు ఆయనకే వచ్చాయి. వీటిపైనా ఒకే నంబర్లు ఉండడం గమనార్హం. మార్కెట్లో రూ.200, రూ.500 నోట్లు నకిలీవి చెలామణి అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ నోట్ల విషయమై ఎస్సై రాజశేఖర్‌ను సంప్రదించగా.. వ్యాపారి పవన్‌కుమార్‌కు నకిలీ నోట్లు వచ్చాయని తెలిపాడని, ఆ నోట్లను తీసుకుని రావాలని సూచించగా రాలేదని పేర్కొన్నారు. నకిలీ నోట్లపై పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment