బాలోత్సవాలు పక్కాగా నిర్వహించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: బంగారు బాల్యం కార్యక్రమం కింద ఈ నెల 14 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న బంగారు బాలోత్సవాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి బాలోత్సవాల నిర్వహణపై మండల స్థాయి అధికారులతో బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ వారం పాటు నిర్వహించే బాలోత్సవాల్లో బంగారు బాల్యానికి శ్రీకారం–బాలోత్సవాలతో ప్రారంభం, మన హక్కులు తెలుసుకుందాం, మనకోసం మనం, మా పిల్లలు–మా బాధ్యత, సదా బాలల సేవలో, మా కళలు–మాస్వప్నాలు, చేయి చేయి కలుపుదాం–బంగారు బాల్యాన్ని అందిద్దాం అనే ఇతివృత్తాలతో ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. దీనిలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని ఆదేశించారు. బాలల చట్టాలు, హక్కులు వాటి పరిరక్షణ, ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హతలు వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ చిన ఓబులేసు, ఐసీడీఎస్ పీడీ మాధురి, డీఈఓ కిరణ్‌కుమార్, మెప్మా, డీఆర్‌డీఏ పీడీలు రవికుమార్, వసుంధర, డీఎంహెచ్‌ఓ సురేష్, కార్మిక డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, బీసీ సంక్షేమ అధికారి అంజల ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కలిసిరావాలని కోరారు. బంగారు బాలోత్సవాలను పండుగ వాతావరణంలో అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment