● పండుగ పూట ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ● సంక్రాంతి నేపథ
ఆదిలాబాద్: పండుగ పూట ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. సంక్రాంతి నేపథ్యంలో నడిపే ప్రత్యేక సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్‌పై 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులన్నీ నిండుగా వెళుతుండడంతో పలు సందర్భాల్లో టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందికరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి. తాజాగా అదనపు భారంతో పండుగ పూట సొంత ఊర్ల బాట పట్టే ప్రయాణికుల జేబులకు చిల్లు పడనుంది. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, విద్యార్థులు సొంతూళ్ల బాట పడుతారు. ఈ సారి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అయితే స్పెషల్ చార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట బస్సుల్లో సీట్లు దొరకడం లేదని, తాజాగా అదనపు బాదుడు తోడు కానుందని టికెట్ తీసుకునే ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
ఐదు రోజుల పాటు..
పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పె షల్ బస్సులను షురూ చేసింది. అ యితే ఆయా సర్వీసుల్లో ప్రయాణించే వారిపై 50 శాతం అదనపు చార్జీ వసూలు చేస్తుంది. ఈ నెల 10 నుంచి 12 వరకు అలాగే 19, 20 తేదీల్లో ఇవి వర్తిస్తాయని వెల్లడించింది. మొత్తంగా ఐదు రోజులపాటు అదనపు చార్జీలు ఉంటాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో మాత్రం ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ప్రభుత్వం 2003లో జారీచేసిన జీవో అనుసరించి ప్రత్యేక సందర్భాల్లో డీజిల్, నిర్వహణ ఖ ర్చులకు అనుగుణంగా ధరల ను సవరించవచ్చని సంస్థ అధికారులు చెబుతున్నారు.
మహాలక్ష్ములకు ఉచితమే...
స్పెషల్ చార్జీల పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నప్పటికీ, మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యాన్నే కొనసాగించనున్నారు. ఎప్పటిలాగే ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఆడపడుచులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు వెల్లడించారు.
485 ప్రత్యేక బస్సులు..
పండుగ రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఈనెల 10 నుంచి 12 వరకు 290 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలాగే ఈ నెల 19, 20 తేదీలలో 195 స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సులు ఆదిలాబాద్ రీజియన్ నుంచి హైదరాబాద్ జేబీఎస్‌కు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోలకు నడవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment