సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన సర్వే సోమవారంతో ముగిసింది. మంగళవారం(నేటి) నుంచి శుక్రవారం వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సభల్లో నోటీసు బోర్డుపై అర్హులైన వారి పేర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా వాటిని చదివి వినిపిస్తారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎవరైనా ఫిర్యాదులు అందజేసినా స్వీకరిస్తారు. గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ సభలపై అందరి దృష్టి నెలకొంది.
చిక్కుముడులు వీడినట్టేనా..
ఈ నాలుగు సంక్షేమ పథకాల అమలు పరంగా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అర్హుల జాబితాను ఎంపిక చేశారు. ఇక వాటిని గ్రామసభలో ప్రవేశపెట్టిన తర్వాత యథావిధిగా ఆమోదం పొందుతాయా.. లేనిపక్షంలో అభ్యంతరాలు వ్యక్తమై ఆ జాబితా నుంచి పలు దరఖాస్తులపై అనర్హత వేటు పడుతుందా అనేది చూడాల్సిందే. ప్రధానంగా సాగు యోగ్యం లేని భూమి నిర్ధారణకు సంబంధించి సర్వేలో అధికారుల దృష్టికి అనేక అంశాలు వచ్చాయి. వీటిలో కొంత భూమి ఇతర అవసరాలకు వినియోగించగా, మిగిలిన భూమి సాగు చేస్తుండడంతో ఈ భూమికి సంబంధించి రైతు భరోసా ఇచ్చేందుకు ఎలా ముందుకెళ్లాలనే విషయంలో కొంత తికమక ఎదురైనట్లు తెలుస్తోంది. అయితే కలెక్టర్ సోమవారం రాత్రి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో దీనిపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మిగతా వాటి విషయంలోనూ క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఇకపోతే మంగళవారం నుంచి గ్రామసభల నిర్వహణ ఎలా సాగుతుందనేది ఆసక్తికరం.
జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు తేలిన అంశాలు..
రైతు భరోసా వివరాలు..
రైతుబంధు అందిన విస్తీర్ణం
: 5,15,271 ఎకరాలు
సాగు యోగ్యం లేని భూమి : 3,027 ఎకరాలు
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..
వచ్చిన దరఖాస్తులు : 1,97,448
పరిశీలన: అన్ని దరఖాస్తులకు
సంబంధించి పూర్తి
సొంత స్థలం ఉన్నవారు : 91,594
ఇల్లు లేదు, జాగలేదు :28,927 (మరికొన్ని మండలాల వివరాలు రావాల్సి ఉంది)
రేషన్ కార్డులు..
వచ్చిన దరఖాస్తులు: 18,741
పరిశీలన పూర్తయింది : 18,212 (పూర్తి సమాచారం రావాల్సి ఉంది)
ఇందులో అర్హులు : 17,269
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాలు :1,71,505
అధికారుల అంచనా ప్రకారం అర్హులయ్యే కుటుంబాలు:లక్షకు పైగా..
Comments
Please login to add a commentAdd a comment