తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
జి.మాడుగుల: మండలంలో వంజరి పంచాయతీ బూసుపల్లి గ్రామంలో రెండోవీధిలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ గ్రామంలో మొదటివీధి గల ప్రజలకు తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించారని గ్రామస్తులు పాంగి లక్ష్మణరావు, కిల్లో కాంతమ్మ తెలిపారు. బూసుపల్లి గ్రామంలో రెండోవీధిలోని తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూసుపల్లి మొదటివీధిలో గల ఇళ్లకు ఇంటింటి కుళాయి ద్వారా తాగునీటి సదుపాయం కల్పించి, రెండోవీధిలో బావి నిర్మాణం చేపట్టారని దీని వలన పూర్తి స్థాయిలో ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు. బావి వేసవి కాలంలో ఎండిపోయి నీరుండడం లేదని దీంతో తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో 35ఇళ్లు, సుమారు 150 మంది ఆదివాసీ గిరిజనుల ఉన్నారని, ప్రజావసరాలకు తగ్గట్టుగా తాగునీటి వసతి లేదన్నారు. బూసుపల్లి గ్రామం రెండోవీధి ప్రజలకు వేసవికాలంలో తీవ్ర నీటీ సమస్య, వర్షాకాలంలో బావి నుంచి బురదనీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బూసుపల్లి రెండోవీధిలో తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment