ప్రాణం తీసిన ఈత సరదా
పెందుర్తి: పాఠశాలలకు సెలవు కావడంతో సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. పెందుర్తి సమీపంలోని నల్లక్వారీ మడుగులో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చినముషిడివాడ సమీపంలోని హుద్‌హుద్ కాలనీలో నివాసం ఉంటున్న ధీరజ్ ప్రధాన్ దంపతులకు నలుగురు సంతానం. పదేళ్ల క్రితం నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన ధీరజ్ కార్పెంటర్‌గా పనులు చేస్తుంటాడు. అతని రెండో కుమారుడు అర్జున్ ప్రధాన్(12) చినముషిడివాడలోని పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం క్రిస్మస్ సెలవు కావడంతో మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వారితో కలిసి సమీపంలోని నల్లక్వారీ మడుగులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన అర్జున్ మృతి చెందాడు.
తప్పిపోయాడని ఫిర్యాదు : ఇంటి నుంచి బయటకు వెళ్లిన అర్జున్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో బుధవారం రాత్రి పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో తండ్రి ధీరజ్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం నల్లక్వారీ మడుగులో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి వెళ్లిన సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐ అసిరితాత మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం మృతదేహం గుర్తింపు కోసం ధీరజ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విగతజీవిగా పడి ఉన్న అర్జున్‌ను చూసి కు టుంబ సభ్యు లు గుండెలవిసేలా రోధించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
నల్లక్వారీ మడుగులో మునిగి బాలుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment