8 ఎకరాల్లో గంజాయి తోటల దహనం
పాడేరు : జిల్లాలో పెదబయలు మండలంలోని మారుమూల పాతపాడు గ్రామంలో ఎనిమిది ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి గుర్తించారు. ఈ తోటలను సోమవారం ఐజీ ఆకే రవికృష్ణ, ఈగల్ ఎస్పీ నాగేష్‌బాబు, ఎస్పీ అమిత్‌బర్దర్ సమక్షంలో అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో దహనం చేశారు. అనంతరం పాతపాడు గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. గంజాయి సాగు, రవాణా వల్ల గ్రామానికి, సమాజానికి కలిగే నష్టాలను వివరించారు. ఇకపై తాము గంజాయి సాగు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటామని స్థానిక గిరిజనుల చేత ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి సాగును పూర్తిగా మానుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలైన రాజ్‌మా, చిరుధాన్యాలు వంటి వాణిజ్య పంటలతో పాటు పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ దాడుల్లో పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండలాల సీఐలు, ఎస్‌ఐలు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండు వేల ఎకరాల్లో డ్రోన్లతో సర్వే : ఐజీ రవికృష్ణ
స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఐజీ రవికృష్ణ విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెండు వేల ఎకరాల్లో డ్రోన్లతో సర్వేచేసినట్టు చెప్పారు.గంజాయి, ఇతర డ్రగ్స్ సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు ఫోన్ చేసి, సమాచారమిచ్చి పోలీస్ శాఖకు సహకారం అందించాలని కోరారు. ఈగల్ ఎస్పీ నాగేష్‌బాబు, ఎస్పీ అమిత్‌బర్దర్, డీఎస్పీ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి నిర్మూలనకు సమష్టి కృషి : కలెక్టర్
జిల్లాలో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అన్ని ప్రభు త్వ శాఖలు సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐజీ రవికృష్ణ, ఎస్పీ అమిత్‌బర్దర్, ఈగల్ ఎస్పీ నాగేష్‌బాబుతో కలిసి గంజాయి నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సాగును శాశ్వతంగా విడిచిపెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, తోట ల సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు, జిల్లా వ్యవశాయ శాఖ అధికారి నందు, టీడబ్ల్యూ డీడీ రజనీ, డ్వామా పీడీ విద్యసాగర్, డీపీవో లవరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment