వణికిస్తున్న చలిగాలులు
● ఉదయం 10గంటల వరకు పొగమంచు
● మినుములూరులో 11, చింతపల్లిలో 11.3, అరకులోయలో 12డిగ్రీల నమోదు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో చలిగాలులు కొనసాగుతున్నాయి.అన్ని ప్రాంతాల్లో ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. సూర్యోదయం ఆలస్యమవుతోంది. పొగమంచు తీవ్రతకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. చలిగాలులతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 11డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 11.3 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వైద్యశాఖలో ఉద్యోగాలకు రేపటి వరకు దరఖాస్తు గడువు
రంపచోడవరంలో స్వీకరణ కౌంటర్
సాక్షి,పాడేరు: స్థానిక వైద్య కళాశాల, పాడేరు జిల్లా సర్వజన ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 10వతేదీ సాయంత్రంతో ముగుస్తుందని ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోని దరఖాస్తుదారుల సౌకర్యార్థం ఈనెల 9,10 తేదీల్లో రంపచోడవరం ఏడీఎంహెచ్‌వో(అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి) కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులు పాడేరు వైద్య కళాశాలకు రాకుండా రంపచోడవరం కౌంటర్‌లోనే దరఖాస్తులు అందజేయాలని ఆమె కోరారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగాలలో 29 కేటగిరీలకు సంబంధించి 244 పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. వీటిలో కాంట్రాక్ట్ పోస్టులు 107, అవుట్ సోర్సింగ్ పోస్టులు 137 ఉన్నాయన్నారు. గత నెల 31వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించామని తెలిపారు. జనవరి 10వతేదీ సా యంత్రం 5గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని,మరిన్ని వివరాలు www.gmc paderu.com ఉన్నాయని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment