![సుడిదోమ సోకిన వరి పైరు - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/29/28akp31a-320004_mr_0.jpg.webp?itok=zrRzz_5_)
సుడిదోమ సోకిన వరి పైరు
అనకాపల్లి టౌన్: ఈనెల 30న అల్పపీడనం ఏర్పడి డిసెంబర్ 4వ తేదీన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కోత కోసిన వరి పైరును కాపాడుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ పి.వి.కె.జగన్నాథరావు సూచించారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పలు వేసి లేదా నూర్చుకొని జాగ్రత్త చేసుకోవాలని, పూత దశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం మానిపండు తెగులు సోకే అవకాశం ఉందని చెప్పారు. వరి పైరులో మానిపండు తెగులు నివారణకు లీటరు నీటికి టెబుకొనజోల్ 1 గ్రాము లేదా ప్రపికోనజోల్ 1 ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. పూత దశలో ఉన్న పైరులో సాయంత్రం వేళలో మాత్రమే పిచికారీ చేసుకోవాలని, వరిలో సుడిదోమ గమనించినట్లయితే లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా బుప్రోఫిజిన్ 1.6 ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. వరి పైరులో నీరు నిలబడినట్లయితే రెల్ల రాల్చుపురుగు ఆశించే ఆవకాశం ఉన్నందున.. నివారణకు లీటరు నీటికి మోనోక్రొటోఫాస్ 1.6 ఎంఎల్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. రబీలో వరి సాగు చేసుకొనే రైతులు స్వల్పకాలిక వరి రకాలైన ఎంటీయూ 1121, ఎంటీయూ 1156, ఎంటీయూ 1210లను ఎకరాకు 30 కిలోల వంతున విత్తుకోవాలని పేర్కొన్నారు. వరి మాగాణుల్లో తగినంత తేమ ఉన్నప్పుడు వరి కోసే 3 రోజుల ముందు విత్తనం కోసం జనుమును ఎకరాకు 15 కిలోల చొప్పున విత్తుకుంటే లాభదాయకంగా ఉంటుందని, 1 లేదా 2 తడులు ఇచ్చే సదుపాయం ఉన్నప్పుడు పెసరలో అధిక దిగుబడినిచ్చే ఐపీయూ2–14, ఎల్‌జీజీ 460 వంటి రకాలను ఎకరాకు 10–12 కిలోల వంతున విత్తుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సిహెచ్.ముకుందరావు, ఎం.బి.జి.ఎస్.కుమారి, ఆర్.సరిత, ఎ.శిరీష, వి.చంద్రశేఖర్, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు.
4న భారీ వర్షాలు పడే అవకాశం
కుప్పలు వేసి.. లేదా నూర్చుకొని వరి పైరును కాపాడుకోవాలి
పూతదశలో మానిపండు తెగులు వచ్చే ప్రమాదం
ఏడీఆర్ జగన్నాథరావు సూచనలు
![వరిలో మానిపండు తెగులు 1](https://www.sakshi.com/gallery_images/2023/11/29/28akp31b-320004_mr.jpg)
వరిలో మానిపండు తెగులు
Comments
Please login to add a commentAdd a comment