అనకాపల్లి టౌన్ : కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశ్యంతో ఈ శ్రమ్ పథకం ప్రవేశపెట్టిందని, ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ ఇంచార్జి అధికారి కె. వసంతరావు కోరారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వ్యవసాయ రంగ కార్మికులు, ఆశా వర్కర్స్, వలస కార్మికులు, ఇళ్లలో, దుకాణాల్లో పనిచేయు కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి వర్తకులు, మత్స్యకార కార్మికులు, పాల వ్యాపారులు, చేతి వృత్తి పనివారు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఈ పథకానికి అర్హులని, ఈ పథకంలో నమోదుకు ఆధార్ కార్డు నకలు, దానికి లింక్ అయిన సెల్ ఫోన్ నెంబర్ ఉండాలని తెలిపారు. వారందరూ ఇ–శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇ–శ్రమ్ కార్డు కలిగిన కార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే బీమా రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయలు సహాయం పొందుటకు అర్హులని వసంతరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment