![ఏరియా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10adr05-320016_mr-1739218716-0.jpg.webp?itok=CCFCjBFu)
ఏరియా ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీఏఆర్‌ఎం మెషీన్
● తొలి శస్త్రచికిత్స చేసిన వైద్యులు
నక్కపల్లి : స్థానిక 50 పడకల ఏరియా ఆస్పత్రికి ప్రభుత్వం రూ.20 లక్షల విలువైన ఆర్థోపెడిక్ వైద్యపరికరం (సి–ఏఆర్‌ఎం) మెషీన్‌ను సమకూర్చింది. ఈ పరికరాన్ని ఉపయోగించి ఆస్పత్రిలో వైద్యులు సోమవారం తొలి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. స్థానిక 30 పడకల ఆస్పత్రిని గత ప్రభుత్వం 50 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. అదనపు భవనాల కోసం రూ.3 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఆస్పత్రిలో ఆధునిక సదుపాయాలతో అదనపు భవనాలు నిర్మించారు. ఆర్ధోపెడిక్ సర్జన్‌ను కూడా నియమించడంతో ఏరియా ఆస్పత్రిలో ఏడాదిన్నర నుంచి ఆర్థోపెడిక్ వైద్య సేవలు కూడా అందుతున్నాయి. నియోజకవర్గంలో పాయకరావుపేట నుంచి పెనుగొల్లు వరకు సుమారు 30 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. నిత్యం ఈ రహదారిపై ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవించడం పలువురు క్షతగాత్రులవుతున్నారు. కాళ్లు చేతులు, ఎముకలు విరిగిన వీరికి శస్త్ర చికిత్సలు చేయాలన్నా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి, లేదా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం తరలించేవారు. లేదా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఇక్కడ ఆఽర్థోపెడిక్ సర్జన్‌ను నియమించి, రూ.14లక్షలతో ఆధునిక డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను సమకూర్చింది. అప్పటి నుంచి క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. అయితే పెద్ద ప్రమాదాలు జరిగి ఎముకలు విరిగితే శస్త్రచికిత్స చేయడం కోసం తాజాగా ప్రభుత్వం ఈ ఆస్పత్రికి రూ.20లక్షల విలువైన సి –ఏఆర్‌ఎం మెషీన్‌ను సమకూర్చింది. హోం మంత్రి అనిత ప్రభుత్వాన్ని కోరడంతో వారం రోజుల క్రితం ఈ పరికరాన్ని ఆస్పత్రికి కేటాయించారు. ఎముకలు విరిగి శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఈ పరికరంలో చూస్తూ విరిగిన ఎముకలను అతికించడం, స్క్రూలు, ప్లేట్లు వేయడం, కేవైరు ఉపయోగించడం వంటి వైద్య సేవలు అందించవచ్చు. ఈ సీఏఆర్‌ఎం పరికరాన్ని ఉపయోగించి సోమవారం బాధితుడికి ఆస్పత్రిలో తొలి శస్త్ర చికిత్స చేశారు. అడ్డురోడ్డుకు చెందిన అప్పలకొండ అనే వ్యక్తికి ప్రమాదంలో బొటన వేలు విరిగిపోయింది. ఇతనికి డిజిటల్ ఎక్స్‌రే తీసి విరిగిన బొటన వేలును సీఏఆర్‌ఎం పరికరం ఉపయోగించి శస్త్ర చికిత్స చేసినట్టు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో ఇటువంటి వైద్యం చేయించుకుంటే రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
![ఏరియా ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీఏఆర్‌ఎం మెషీన్ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10adr06-320016_mr-1739218716-1.jpg)
ఏరియా ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీఏఆర్‌ఎం మెషీన్
![ఏరియా ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీఏఆర్‌ఎం మెషీన్ 2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10adr07-320016_mr-1739218716-2.jpg)
ఏరియా ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీఏఆర్‌ఎం మెషీన్
Comments
Please login to add a commentAdd a comment