![పక్కాగా 100 రోజుల ప్రణాళిక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10cvm250-320035_mr-1739218717-0.jpg.webp?itok=eqDS5oqz)
పక్కాగా 100 రోజుల ప్రణాళిక
● టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కసరత్తు ● జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 22,022 మంది విద్యార్థులు ● ఆరు సమస్యాత్మాక కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ● జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ● తెనుగుపూడి గురుకుల విద్యాలయంలో రాత్రి అకస్మిక తనిఖీలు
దేవరాపల్లి : పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జి. అప్పారావు నాయుడు అన్నారు. ఈ మేరకు మండలంలోని తెనుగుపూడి డా. బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో ఆదివారం రాత్రి అకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్ధుల హాజరును, రికార్డులను పరిశీలించారు. వంద రోజుల విద్యా ప్రణాళికను తప్పనిసరిగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్ధులపై ఒత్తిడి చేయకుండా ఇష్టపడి చదివే విధంగా సిద్దం చేయాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చదువుకొని, మరలా రాత్రి 10 గంటలకు వరకు చదివేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఉదయం 8 గంటల ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. రాత్రి వేళ పదో తరగతి విద్యార్దులు ఇంటి దగ్గర చదువుతున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు విద్యార్ధుల ఇళ్లను డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సందర్శించి పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మన జిల్లాలో మాత్రమే ఈ తరహా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఈక్రమంలోనే తాను కూడా రాత్రి పూట గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలను అకస్మికంగా సందర్శించడంతో పాటు విద్యార్ధుల ఇళ్లకు సైతం వెళ్లినట్టు తెలిపారు.
జిల్లాలో 107 టెన్త్ పరీక్ష కేంద్రాలు
జిల్లాలో 107 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 407 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 22,022 మంది పదవ తరగతి విద్యార్ధిని, విద్యార్దులు పరీక్షలు రాస్తారన్నారు. మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆరు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామని, సదరు కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాగా పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని డీఈవో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment