![పిల్లల్లో నులిపురుగులు నివారించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10akp30-320004_mr-1739218717-0.jpg.webp?itok=cH_WGLfv)
పిల్లల్లో నులిపురుగులు నివారించాలి
● కలెక్టర్ విజయకృష్ణన్ ● విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
అనకాపల్లి : పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. జాతీయ నులిపురుగల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకు స్థానిక మొయిన్‌రోడ్డు జీవీఎంసీ పెద్దహైస్కూల్‌లో సోమవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాలు వయసులోపు విద్యార్థులు ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని, మాత్రల వల్ల ఏవిధమైన ఇబ్బందులు ఉండవని, ఒక వేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా స్కూల్‌కి రాకపోతే మరలా ఈనెల 17న మాత్రలు పంపిణీ చేయాలని ఆమె కోరారు. నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా అల్బెండాజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటివి ఉంటాయిని ఆమె తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చేతులు, శుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లు ఉపయోగించిన తరువాత రెండు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని డీ హైడ్రేషన్ రాకుండా అందరూ తరచూ మంచినీరు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పడాల రవికుమార్, డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, జోనల్ కమిషనర్ బి.వి.రమణ, జిల్లా కార్యక్రమం అధికారి జె.ప్రశాంతి, ఎంఈవో ఎస్.కోటేశ్వరరావు, హెచ్‌ఎం బ్రహ్మాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment