సాక్షి, అనకాపల్లి: పంచాయతీరాజ్ విభాగంలో వివాదాస్పదంగా మారిన ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు బదిలీల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అనకాపల్లి డీపీవో శిరీషరాణిపై ఈవోపీఆర్డీలు విశాఖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నచ్చిన వారిని అందలం ఎక్కించారన్న విమర్శలు వినిపించాయి. ఈ అక్రమ బదిలీల కారణంగా దీర్ఘకాలంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు ఇప్పటికీ మైదాన ప్రాంతాలకు రాలేకపోయారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న వారు గిరిజన ప్రాంతాలకు వెళ్లకుండా తమ పలుకుబడిని ఉపయోగించి స్థానికంగానే పోస్టింగ్‌లు సంపాదించుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ కలెక్టర్ ఈ బదిలీల వ్యవహారంపై జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తితో విచారణకు ఆదేశించారు. దీని ప్రకారం సీఈవో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పోస్టింగ్‌ల వివరాలు కోరినప్పటికీ.. సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోవడం, విచారణకు హాజరుకావాలని రెండుసార్లు అనకాపల్లి డీపీవో, అల్లూరి జిల్లా డీపీవోలకు చెప్పినా డుమ్మా కొట్టడంతో విచారణ నుంచి అనకాపల్లి, అల్లూరి జిల్లాలను మినహాయించారు. దీంతో బాధిత ఈవోపీఆర్డీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించినట్టు సమాచారం రావడంతో మరో విచారణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తోంది. ఈవోపీఆర్డీలకు, పంచాయతీ కార్యదర్శులకు విచారణకు హాజరుకావాలని సోమ, మంగళవారం నోటీసులు పంపించారు. బుధవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిగింది. పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు హాజరయ్యారు. మరో నాలుగు రోజులు విచారణ జరగనున్నట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదే..!
అవకతవకలు జరిగాయంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయంగా జరగలేదంటూ పంచాయతీరాజ్ ఉద్యోగులు విస్తుపోతున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో జరిగిన ఈవోపీఆర్డీ బదిలీల్లో అక్రమాలు జరిగితే.. గ్రామ సచివాలయాల కార్యదర్శులకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడమేంటని పంచాయతీ అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అసలు దొంగలకు కొమ్ముకాయడానికి కూటమి నేతల నుంచి ఉన్నతాధికారుల వరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరిపినట్టు కాలయాపన చేసి... చివరకు మమా అనిపించేశారు. బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే విచారణను పక్కదారి పట్టించడం ఇపుడు పంచాయతీరాజ్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
తొలిరోజు 10 మంది హాజరు
అనకాపల్లి జిల్లాలో పంచాయతీరాజ్ విభాగంలో జరిగిన బదిలీల్లో అవకతవలపై విచారణ చేస్తున్నాం. తొలిరోజు 10 మంది పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు విచారణ ఉంటుంది. విచారణకు రావాలని పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశాం. వాస్తవాలను స్వచ్ఛందంగా మా దృష్టికి తీసుకురావాలి.
– సుబ్బలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, విచారణ అధికారి
జెడ్పీ సీఈవో ఎంక్వయిరీకి సహకరించని అనకాపల్లి డీపీవో
ఈవోపీఆర్డీల బదిలీల వివాదంపై మరో విచారణ
విచారణాధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment