●నేత్రపర్వం.. వెంకన్న తెప్పోత్సవం
ఘనంగా
క్షీరాబ్ది
ద్వాదశి
నక్కపల్లి: ఉత్తరాంధ్రుల కొంగుబంగారం ఉపమాక వెంకన్న సన్నిధిలో క్షీరాబ్ది ద్వాదశి (చిలుక ద్వాదశి) పర్వదినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీ కల్కి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ సందర్భంగా తిరువీధి సేవ, బంధుర సరస్సులో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంపైన, శ్రీ సీతారాముల వారి ఉత్సవమూర్తులను, శ్రీ శయన పెరుమూళ్ వారిని ఆంజనేయ వాహనంపైన అధిష్టింపచేసి స్వామివారి పుష్కరిణి వద్ద గల లంక వారి మండపం వద్దకు తీసుకుని వెళ్లారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం శయన పెరుమాళ్ వారిని పడవలో అధిష్టింపచేసి స్వామివారిని పుష్కరిణి మధ్యలో ఉన్న మండపం వద్దకు తీసుకుని వెళ్లి ప్రత్యేక ఆరాధనలు, చిమ్మిడి నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు, సీతారాముల వారికి, శయన పెరుమాళ్ వారికి విశేష ప్రసాద నివేదనలు, తీర్ధ గోష్టి నిర్వహించిన తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను రాజాధిరాజ వాహనంలోనూ, శ్రీ సీతారాములు, శయన పెరుమాళ్ వారిని ఆంజనేయ వాహనంలోనూ అధిష్టింపచేసి గ్రామ తీరువీధి సేవ నిర్వహించారు. ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, భక్తులు దేవస్ధానం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment