డబ్బులిస్తేనే కుళాయి కనెక్షన్
● కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం
నక్కపల్లి : ‘కుళాయి కనెక్షన్ కావాలంటే డబ్బు కట్టాలి.. లేకపోతే కనెక్షన్ ఇవ్వం.. ఫ్రీగా కావాలంటే టైమ్‌పడుతుంది..అర్జంట్ అయితే మేము అడిగినంత డబ్బులు చెల్లించి కనెక్షన్ పొందండి..’ అంటూ గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైపులైన్లు వేసి ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లు కేటాయించారు. సుమారుగా రూ.133 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు, బోర్లు నిర్మించి, ప్రధాన వీధుల్లో పైపులైన్లు వేసి, మెయిన్ పైపులైనుకు కుళాయి పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆపై మెయిన్‌లైను నుంచి లూపులైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. మండలంలోని గొడిచర్ల గ్రామంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. మెయిన్‌లైనుకు ఆనుకుని ఉన్నవారికి, మెయిన్‌లైను నుంచి మూడు మీటర్ల దూరంలో ఉన్న లూపు లైన్లలో ఉన్నవారికి కనెక్షన్ ఉచితంగానే ఇస్తున్నారు. మూడు మీటర్లు దూరం దాటి ఉన్నవారికి మాత్రం కనెక్షన్ ఇవ్వడం లేదు. ఇదేమని కాంట్రాక్టర్లను అడిగితే ఫ్రీగా ఇప్పట్లో వేసే ప్రసక్తి లేదని, రెండో విడతలోనో, మూడో విడతలోను వేస్తామని, డబ్బులు ఇస్తే ఇప్పుడే వేసేస్తాం అని చెబుతున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే వెయ్యి రూపాయల నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని, పైపులు, ట్యాపులు తెచ్చుకుంటే రూ.500 నుంచి వెయ్యి వసూలు చేస్తున్నారని వారు చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి గ్రామానికి సగటున రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసింది. మెయిన్ పైపులైను, లూపులైన్లు, ట్యాపులు సైతం ఈ నిధుల నుంచే ఖర్చు చేయాలి. కానీ ఫ్రీగా ఇవ్వాల్సిన కనెక్షన్‌లను కూటమి ప్రభుత్వం వచ్చేక డబ్బులు వసూలు చేసి ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగభూషణం వద్ద ప్రస్తావించగా కుళాయి పైపులైన్లు ఏర్పాటు పనులు కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, పర్యవేక్షణ మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖదేనన్నారు. డబ్బులు వసూలు చేస్తున్న విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment