స్మార్ట్ మీటర్లు షాక్ కొడతాయి జాగ్రత్త!
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న
దేవరాపల్లి: విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న పిలుపునిచ్చారు. దేవరాపల్లిలో స్మార్ట్ మీటర్ల బిగిస్తున్న వారిని మంగళవారం ఆయన ప్రశ్నించారు. దేవరాపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్ల బిగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటరు విశాఖలో బిగించి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలకు ప్రభుత్వం పూనుకుందని ఆయన విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలు కొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారని వెంకన్న గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరవేగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుండడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతో డబ్బులు ఉంటేనే ఇకపై పేద ప్రజల ఇళ్లలో లైట్లు వెలుగుతాయని లేకుంటే అంధకారంలో మగ్గిపోవాల్సిందేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే దళిత గిరిజనుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడే అవకాశం ఉందని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment