కొత్త మరుగుదొడ్ల మంజూరుకు సర్వే
● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, బహిరంగ మలవిసర్జన నివారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన సామాజిక దురాచారమని, పర్యావరణం, ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాటిని నివారించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమన్నారు.
విద్యార్థులు ఆహారం తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. కొత్త మరుగుదొడ్ల మంజూరుకు, సామూహిక మరుగుదొడ్ల మరమ్మతులకు గ్రామీణ నీటి సరఫరా విభాగం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి ఎఎస్‌ఎ. రామస్వామి మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా హమారా సౌచాలయ్ హమారా సమ్మాన్ నినాదంతో ప్రచారాన్ని డిసెంబర్ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త మరుగుదొడ్ల మంజూరు కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టరు కె. అనంతలక్ష్మి, , గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటా సర్వే చేపట్టాలి
తుమ్మపాల: జిల్లాలో ఇంటింటి సర్వే చేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని, డిసెంబరు 10 నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటి సమావేశంలో ఆమె మండలాల వారీగా నిర్మాణ పనులు పురోగతిని సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment