సృజన వెలికితీసేందుకే బాలోత్సవ్
డాబాగార్డెన్స్: మహారాణిపేటలోని సెయింట్ ఆంథోనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విశాఖ బాలోత్సవం వేడుకగా ప్రారంభమైంది. విశాఖ బాలోత్సవం అధ్యక్షుడు పిల్లల మర్రి రఘు అధ్యక్షతన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బేతవోలు రామబ్రహ్మం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ బాలోత్సవం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పిల్లలను ప్రోత్సహించేందుకు ఇటువంటి వేదికలను ఉపయోగించుకోవాలని స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులకు సూచించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ పిల్లలు దేనినైనా సూక్ష్మంగా గ్రహిస్తారన్నారు. కన్సర్న్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పీకే జోష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ రత్నకుమార్ మాట్లాడుతూ విశాఖలోని బాలలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇన్ని ఈవెంట్స్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యదర్శి జీఎస్ రాజేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు కె.రమాప్రభ మాట్లాడుతూ రెండు నెలలుగా ఈ కార్యక్రమం కోసం కృషి చేయగా 120 పాఠశాలల నుంచి దాదాపుగా 8 వేల మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు 84 సాంస్కృతిక, ఈవెంట్స్ ఉంటాయని, తొలి రోజు 27 ఈవెంట్స్ నిర్వహించామన్నారు. 100 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు, ఆసరా చారిటబుల్ సొసైటీ ప్రతినిధి శ్రీనాథ్, ఆహ్వాన సంఘం సభ్యురాలు కె సుశీల, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధి వై.మోదాంబికా దేవి, ఎం.ఎల్లాజీ, ఎం.గుణశంకర్, వై.సత్యనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ బాలోత్సవంలో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment