యువత సన్మార్గంలో నడవాలి
నర్సీపట్నం: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాదక ద్రవ్యాలకు యువత బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా నేడు మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఏవిధంగా చెడిపోతున్నారో వివరించి, వారిని తిరిగి సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ సంకల్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. యువతపై మాదక ద్రవ్యాల ప్రభావంపై పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు సంబంధిత స్కూల్, కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. వీడియోలను ప్రదర్శిస్తున్నామన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పట్టుబడిన నిందితులకు గరిష్టంగా 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తున్నారన్నారు. చట్టాల తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలపై బానిసలైన యువకులు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి నేరస్థులుగా మారుతున్నారన్నారు.
డ్రగ్స్ వినియోగదారులు, క్రయవిక్రయాలు జరిపే వారిపై నిఘా పటిష్టం చేస్తున్నామని, సరఫరా చేసే వారి సమాచారం 9392918196 తెలియజేయాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం మత్తు పదార్థాలతో యువత శరీరం, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్.కృష్ణ, సీఐలు గోవిందరావు, రేవతమ్మ, ఎస్సైలు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దు
ఎస్పీ తుహిన్ సిన్హా
Comments
Please login to add a commentAdd a comment