పుస్తెల బంధనం!
పుత్తడి బొమ్మకు..
జిల్లాలో కలవరపరుస్తున్న బాల్య వివాహాలు
వయసు రాకుండానే పెళ్లి పీటలెక్కుతున్న బాలికలు
చట్టాలున్నా చట్టుబండలే
ఇటీవల అనకాపల్లి గాంధీనగరం పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. బాలిక తరపున ఎవరో చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి వివాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జిల్లా సీ్త్ర, శిశుసంక్షేమ అధికారులపై బాలిక బంధువొకరు తిరగబడ్డాడు. పోలీసుల సాయంతో అతికష్టం మీద తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆ వివాహాన్ని ఆపారు.
చిన్నారిని చేయొద్దు పెళ్లికూతురు
యలమంచిలి పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి పదో తరగతి పూర్తయిన 15 ఏళ్ల బాలికను ప్రసవం కోసం తీసుకురావడంతో వైద్యులు నివ్వెరపోయారు. తమ వద్ద డెలివరీ చేయడానికి కుదరదని చెప్పడంతో వారు పక్క జిల్లాలో ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లిపోయారు. ఈ విషయం బాలిక నివసిస్తున్న గ్రామంలో ఐసీడీఎస్, మహిళా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.
రెండేళ్లలో ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాలు
151
బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్
1098
యలమంచిలి రూరల్:
ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా.. ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. చిన్నారి పెళ్లి కూతురికి పుస్తెల బంధనం తప్పడం లేదు. ఇందుకు నిరక్షరాస్యత, పేదరికం కొంత కారణం కాగా.. తల్లిదండ్రుల ఆలోచనా విధానం మరో ప్రధాన కారణం. తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్న కొందరు తల్లిదండ్రుల ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన బాలికల మెడల్లో పుస్తెల తాళ్లు పడుతున్నాయి. లోకం పోకడ తెలియకుండానే బిడ్డలకు బాల్యంలోనే వివాహాలు చేసి వారి జీవితాలను కొందరు తల్లిదండ్రులు చేజేతులా అగాధంలోకి నెడుతున్నారు. 18 సంవత్సరాలు నిండకుండా వివాహాలు చేస్తే అనారోగ్యంతో కుంగిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.
అడ్డుకుంటున్నా.. ఆగడం లేదు
బాల్య వివాహాలను మాతాశిశు సంక్షేమ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు బాల్య వివాహాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్న వారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే, అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. పెద్దయితే తాము చెప్పిన సంబంధం చేసుకుంటుందో లేదో అనే ఆలోచనతో మరికొందరు, ప్రేమలో పడి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తుందేమోనన్న భయంతో ఇంకొందరు.. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గత రెండేళ్లలో అధికారుల దృష్టికి వచ్చిన 151 బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి రాకుండా జరిగిపోతున్న పెళ్లిళ్లు అనేకం ఉంటున్నాయి.
●బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బాధ్యత మోస్తూనే అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు గర్భం దాలిస్తే తల్లికీ, బిడ్డకు ప్రాణాపాయం ఉంటుంది.
●ఎంతో సందడిగా ఆనందోత్సాహాలతో జరగాల్సిన పెళ్లి అధికారుల జోక్యంతో అర్థంతరంగా ఆగిపోతే రెండు కుటుంబాల వారికీ నగుబాటే కదా. అందుకే పెళ్లి వయసు రాకుండా ముహూర్తాలు పెట్టుకొని, అడ్డుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు.
●బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఏటా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 3 వేల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలోని హైస్కూల్, జూనియర్ కళాశాలల్లో సమావేశం నిర్వహించి బాలికలకు బాల్యవివాహాల వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తారు.
నిద్రావస్థలో యంత్రాంగం
బాల్య వివాహాల నిరోధక చట్టం 2006కు సంబంధించి నిబంధనలను కఠినతరం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 మార్చి 19న జీవో నంబరు 13ను విడుదల చేసింది. బాల్య వివాహాలను నివారించి, ప్రజలను చైతన్యం చేసేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, ఐసీడీఎస్ పీడీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కన్వీనర్లుగా ఉన్నారు. డివిజన్ స్థాయిలో డీఎస్పీ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్లుగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని కమిటీలు ఉన్నప్పటికీ బాల్య వివాహాలు ఆగడం లేదు. గ్రామ స్థాయిలో ఉన్న వారందరికీ వారి పరిధిలో ప్రతి విషయం తెలుస్తుంది. కానీ బాల్య వివాహాల నియంత్రణపై ఉదాసీన వైఖరినే అవలంబిస్తున్నారు.
టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ప్రాణానికే ప్రమాదం
బాల్య వివాహాల వలన వచ్చే గర్భాల వల్ల బాలికలు ఎనీమియా బారిన పడే ప్రమాదం ఉంది. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం, అధిక రక్తపోటుతో మెటర్నల్ డెత్‌లు జరుగుతాయి. బిడ్దను మోసే సామర్థ్యం బాలికలకు తక్కువగా ఉంటుంది. 6 నెలల క్రితం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి 17 ఏళ్ల ప్రాయంలోనే గర్భం దాల్చిన కేసు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాను. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రమాదమే.
–డాక్టర్ ఆర్.నిహారిక,
సివిల్ అసిస్టెంట్ సర్జన్, గైనకాలజిస్ట్, యలమంచిలి సీహెచ్‌సీ
సమాచారం ఇవ్వండి
బాల్య వివాహాలు జరిగినట్టు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పెళ్లిని ఆపుచేస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. తగిన వయసు లేకపోతే మానసిక, శారీరక పరిపక్వత ఉండదు.
–కె.అనంతలక్ష్మి,
ఐసీడీఎస్ పీడీ, అనకాపల్లి
●
బాల్య వివాహం నేరానికి శిక్ష..
బాల్య వివాహం చట్తరీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ కోసం 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు నిండే వరకు బాలికకు వివాహం చేయబోమని ఒప్పంద పత్రం రాయించుకుంటారు.
అందరూ బాధ్యులే..
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహం జరిపించిన తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, అనుమతించిన పెద్దలు, సహకరించిన వారు కూడా నేరస్తులే అవుతారు. మైనర్ బాలికను పెళ్లి చేసుకొని సంసారం చేస్తే పోక్సో కేసు నమోదవుతుంది.
–కె.వి.సత్యనారాయణ, డీఎస్పీ, పరవాడ
Comments
Please login to add a commentAdd a comment