అయ్యన్నను గెలిపిస్తే.. రౌడీరాజ్యమేనని ఆనాడే చెప్పా..
నర్సీపట్నం: నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని ఎన్నికల ప్రచారంలో తాను ఆనాడే చెప్పానని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన మంగళవారం డీఎస్పీ మోహన్‌ను కలిసి శాంతిభద్రతలను కాపాడాలని, రౌడీయిజాన్ని అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అనుచరులైన రౌడీలు హత్యలు, దాడులకు తెగబడడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో నియోజకవర్గంలో తరుచూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. నాతవరం మండలం చుక్కా రాము అనే వ్యక్తిపై దాడి చేశారని, డి.ఎర్రవరంలో సబ్బవరపు వెంకునాయుడికి చెందిన జీడి తోట నరికేశారన్నారు. చీడిగుమ్మల్లో పాకలు తగులబెట్టి ఇళ్లపై దాడి చేశారని, మాకవరపాలెం మండలం యరకన్నపాలేనికి చెందిన కొల్లు అప్పలనాయుడిపై దాడి చేశారన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకు వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఐదు నెలల కాలంలో నియోజకవర్గంలో 250 కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. నర్సీపట్నం టౌన్‌లో మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుపై రౌడీ షీటర్ పప్పలనాయుడు హత్యాయత్నం చేశాడరన్నారు. కొత్తవీధిలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బండారు కొండబాబు, రౌడీ షీటర్ బండారు సంతోష్ రెండు రోజుల క్రితం ఓ సామాన్య వ్యక్తిని హత్య చేశారన్నారు. వీరంతా స్పీకర్ అయ్యన్నపాత్రుడి ముఖ్య అనుచరులు కావటం గమనార్హమన్నారు. ఇందుకు సాక్ష్యంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అతని కుటుంబ సభ్యులతో నిందితులు ఉన్న ఫొటోలను ప్రదర్శించారు. స్పీకర్ అనుచరుల చేతిలో హత్యకు గురైన మృతుడు నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, భార్యకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. టౌన్‌లో సూర్యోదయానికి ముందే వైన్ షాపులు తెరవటం వల్ల ఆకతాయిలు మద్యం సేవించి రెచ్చిపోతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని, మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, టెంపుల మాజీ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, పార్టీ నాయకులు మళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
స్పీకర్ ఇలాకాలో రౌడీయిజాన్ని అరికట్టాలని డీఎస్పీకి వినతి
Comments
Please login to add a commentAdd a comment