వాల్తేరుకి వచ్చేదెవరో?
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్‌ఎం సౌరభ్ కుమార్ ●
● వ్యవస్థను సౌరభ్ నిర్వీర్యం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు ● పోస్ట్ ఖాళీ అయినా విశాఖ వచ్చేందుకు జంకుతున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం:
దాదాపు ఏడాదిన్నర కిందట వరకు రైల్వే వ్యవస్థలో వెలుగు వెలిగిన వాల్తేరు డివిజన్‌కు చీకటి రోజులు దాపురించాయి. డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సౌరభ్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కుంటుపడింది. తన స్వలాభం కోసం మాత్రమే సౌరభ్ పనిచేశారన్న విషయం సీబీఐ దాడులతో సుస్పష్టమైంది. చేయి తడిపితేనే పనులకు పచ్చజెండా ఊపుతామన్న రీతిలో డీఆర్‌ఎం స్థాయి అధికారి వ్యవహరించడంతో.. అభివృద్ధిలో డివిజన్ వెనుకపడింది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్‌లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్‌లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే పరువును డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ పట్టాలు తప్పించేశారు. సెంట్రల్ రైల్వే జోన్‌లో పీసీఎంఈగా పనిచేస్తున్న సమయంలోనే ఆయప వివాదాస్పదుడిగా పేరొందారు. అక్కడి నుంచి డీఆర్‌ఎంగా గతేడాది జూలైలో వచ్చిన తర్వాత.. అవినీతి వ్యవహారాలను వేగవంతం చేసేశారు. డివిజన్ పరిధిలో చిన్న టెండర్ కావాలన్నా.. లంచం డిమాండ్ చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.25 వేల నుంచి రూ.కోట్ల వరకూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందినకాడికి పిండుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ సౌరభ్‌కుమార్ అనుచరవర్గం బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా.. ఎవరూ ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాల్తేరు పరిధిలో పనులన్నీ నిలిచిపోయాయి.
డివిజన్ అభివృద్ధి ఎక్కడ?
డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత అజెండాపైనే దృష్టి సారించిన సౌరభ్‌కుమార్ విశాఖ రైల్వేస్టేషన్, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ గతంలో ప్రతిపాదన చేసినవే.. ఆయన మార్కు అంటూ ఎక్కడా చూపించలేకపోయారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల విషయంలోనూ డీఆర్‌ఎం తన హస్తలాఘవాన్ని చూపించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.390 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన మొదలైన పనులు చేపట్టాల్సి ఉన్నా.. భారీగానే ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే దువ్వాడ లాంటి స్టేషన్‌లో దాదాపు 50 శాతం పనులు పూర్తయినా.. వైజాగ్ రైల్వేస్టేషన్‌లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ఉద్యోగుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 16 నెలల పాటు డీఆర్‌ఎంగా వెలగబెట్టిన సౌరభ్‌కుమార్.. వాల్తేరు పరువును దిగజార్చేశారు. అథపాతాళానికి పడిపోయిన డివిజన్‌కు కొత్త డీఆర్‌ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రైల్వే బోర్డు పలువురు అధికారులను సంప్రదించగా.. విముఖత చూపినట్లు సమాచారం. కాగా.. గత అనూప్ సత్పతిని మళ్లీ డీఆర్‌ఎంగా నియమించాలని సోషల్ మీడియా ద్వారా పలువురు రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నారు.
అభివృద్ధి ఆగిపోయింది
ఏడాది కాలంలో కొత్త రైళ్లేవీ రాలేదు. విశాఖ స్టేషన్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. గతంలో అనూప్‌కుమార్ సత్పత్తి డీఆర్‌ఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు, కొత్త రైళ్లను తీసుకురావడం వల్ల వైజాగ్ స్టేషన్‌కు ఎన్‌ఎస్‌జీ–1 గుర్తింపు వచ్చింది. సౌరభ్ వచ్చిన తర్వాత ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. అవి దువ్వాడ మీదుగానే వెళ్తున్నాయి. వీటిని వైజాగ్ తీసుకురావాలని కోరినా.. సౌరభ్ పట్టించుకోలేదు. పైగా అవినీతికి పాల్పడి సీబీఐకి చిక్కడం డివిజన్‌కు సిగ్గు చేటు.
– డేనియల్ జోసఫ్, రైలు ప్రయాణికుల ప్రతినిధి
సౌరభ్ పనితీరుపై అప్పుడే అనుమానాలు
వైజాగ్ రైల్వే వ్యవస్థ పరువును సౌరభ్‌కుమార్ రోడ్డున పడేశారు. డీఆర్‌ఎం స్థాయి ఉన్నతాధికారి లంచాలు తీసుకోవడం నిజంగా అవమానకరం. ఆయన హయంలో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. కనీసం దానిపై సమగ్ర విచారణ కూడా చేపట్టలేదు. అప్పుడే డీఆర్‌ఎం పనితీరుపై అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. రైళ్ల కోసం అడిగినా ఏ ఒక్కరోజూ పట్టించుకోలేదు. బ్రింగ్‌బ్యాక్ అనూప్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నాం.
– రఘువంశీ, రైలు ప్రయాణికుల ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment