గజ్జె ఘల్లుమంది
సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు
ఏయూక్యాంపస్: బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాలు ఎదురుగా శనివారం ఆదివాసీ స్వాభిమాన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, ఆదివాసీ సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ సంయుక్తంగా మూడు రోజులు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ జి.డి.వి.శంకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు విశాఖ వాసులను, పర్యాటకులను ఆకట్టుకున్నాయి. కొమ్ము, థింసా, జానపద నృత్యాలు అలరించాయి. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ పాడేరు, శ్రీశైలం, రంపచోడవరం, నెల్లూరు, చింతూరు, సీతంపేట ప్రాంతాల నుంచి ఆదివాసీలు తాము తయారు చేసిన, పండించిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయించారు. మిల్లెట్ ఉత్పత్తులు, వస్త్రాలు, వెదురు వస్తువులు, మట్టి కళారూపాలు, గిరిజన ప్రాంతాల్లో లభించే తేనె, వెదురు బొంగు చికెన్‌ను విశాఖ వాసులు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment