అసలు ఫీజు :125/– వసూలు : 1000/–
● టెన్త్ పరీక్ష రుసుం పేరుతో దోపిడీ ● అక్రమంగా భారీ మొత్తంలో వసూలు ● పట్టించుకోని అధికారులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
యలమంచిలి రూరల్: జిల్లాలోని పలు విద్యా సంస్థల యాజమాన్యాలు పది పరీక్షల ఫీజుల పేరుతో దందా ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో అడ్డగోలుగా వసూలు చేస్తున్నా విద్యాశాఖధికారులు పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు గత నెల 25న నోటిఫికేషన్ విడుదల చేశారు.ఆ తర్వాత గడువు పొడిగిస్తూ ఈ నెల 14వ తేదీన మరోసారి ఆదేశాలు జారీ చేశారు.దీని ప్రకారం పదో తరగతి పరీక్ష ఫీజుగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.125 అయితే జిలాలో 90 శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో రూ.200 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తుండగా,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రూ.300 నుంచి రూ.1,000 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఇదేమని అడిగితే పలు సాకులు చెబుతున్నాయి.కొన్ని పాఠశాలల్లో ఫొటోలు, జెరాక్స్ కాపీలు,మైగ్రేషన్ సర్టిఫికెట్ తదితర కారణాలు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అపరాధరుసుంతో వచ్చే నెల 16 వరకు గడువు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 21,793 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు.వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది.ఇందులో భాగంగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.జిల్లాలోని వసతి గృహాలు, గురుకులాలు,కస్తూర్బాల్లో విద్యార్థినీవిద్యార్థులకు ప్రభుత్వమే పరీక్ష ఫీజు చెల్లిస్తుంది. జిల్లా పరిషత్,ప్రైవేట్,ఆదర్శ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తేదీ వరకూ ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చింది.రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 2వ తేదీ వరకు, రూ.200 అపరాధరుసుంతో వచ్చే నెల 9వ తేదీ వరకు,రూ.500 అపరాధరుసుంతో వచ్చే నెల 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇప్పటికే ట్యూషన్,టెర్ము,కంప్యూటర్, బస్సు వంటి అనేక పేర్లతో ఇష్టానుసారం విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు, ఇప్పుడు భారీ మొత్తంలో పరీక్ష ఫీజును వసూలు చేస్తున్నాయి. యలమంచిలి పట్టణానికి చెందిన రెండు ప్రముఖ స్కూళ్లలో రూ.500 వరకు పరీక్ష ఫీజు వసూలు చేస్తుండగా, కొన్ని ప్రైవేటు స్కూళ్లలో రూ.500 నుంచి రూ.1000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు.జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయం అధికారుల పేరు చెప్పి అన్నీ చూసుకోవాలంటూ అధిక ఫీజులు గుంజుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కారు స్కూళ్లలోనూ అదే తీరు..!
ప్రభుత్వ అధీనంలో వివిధ యాజమాన్యాల పరిధిలో నడుస్తున్న స్కూళ్లలో కూడా పది పరీక్ష ఫీజుల మోత మోగుతోంది.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో ఎక్కువమంది పేద విద్యార్థులే. వీరి నుంచి రూ.200 నుంచి రూ.250 వరకు పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా కంప్యూటర్, ఇతర ఖర్చులుంటాయని నమ్మబలకడం దురదష్టకరమని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం బయటకు చెప్పవద్దంటూ పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు విద్యార్థులు,వారి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
వసూలు చేసిన ఫీజును తిరిగి ఇప్పించాలి
జిల్లాలో చాలా స్కూళ్లలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధికంగా పదవతరగతి ఫీజు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదు.కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో కూడా అదనంగా వసూళ్లు చేశారు.దీనిపై విచారణ జరపాలి. విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి ఇప్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా శాఖాపరంగా చర్యలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
– మైలపల్లి బాలాజీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
మా అబ్బాయికి రూ.500 కట్టాను
మా అబ్బాయి యలమంచిలి పట్టణంలో శ్రీచైతన్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.వచ్చే మార్చిలో జరగబోయే టెన్త్ పరీక్షలకు హాజరయ్యేందుకు నా దగ్గర్నుంచి రూ.500 వసూలు చేశారు.ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే కాగా దీనికి నాలుగు రెట్లు ఫీజు వసూలు చేశారు.ఇది చాలా అన్యాయం.ఇలాంటి అక్రమ వసూళ్లను నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.
– కె.హెచ్.జి. దేవర (చిన్నా మాస్టారు),
పులపర్తి,యలమంచిలి మండలం
ఫిర్యాదులొస్తే విచారణ జరుపుతాం
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు జారీ చేసిన ఆదేశాల ప్రకారం నిర్ణీత ఫీజు మాత్రమే వసూలు చేయాలి.అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. టెన్త్ పరీక్ష ఫీజు అధికంగా వసూలు చేసినట్టు రుజువైతే శాఖాపరమైన చర్యలు తప్పవు.ఏవో కారణాలు చెప్పి నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు.దీనిపై విచారణ జరుపుతాం.
– గిడ్డి అప్పారావునాయుడు,
డీఈవో,అనకాపల్లి
Comments
Please login to add a commentAdd a comment