విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చర్యలు
● వారి సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
తుమ్మపాల : చట్టప్రకారం విభిన్న ప్రతిభావంతులకు కల్పించిన హక్కులను వారికి అందజేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం సహాయం, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని వారికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను శాఖలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు జి.వి.బి. జగదీష్ మాట్లాడుతూ సంక్షేమ శాఖ ద్వారా మూడువేల మందికి ఉపకరణాలు అందజేసినట్టు తెలిపారు. అందులో 196 బ్యాటరీ వాహనాలు, 600 వినికిడి యంత్రాలు ఉన్నాయని, ఇంకా 35 మందికి ఉపకరణాలు అందజేయవలసి ఉందన్నారు.
ఉపకరణాల పంపిణీకి గ్రామాలలో సర్వే నిర్వహించి లబ్దిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో విభిన్న ప్రతిభావంతులకు అవసరైమెన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని, అందుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె. వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు రవికుమార్, అర్జునరావు, శ్రీరాములు మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్లలో తప్పుల సవరణకు చర్యలు తీసుకోవాలని, స్కిల్ డెవలప్‌మెంటు ద్వారా శిక్షణ అందించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, 70 శాతం వైకల్యం గల వారికి కూడా నూరు శాతం సబ్సిడీతో పాసులు మంజూరు చేయాలని, యూనిక్ ఐడీ కార్డులు పంపిణీ పూర్తి చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మోహనరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరెక్టర్ కె. శచీదేవి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.సరోజిని, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పూర్ణిమాదేవి, మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టరు కె.అనంతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్.శిరీషా రాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment