రెండున్నరేళ్ల తర్వాత కుటుంబం చెంతకు
మహారాణిపేట(విశాఖ): ఏడు పదుల వయసు. భార్య కరోనాతో మరణించింది. కొడుకు కుటుంబంతో ఇమడలేనంటూ చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేశాడు. కొడుకు వెతుకులాడినా ప్రయోజనం లేకపోయింది. తీరా మనసు మార్చుకుని కొడుకు వద్దకు వెళ్లాలనుకునేసరికి కొడుకు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. మరో దిక్కులేక రోడ్డున పడ్డ అతన్ని నగరంలోని పెదవాల్తేర్‌లో ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హోంలెస్ షెల్టర్ ఆదుకుంది. వారి చొరవతో రెండున్నరేళ్ల తర్వాత ఆ అభాగ్యుడు తన కుటుంబం వద్దకు చేరుకోగలిగాడు. సినిమా స్టోరీని తలపించే ఈ వ్యథలో ప్రధాన వ్యక్తి మధురవాడ ప్రాంతానికి చెందిన గొలగాని చింతాలు(70). భార్య లక్ష్మి కరోనా సోకి మరణించడంతో కొడుకు పాల్ వద్దకు చేరాడు. కుటుంబ సమస్యలతో ఎవరికీ చెప్పకుండా 2022లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు పాల్ ఎంతగా వెతికించినా ప్రయోజనం లేకపోయింది. కొన్నాళ్ల తర్వాత చింతాలు తన కొడుకు ఇంటికి వెళ్లాడు. అప్పటికే కొడుకు కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేసి ఉండటం, ఇరుగు పొరుగువారు కూడా హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటున్నారో తెలియదని చెప్పడంతో మళ్లీ రోడ్డున పడ్డాడు. చివరకు విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌ను ఆశ్రయించాడు. 2022 జూన్ 1న రెడ్‌క్రాస్ సిబ్బంది రైల్వే స్టేషన్ ప్రాంతంలో రెస్క్యూ చేస్తుండగా చింతాలు ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తూ కనిపించాడు. ఆరా తీసి, ఆయన్ను హోంలెస్ షెల్టర్‌కు తరలించారు. చింతాలు కుడి కన్నుకు సమస్య రావడంతో విశాఖ ఐ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించారు. రెడ్‌క్రాస్ సిబ్బంది మధురవాడ వెళ్లి చింతాలు కుమారుడి కోసం ఆరా తీయగా, తమకు దొరికిన సమాచారంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వారు ఉంటున్నట్లు తెలుసుకున్నారు. చివరకు పాల్ అడ్రస్ దొరకడంతో సమాచారం అందించారు. చింతాలు మనవడు క్రాంతికుమార్ తన స్నేహితుడితో కలిసి రెడ్‌క్రాస్ షెల్టర్‌కు వచ్చాడు. తాతను చూసిన ఆనందం, బాధ కలగలిపి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తాతను చూసి రెండున్నరేళ్లయిందని, ఆయన ఆచూకీ దొరక్క చనిపోయాడనుకున్నామని చెప్పాడు. తాతను తమకు క్షేమంగా అప్పగించినందుకు రెడ్‌క్రాస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్ల తర్వాతనైనా చింతాలును వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించడం సంతోషంగా ఉందని షెల్టర్ మేనేజర్ మురళి ఆనందం వ్యక్తం చేశారు.
తాతా మనవడిని కలిపిన రెడ్‌క్రాస్ హోంలెస్ షెల్టర్
Comments
Please login to add a commentAdd a comment