గాల్లో ప్రాణాలు
పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పరవాడ, అచ్యుతాపురం సెజ్ పరిధిలో వరుస ప్రమాదాలు, పెద్ద సంఖ్యలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలంటేనే కార్మికుల కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి. ఐదున్నర నెలల వ్యవధిలో వివిధ ప్రమాదాల్లో 27 మంది కార్మికులు మృతి చెందారు. 80 మందికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. పరిశ్రమల్లో మరణ మృదంగంపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై కార్మిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆగస్టు నెలలో అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో, పరవాడ సెజ్‌లోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్–3లో జరిగిన ప్రమాదాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ పీడ కలలను మరువక ముందే పరవాడలోని ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విషవాయువులు (హెచ్‌సీఎల్) లీకై ఒడిశాకు చెందిన అభిజిత్ దాస్ అనే కార్మికుడు మృతి చెందారు. మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు
ఎవరికీ పట్టని భద్రత ప్రమాణాలు
శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహం (ఫైల్)
సాక్షి, అనకాపల్లి: ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వం హైపవర్ కమిటీల పేరుతో హడావుడి చేస్తుంది. కంపెనీల్లోని లోపాలపై నిరంతరం తనిఖీలు చేయడంలేదు. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పరిశ్రమల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో సేఫ్టీ అండ్ ఆడిట్ సమావేశం నిర్వహించినా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ప్రమాదాలకు కారణమైన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ సంభవించేవికాదు.
రక్షణ లేని కార్మిక జీవితాలు
ఫార్మా పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇళ్లకు తిరిగి వస్తారన్న ధీమా ఉండడం లేదు. వారు ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యులు టెన్షన్‌తో ఎదురుచూసే దుస్థితి ఏర్పడింది. పరవాడ– అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలో పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షనన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించకపోవడంతో పాటు కొన్నిసార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా పరిశ్రమల్లో కూడా స్థానికుల కంటే స్థానికేతరులనే ఎక్కువగా తీసుకోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రశ్నించే వారే లేకుండా పోతున్నారు. చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు సరైన అంబులెన్స్ లాంటి వాహన సౌకర్యాలు, వారి పరిశ్రమల్లోనే వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగి అక్కడ నుంచి నగరానికి చేరేలోపు కార్మికులు మృత్యువాత పడుతున్నారు.
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం
పరిశ్రమల్లో రక్షణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో కార్మికుల రక్షణ, భద్రత ప్రమాణాలు, నిత్యం తనిఖీలు వంటివి వట్టి మాటలుగానే మిగిలాయి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు, నాయకులు అనంతరం ఇటువైపు చూడడం లేదు. నెలకు కనీసం రెండు ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. పరవాడ జేఎన్ ఫార్మా సిటీలో గల ఠాగూర్ కంపెనీలో మంగళవారం కంపెనీ ఉత్పత్తి కర్మాగారంలో రియాక్టర్–కమ్–రిసీవర్ ట్యాంక్ (జీఎల్‌ఆర్–325) నుంచి 400 లీటర్ల హెచ్‌సీఎల్ లిక్విడ్ లీక్ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు జరగగా.. మర్నాడు ఉదయం 6 గంటల తరువాత అధికారులు, యాజమాన్య ప్రతినిధులు స్పందించారు. ఘటన జరిగి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి వుంటే తమ సహచరులు మరణించి ఉండేవాడు కాదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా ఉన్నత అధికారులు కంపెనీ యాజనాన్యాలకు కొమ్ము కాస్తూ..కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
గత ఐదున్నర నెలల్లో జరిగిన ప్రమాదాలు..
Comments
Please login to add a commentAdd a comment