దగా పడ్డ వలంటీరు..
నడి రోడ్డుపై నినాదాల హోరు
అనకాపల్లి: సేవే పరమావధిగా పనిచేశారు.. ప్రజల అభిమానం చూరగొన్నారు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంతా తామై మెలిగారు.. వేతనం రూ.10 వేలు చేస్తానన్న సీఎం చంద్రబాబు మాట నిలుపుకోకపోవడంతో ఇప్పుడెంతో వేదన చెందుతున్నారు. తమ ఆవేదన ఆలకించమని నెహ్రూ చౌక్ కూడలిలో గ్రామ/వార్డు వలంటీర్లు బుధవారం మానవహారం నిర్వహించారు. ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. అంతకు ముందు జరిపిన భారీ ర్యాలీలో ఏపీ గ్రామ/వార్డు వలంటీర్ల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీప్తి, సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, రూ.10 వేల జీతాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు మాసాల జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. దేశంలో లక్షలాది మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం అనేది ఎక్కడా జరగలేదని, ఏపీలోనే రెండు లక్షల 65 వేల మంది వలంటీర్లు వీధిన పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వకపోగా లక్షలాది మంది వలంటీర్లను తొలగించడంతోపాటు ఇసుక డిపోలు, ప్రభుత్వ మద్యం షాపుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పొట్ట కొట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని, వలంటీర్ల వ్యవస్థను కొనసాగించే విధంగా చర్యలు తీసుకుని తమ లక్షలాది కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. జిల్లా యూనియన్ నాయకులు కిరణ్, పీర్ సాహెబ్, విజయ్‌కుమార్, సంధ్య, అయోధ్య, గీత, ప్రసాద్, దేముడు, శ్యామల, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment