‘రైవాడ’లో సీడబ్ల్యూసీ నిపుణుల బృందం
● జలాశయం స్థితిగతుల పరిశీలన ● రూ.336 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు ● సాంకేతిక అంశాలపై అధ్యయనం ● 1.60 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసేలా గేట్ల పునరుద్ధరణ ● నివేదిక ఆధారంగా జలాశయం అభివృద్ధికి సాంకేతిక అనుమతులు ● ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఈ సుగుణాకర్‌రావు వెల్లడి
దేవరాపల్లి: రైవాడ జలాశయాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిపుణుల బృందం బుధవారం సందర్శించింది. బృంద సభ్యులైన హర్యానాకు చెందిన సాంకేతిక నిపుణులు అఖిలేష్, ఈజిప్టుకు చెందిన సివిల్ ఎక్స్‌పర్ట్ హనీతోపాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ (సీఈ) ఎస్.సుగుణాకర్‌రావు, విజయవాడకు చెందిన ఇరిగేషన్ ఎస్‌ఈ యాస్టికా, ఈఈ విజయానంద్, జిల్లా ఈఈ త్రినాథం తదితర్లు జలాశయాన్ని పరిశీలించారు. సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయడంలో భాగంగా జలాశయం వరద గేట్లు, స్పిల్‌వే, కుడి, ఎడమ కాలువల మదులంను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. జలాశయం వద్ద అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ఫొటోలను తీసుకున్నారు.
ప్రపంచ బ్యాంకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
డ్యామ్ రీహేబిలిటేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టు (డ్రిప్) పథకంలో రైవాడ జలాశయం అభివృద్ధికి రూ.336 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధుల మంజూరుకు ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో సాంకేతికపరమైన అంశాల పరిశీలనకు సీడబ్ల్యూసీ బృందం వచ్చిందని రాష్ట్ర ఇరిగేషన్ సీఈ సుగుణాకర్ తెలిపారు. నిపుణుల పర్యవేక్షణ అనంతరం నివేదికను సీడబ్ల్యూసీ చైర్మన్‌కు అందిస్తారని, ఈ నివేదిక ఆధారంగా జలాశయ అభివృద్ధికి సాంకేతిక అనుమతులు రాగానే నిధులు మంజూరవుతాయన్నారు. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న 10 వర్టికల్ స్పిల్‌వే గేట్లను రేడియల్ గేట్లుగా మార్చి, అదనంగా మరో స్పిల్‌వే గేటు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. స్పిల్‌వే గేట్ల ద్వారా 1.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేలా గేట్లను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
రూ.వెయ్యి కోట్లతో మూడు జలాశయాల అభివృద్ధి
రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్లతో శ్రీశైలం, ధవళేశ్వరం, రైవాడ జలాశయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నట్లు సుగుణాకర్ తెలిపారు. ముందుగా సీడబ్ల్యూసీ బృందాన్ని ఎమ్మె ల్యే బండారు కలిసి, జలాశయ ప్రాధాన్యతను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment