విజయహజారే ట్రోఫీకి విశాఖ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

విజయహజారే ట్రోఫీకి విశాఖ సిద్ధం

Published Thu, Dec 19 2024 9:15 AM | Last Updated on Thu, Dec 19 2024 9:15 AM

-

● ఈ నెల 21 నుంచి లీగ్‌ మ్యాచ్‌లు

విశాఖ స్పోర్ట్స్‌: దేశవాళీ లిస్ట్‌ ఏ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీకి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా మొత్తం 38 జట్లు లీగ్‌ దశలో పోటీపడనుండగా, గ్రూప్‌–డీ మ్యాచ్‌లు ఈ నెల 21 నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి. ముంబయ్‌, నవీ ముంబయ్‌ వేదికల్లో ఆంధ్ర జట్టు గ్రూప్‌ బీలో ఆడనుంది. లీగ్‌ దశలో ఏడు వన్డే మ్యాచ్‌లు వైఎస్సార్‌ స్టేడియంలో జరగనున్నాయి. గ్రూప్‌ దశ పోటీలు రౌండ్‌–రాబిన్‌ పద్ధతిలో జనవరి 5తో ముగియనుండగా.. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జనవరి 9 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 18న ఫైనల్‌ జరగనుంది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా విశాఖ వేదికగా మొదటి మ్యాచ్‌ ఈ నెల 21న ఉదయం 9 గంటలకు ఛత్తీస్‌గఢ్‌, మిజోరం జట్ల మధ్య జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌ జట్టుకు అమన్‌దీప్‌, మిజోరం జట్టుకు జోథన్‌ సంగా కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు. రెండో మ్యాచ్‌ ఈ నెల 23న రింకూసింగ్‌ కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్‌ జట్టు మిజోరంతో తలపడనుంది. 26న మూడో మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో సాయికిశోర్‌ నాయకత్వంలో తమిళనాడు జట్టు ఆడనుంది. 28న నాలుగో మ్యాచ్‌ కరణ్‌ నాయర్‌ కెప్టెన్సీలో విదర్భ జట్టు, మనన్‌వోరా కెప్టెన్సీలో చండీగఢ్‌ జట్టు మధ్య జరగనుంది. ఈ నెల 31న తమిళనాడుతో విదర్భ, జనవరి 3న చత్తీస్‌గఢ్‌తో పరాస్‌దోగ్రా కెప్టెన్సీలో జమ్ముకశ్మీర్‌ జట్టు ఆడనుంది. లీగ్‌ చివరి మ్యాచ్‌ జనవరి 5న జమ్ముకశ్మీర్‌తో చండీగఢ్‌ తలపడనుంది.

ఈ సారి భరత్‌ కెప్టెన్సీలో..

ఆంధ్ర జట్టు ఈసారి కె.ఎస్‌.భరత్‌ కెప్టెన్సీలో ఆడనుంది. భరత్‌ వికెట్ల వెనుక నిలబడటంతో పాటు ఓపెనర్‌గా రానున్నాడు. జట్టులోని మరో ముఖ్య ఆటగాడు రికీబుయ్‌ టాపార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు. అశ్విన్‌ హెబ్బర్‌ ఓపెనర్‌గా, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌, పృథ్వీలు టాపార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగనున్నారు. మిడిలార్డర్‌లో తేజ రానున్నాడు. మీడియం పేస్‌తో శశికాంత్‌, అఖిల్‌, మహీప్‌, సత్యనారాయణ, తపస్విలు చెలరేగనుండగా, స్పిన్‌తో అభినవ్‌, అంజనేయులు, సందీప్‌, కుమార్‌ బంతిని గింగిరాలు తిప్పనున్నారు. ఆంధ్ర తన తొలి మ్యాచ్‌ను రైల్వేస్‌తో ఆడనుండగా, రాజస్థాన్‌, సిక్కిం, సర్వీసెస్‌, మేఘాలయ, మహారాష్ట్రలతో వరసగా మ్యాచ్‌లాడనుంది. లీగ్‌ చివరి మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌తో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement