● తప్పుడు చిరునామాతో బట్టబయలు ● పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిల్వలు
మల్కాపురం: పారిశ్రామిక ప్రాంతంలో అద్దె ఇంట్లో భారీగా గంజాయి నిల్వలను బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి నుంచే ఆటో ద్వారా వివిధ ప్రాంతాలకు గంజాయి పంపిణీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వివరాలివీ.. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి న్యూఢిల్లీకి ఒక కొరియర్ సంస్థ ద్వారా గంజాయి పార్శిల్ పంపారు. అయితే కొరియర్ చేరాల్సిన చిరునామా తప్పుగా ఉండటంతో.. అక్కడి పార్శిల్ బాయ్‌కు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఇక్కడి నుంచి పంపిన సంస్థకు తెలియజేసి పార్శిల్‌ను తిరిగి విశాఖ పంపాడు. దీంతో వారు ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పార్శిల్ తనిఖీ చేసి అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కొరియర్ సంస్థకు పార్శిల్ పంపిన వ్యక్తులు ఇచ్చిన చిరునామా(60వ వార్డు పరిధిలోని ఎంఐజీ–1, 22–65–5–22 క్వార్టర్స్)ను పరిశీలించగా.. అది ప్రమోద్‌కు చెందిన పాత ఇంటి చిరునామాగా తేలింది. ప్రమోద్ బిహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులకు నెలకు రూ.9వేలకు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. సదరు వ్యక్తులు ఒక ఆటోను అద్దెకు తీసుకుని.. ఆ ఇంట్లో గంజాయి బస్తాలను నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఆటో ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి.. 100 కిలోల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మల్కాపురం పోలీసుల సహాయంతో ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ కేసులో బుధవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment