ఏరియా ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి
నర్సీపట్నం: స్థానిక ఏరియా ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి చేస్తానని, ప్రస్తుతం ఉన్న 150 పడకల స్థానంలో 200 పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధుల సేకరణకు సహకారం అందిస్తానని, డాక్టర్ల క్వార్టర్స్ మరమ్మతులకు అవసరమైన రూ.15 లక్షల నిధుల కేటాయింపు తోడ్పాటునందిస్తానని తెలిపారు. శానిటేషన్, రోగుల భోజనం నాణ్యతలో మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు రిఫర్ చేశారో కారణాలతో సమర్పించాలని ఆదేశించారు. కొత్త అంబులెన్స్ ఏర్పాటుకు ఎంపీ హామీ ఇచ్చారన్నారు. సీటీ స్కాన్ అవసరాన్ని డాక్టర్లు సూచించగా దీని ఏర్పాటుకు రూ. 2.5 కోట్లు ఖర్చు అవుతుందని డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం ఎన్‌ఆర్‌ఐల, ప్రభుత్వ సహకారం కోసం కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు. కొత్తగా నిర్మించిన భవనానికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, అంబులెన్స్‌నుమరమ్మతులు చేయించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవో వి.వి.రమణ, కమిషనర్ జంపా సురేంద్ర, సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment